Begin typing your search above and press return to search.
న్యూసెన్స్ (వెబ్ సీరీస్)
Date of Release: 2023-05-12
నటీనటులు: నవదీప్, బింధు మాధవి, రమేష్ కోణంబొట్ల తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: అనంత్ నాగ్ కావూరి
నిర్మాత: టి.జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ప్రవీణ్ కుమార్
కథ : 2000 మదనపల్లి.. ప్రజలకు నిజాలను చెబుతున్నాం అని కవరింగ్ ఇస్తూ వార్తలను కవర్ చేసే జర్నలిస్ట్ లు.. చదువుకున్న వారు డబ్బుకి అమ్ముడవ్వరు అంటూ తన పొలం ఆక్రమణ విషయాన్ని వారికి వినిపించడానికి వచ్చిన అమాయకపు అయ్యప్ప. మందుగుండు సామాను తరలిస్తూ ఉండగా వారిని ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు.. అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్ గా చేస్తున్న వ్యక్తిని దారుణ హత్య. భర్త కనిపించట్లేదని పోలీసుల చుట్టూ తిరుగుతున్న భార్య. చిన్న పిల్లాడిని కాపాడుకోవాలని ఒక అమ్మ చేసిన త్యాగం.. ఇవన్ని ఎలా జరుగుతున్నాయి.. ఎందుకు జరుగుతున్నాయి అని తెలిసినా మౌనంగా వాళ్ళు వీళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని వార్తలను తప్పుదోవ పట్టిస్తున్న రిపోర్టర్లు.. ఇదే న్యూసెన్స్ కథ.
కథనం-విశ్లేషణ :
మదనపల్లి లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రాసుకున్న ఈ వెబ్ సీరీస్ కథ. ఆరు ఎపిసోడ్స్ తో వచ్చింది. టైటిల్స్ లో క్యూరియాసిటీ పెంచేలా చేసినా కథ కథనాల్లో పెద్దగా క్రియేటివిటీ కనిపించలేదు. వార్తలను తప్పుదోవ పట్టిస్తూ తమకు తోచిన వార్తలను రాసే మీడియా. అందులో రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ గా పనిచేస్తున్న శివ (నవదీప్) తనలో తాను ఏదో మదనపడుతూనే జరుగుతున్న వాటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోడు. పోలీసులు మనల్ని చూసి భయపడి పక్కకు తప్పుకోవడం కాదు రెస్పెక్ట్ ఇచ్చి దారి ఇవ్వాలనే ఆలోచనతో ఉంటాడు శివ. పైకి జర్నలిస్ట్ గా తాను చేస్తుంది తప్పు అని తెలుస్తున్నా బతకాలంటే ఇలా చేయక తప్పదు అన్నట్టు చేస్తుంటాడు. వెంటాడే గతం.. అయ్యప్ప మరణం.. పొలిటికల్ లీడర్స్ ప్రెజర్.. చంపాలని చూస్తున్న మనుషులు.. ఇలా తనలో చాలా షేడ్స్ ఉన్నాయన్నట్టు చూపించాడు. బలం ఉన్నోడికి చేతులెత్తి మొక్కాల.. రాళ్లు ఇసరకూడదు. ఈడ ఎవడి సొమ్ము ఎవడు తినట్లే.. ఎవడి దమ్ము వాడిదే.. మనం న్యూస్ రాస్తే 200.. రాయకపోతే 2 వేలు వస్తాయి.. అందుకే పెన్నులో ఇంకెప్పుడు వేస్ట్ చేయకూడదు.. ఎవడు మాట విన్నా వినకపోయిన న్యూస్ రాసే వాడి చేతిలో ఉంటుంది చరిత్ర.. ఇలా సీజన్ 1 వరకు డైలాగ్స్ తోనే శివ పాత్రని అర్ధమయ్యి కానట్టుగా తీర్చిదిద్దాడు దర్శకుడు.
సీజన్ 1 వరకు హీరోగా శివ చేసింది పెద్దగా ఏమి లేదు. సీజన్ 2 లో అయినా ఏదైనా చేస్తాడేమో మరి. న్యూస్ రీడర్ గా బిందు మాధవి శివ తో ప్రేమ వ్యవహారం కానీ చివర్లో ఎలీస్ తో కలిసి ప్రతిపక్ష పార్టీ నేత నాగిరెడ్డి మనిషి రాజు దగ్గర డబ్బులు తీసుకుంటుంది. అదే సీజన్ 2 మీద ఆసక్తి కలిగించే అంశమని చెప్పొచ్చు. శివ మీద ప్రేమ చూపిస్తూ రాజు దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుందో సీజన్ 2లో తెలుస్తుంది. ఎలీస్ రిపోర్టర్ గా ఉంటూ పొలిటికల్ లీడర్ దగ్గర వ్యవహారాలు చేస్తుంటాడు. శివ మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతాడు.. సెకండ్ సీజన్ లో తన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది కావొచ్చు.
ఫేక్ ఎన్ కౌంటర్ వల్ల ఎస్సై మురళిని సస్పెండ్ చేస్తే ఆ ప్లేస్ లో కొత్తగా వస్తాడు ఎస్సై ఎడ్విన్. తాను ఎక్కడికి వెళ్లినా తన సొంత రూల్స్ పెడుతుంటాడు. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండేలా చూస్తుంటాడు. రఫ్ గా కనిపించినా సిన్సియర్ ఆఫీసర్ లానే కనిపిస్తాడు. ఎవిడెన్స్ లేనిదే వార్త రాయొద్ధంటూ రిపోర్టర్స్ కి వార్నింగ్ ఇస్తాడు. ఇది అతని స్వభావాన్ని తెలియచేస్తుంది. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి.. మదనపల్లిలో ఫ్యాక్టరీ కట్టిస్తే ఇక్కడ భూములు రేట్లు పెరుగుతాయని సుగాలిమిట్ట భూముల మీద కన్నేస్తాడు. తన దగ్గర డ్రైవర్ గా చేస్తున్న వ్యక్తిని ఎందుకు చంపిస్తాడన్నది సస్పెన్స్ గానే ఉంచారు.
న్యూసెన్స్ కథ చిన్నదే కానీ ప్రతి పాత్ర వారు చేస్తున్న వ్యవహారాలు చాలా లోతు ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే సీరీస్ నడుస్తున్నంత సేపు ఏదో జరగబోతుంది అన్న ఆసక్తి ఉంటుంది కానీ అంతగా ఏమి లేదని చివరకు వచ్చాక తెలుస్తుంది. శివ పాత్ర లోలోపల అను ఏదో చేయాలని అనుకుంటున్నట్టు చూపించడం చూసి ఆడియన్స్ ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ సీజన్ 1 పాత్రలను.. కథను పరిచయం చేయడానికే అన్నట్టుగా తీశారు.
మదనపల్లి బ్యాక్ డ్రాప్ పీరియాడికల్ కథగా లొకేషన్స్ బాగా కుదిరాయి. ఇక వెబ్ సీరీస్ మొత్తం చిత్తూరు యాసలోనే మాటలు ఉంటాయి. మదనపల్లి దాటి కథ కథనాలు బయటకు రాకపోవడం విశేషం. అయితే న్యూసెన్స్ సీజన్ 1 ఇంకాస్త బెటర్ గా చేసి ఉండొచ్చు. జర్నలిస్ట్ బ్యాక్ డ్రాప్ ని తీసుకుని వెబ్ సీరీస్ గా చేయాలనుకున్న ప్రయత్నం మంచిదే కానీ న్యూసెన్స్ సీరీస్ ని ఇంకా బాగా తీసే అవకాశం ఉంది. అంతేకాదు బలమైన పాత్రలు వాటి స్వభావాలు ఇలా అన్ని ఉన్నా సరే వాటిని సరిగా వాడుకోవడంలో విఫలమయ్యాడు. మొదటి ఎపిసోడ్ ఎంగేజింగ్ గా మొదలు పెట్టిన డైరెక్టర్ రాను రాను కథ కథనాలు వీక్ అయిపోయినట్టుగా అనిపిస్తాయి. అసలు దర్శకుడు ఏం చెప్పాలని అనుకుంటున్నాడు అన్నది అర్థం కాదు. ఫైనల్ గా సీజన్ 1 ఎండింగ్ కూడా అంత గొప్పగా ఏమి అనిపించలేదు. ఏదో వెళ్తుంది అంటే వెళ్తుంది అన్నట్టుగా ఉంటుంది తప్ప ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే పాయింట్ ఎక్కడ కనిపించలేదు. న్యూసెన్స్ సీజన్ 1 అసంతృప్తిగానే అనిపించినా సీజన్ 2లో మాత్రం శివ ఏం చేస్తాడు అన్నది ఆసక్తికరంగా ఉండొచ్చు.
నటీనటులు:
శివ పాత్రలో నవదీప్ మ్యాన్లీ లుక్స్ బాగున్నాయి. రిపోర్టర్ గా తను చాలా పరిణితి తో నటించాడని చెప్పొచ్చు. సరిగా వాడలేదు కానీ నవదీప్ లో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడని అనిపిస్తుంది. శివ పాత్రలో అతను ఒదిగిన తీరు బాగుంది. ఇక బిందు మాధవి కూడా తన మెరుపులతో అలరించింది. న్యూస్ రీడర్ గానే కాదు వెబ్ సీరీస్ లో తన పాత్రకు వెయిట్ ఉండేలా చేసుకుంది. సీజన్ 2 లో ఆమె పాత్ర ఇంకాస్త ఆసక్తిగా ఉంటుందని తెలుస్తుంది. ప్రెస్ క్లబ్ చైర్మన్ ఈశ్వర్ గా చేసిన రమేష్ చాలా సెటిల్డ్ గా చేశాడు. నాగిరెడ్డి, కరుణాకర్ రెడ్డిల పాత్రలకు వారు పరిధి మేరకు నటించారు. ఎస్సై ఎడ్విన్ పాత్రలో నటించిన వ్యక్తి బాగా చేశాడు. అయ్యప్ప, ఈరమ్మ మిగతా వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం:
వెబ్ సీరీస్ అంతా 2000 ల కాలం నాటి కథ అవడంతో అప్పటి నేటివిటీకి తగినట్టుగా కెమెరా వర్క్ ఉంది. సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేస్తుంది. సురేష్ బొబ్బిలి సంగీతం కూడా ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుంది. ఇక ప్రవీణ్ కుమార్ దర్శకత్వం కొన్ని విభాగాల్లో బాగానే అనిపిస్తుంది. సీజన్ 1 లో దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని క్లారిటీగా చెప్పడంలో తడబడ్డాడు అన్నది మాత్రం అర్థమవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
చివరగా: హాఫ్ బేక్డ్ న్యూసెన్స్
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in AHA OTT