Begin typing your search above and press return to search.
2018
Date of Release: 2023-05-25
నటీనటులు: టొవినో థామస్-లాల్-అసిఫ్ అలీ-నరేన్-కుంచుకో బోబన్-కలై అరసన్-తన్వి రామ్-అపర్ణ బాల-వినీత్ శ్రీనివాసన్ తదితరులు
సంగీతం: నోబిన్ పాల్
ఛాయాగ్రహణం: అఖిల్ జార్జ్
నిర్మాతలు: వేణు కున్నప్పిల్లి-సీకే పద్మకుమార్-ఆంటో జోసెఫ్
రచన-దర్శకత్వం: జూడ్ ఆంటోనీ జోసెఫ్
ఈ మధ్య మలయాళంలో సంచలన విజయం సాధించిన చిత్రం 2018. కాంతార, విడుదల లాంటి మంచి సినిమాలను తెలుగులో అందించిన గీతా ఆర్ట్స్ సంస్థ.. 2018ను కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
2018లో కేరళను అతలాకుతలం చేసిన వరద బీభత్సం చుట్టూ తిరిగే కథ ఇది. ప్రాణ భయంతో సైన్యం నుంచి వెనక్కి వచ్చేసిన ఒక కుర్రాడు.. సముద్రంలో చేపలు పట్టుకుంటూ జీవిస్తూ సమాజంలో చిన్నచూపుకి గురయ్యే ఒక కుటుంబం... పర్యాటకుల కోసం ట్యాక్సీ నడిపే ఒక డ్రైవర్.. భార్యకు దూరంగా దుబాయిలో ఉద్యోగం చేసుకుంటున్న మరో వ్యక్తి.. తమిళనాడు నుంచి కేరళకు పేలుడు పదార్థాలు తీసుకొస్తున్న ఒక ట్రక్ డ్రైవర్.. ఇలా పలువురు కేరళ వరదల్లో చిక్కుకుంటారు. వీళ్లంతా ఈ ఉపద్రవం నుంచి బయటపడ్డారా లేదా.. ఈ క్రమంలో వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. అంతిమంగా ఏం జరిగింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
సర్వైవల్ డ్రామా.. దశాబ్దాలుగా అనేక భాషల్లో విజయవంతం అవుతున్న జానర్. ఎన్నో హాలీవుడ్ సినిమాలు ఈ జానర్లోనే తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వాటి స్ఫూర్తితో ఇండియాలో కూడా ఈ తరహా సినిమాలు చాలానే తెరకెక్కాయి. దశావతారం.. వేదం లాంటి సినిమాలతో మనకూ ఈ జానర్ బాగానే అలవాటైంది. ఒక ప్రాంతంలో వేర్వేరు వ్యక్తుల జీవితాలను విడి విడిగా చూపించి.. ఒక విపత్తు తలెత్తినపుడు అందరూ ఒక చోటి చేరి దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నించడం.. అప్పుడు తలెత్తిన అతి పెద్ద సమస్య ముందు మన జీవితాల్లో ఎదురయ్యే రోజు వారీ ఇబ్బందులు చాలా చిన్నవని.. అలాగే మానవత్వమే అన్నింటికన్నా గొప్పదని చాటి చెప్పే ప్రయత్నం జరుగుతుంటుంది ఇలాంటి సినిమాల్లో. 2018 కూడా అచ్చంగా ఇలాంటి సినిమానే. ఇందుకు నేపథ్యంలో 2018 నాటి కేరళ వరద బీభత్సాన్ని నేపథ్యంగా తీసుకున్నాడు దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసెఫ్. మలయాళ సినిమా మార్కెట్ పరిధి చిన్నదైనా.. బడ్జెట్ పరిమితులున్నా.. వరద దృశ్యాలను అద్భుత రీతిలో తెరకెక్కించడం ఈ సినిమాలో మేజర్ హైలైట్. అలాగే ద్వితీయార్ధంలో తెరపై వరద ముంచెత్తితే.. తెరపై జరిగేదంతా చూసే ప్రేక్షకులు ఎమోషన్లలో మునిగి తేలుతారు. ఆ ఎమోషన్లకు భాషా భేదం లేకుండా ఎవ్వరైనా కదిలిపోతారు. ఒక దశ వరకు సాధారణంగా అనిపించే సినిమాను ద్వితీయార్ధం మరో స్థాయికి తీసుకెళ్లింది.
కథ జరిగేది కేరళలో అయినా.. ఇందులో చూపించిన విషయాలు సార్వజనీనమైనవి కావడం '2018'కు ప్లస్. కేరళ వరదల తరహా విపత్తులను పత్రికల్లో, టీవీల్లో చూసినపుడు మనకు అది చిన్న న్యూస్ లాగే అనిపిస్తుంది. కానీ అక్కడే ఉండి అనుభవించిన వాళ్లకు వాటి తీవ్రత తెలుస్తుంది. '2018' సినిమా చూస్తుంటే.. మనమే వరదల్లో చిక్కుకుపోయామా అన్న భావన కలుగుతుంది. వర్షం.. వరద దృశ్యాలను అంత గొప్పగా.. అంత హృద్యంగా.. అంత భయపెట్టేలా చిత్రీకరించిన '2018' టీంకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మనం చూస్తున్నదంతా కల్పితం.. ఇదంతా సెట్టింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ మాయ అనే భావన ఎంతమాత్రం కలగకుండా.. నిజంగా వరదలో చిక్కుకున్న ప్రాంతాన్ని కళ్లకు కట్టినట్లుగా జూడ్ ఆంటోనీ జోసెఫ్ అండ్ టీం చూపించింది. మలయాళ సినిమా స్థాయికి అంత తక్కువ బడ్జెట్లో వరద సెటప్ ఎలా చేయగలిగారు.. విజువల్ ఎఫెక్ట్స్ అంత బాగా ఎలా తీర్చిదిద్దగలిగారు అని ఆశ్చర్యం కలుగుతుంది.
కథ పరంగా చూస్తే.. '2018' ఏమాత్రం కొత్తగా అనిపించదు. సర్వైవల్ డ్రామాలన్నీ కూడా ఇదే లైన్లో సాగుతుంటాయి. ముందు వేర్వేరుగా పాత్రలను పరిచయం చేసి.. కొన్ని లైట్ హార్టెడ్ సీన్లు.. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో ప్రథమార్ధాన్ని సాధారణంగానే నడిపించేశాడు దర్శకుడు. వరద బీభత్సం మొదలయ్యే వరకు ఏం ప్రత్యేకత ఉందీ సినిమాలో అనిపిస్తుంది. కానీ వరద తీవ్ర రూపం దాల్చి జనాలు ఉక్కిరిబిక్కిరి అయిపోవడం.. ఒక్కొక్కరుగా రియల్ హీరోలు బయటికి రావడం.. ప్రాణాల మీద ఆశలు కోల్పోయిన వారిని రక్షించడం.. ఈ క్రమం చాలా ఎమోషనల్ గా నడుస్తుంది. ఒక గర్భిణిని వరద బీభత్సం మధ్య ఆర్మీ హెలికాఫ్టర్లోకి ఎక్కించే ఎపిసోడ్ సెకండాఫ్ కే హైలైట్ గా నిలిచింది. ప్రాణ భయంతో సైన్యం నుంచి వచ్చేసిన వ్యక్తి.. ఈ వరదల్లో ప్రాణాలను లెక్క చేయకుండా ఎంతోమందిని రక్షించి హీరో కావడం ఆకట్టుకుంటుంది. ఈ పాత్రకు ఇచ్చిన ముగింపు గుండెలు పిండేస్తుంది. అలాగే జాలరుల కుటుంబం అని అమ్మాయిని ఇవ్వడానికి నిరాకరించి వారిని తక్కువ చేసి మాట్లాడే ఒక కుటుంబాన్ని చివరికి ఆ జాలరుల కుటుంబమే రక్షించడం.. ఇలాంటి మరి కొన్ని పేఆఫ్ సీన్లు కూడా మెప్పిస్తాయి. ప్రథమార్ధంలో పరిచయం చేసే అన్ని ముఖ్య పాత్రలకూ ఇలాంటి సీన్లు పడి ఉంటే.. సినిమా వేరే లెవెల్లో ఉండేది కానీ.. కుంచుకో బోబన్.. అపర్ణ బాల.. వినీత్ శ్రీనివాసన్.. లాంటి క్యారెక్టర్లను అంతగా ఉపయోగించుకోలేదు. అలాగే ప్రభుత్వం.. మీడియా పాత్రను తక్కువ చేసి చూపించారు. సామాన్య జనం నుంచే హీరోలు పుట్టి వాళ్లను వాళ్లు కాపాడుకున్నట్లుగా సినిమాను నడిపించారు. ఈ క్రమంలో కొన్ని సీన్లు ఎగ్జాజరేటెడ్ గా అనిపిస్తాయి. ప్రథమార్ధం ఇంకొంచెం ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుని ఉండాల్సింది. లోపాలున్నప్పటికీ సర్వైవల్ డ్రామాలను ఇష్టపడేవారిని '2018' ఆకట్టుకుంటుంది.
నటీనటులు:
గత కొన్నేళ్లలో మలయాళంలో క్రేజీ హీరోగా మారాడు టొవినో థామస్. 'ఆహా' అనువాద చిత్రాల ద్వారా అతను తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే దగ్గరయ్యాడు. స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి మామూలు కుర్రాడి పాత్రలతో ఆకట్టుకోవడం తన ప్రత్యేకత. '2018'లోనూ అతను అలాంటి పాత్రతోనే మెప్పించాడు. ఎక్కడా 'హీరో' అనే ఫీలింగ్ రానివ్వకుండా నటిస్తూనే.. చివరికి 'రియల్ హీరో'లా మారే పాత్రను టొవినో చక్కగా పోషించాడు. అతడికి జోడీగా నటించిన తన్వి రామ్ చూడ్డానికి బాగుంది. కుంచుకో బోబన్ స్థాయికి తగ్గ పాత్ర కాకపోయినా అతను బాగానే పెర్ఫామ్ చేశాడు. లాల్ పాత్ర.. తన నటన కట్టిపడేస్తుంది. అసిఫ్ అలీ.. నరేన్ కూడా బాగా చేశారు. తమిళ నటుడు కలై అరసన్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అపర్ణ బాల.. వినీత్ శ్రీనివాసన్ ఓకే.
సాంకేతిక వర్గం:
'2018' ఔట్ పుట్ తెరపై గొప్పగా ఉండటంతో తెర వెనుక హీరోలు చాలామందే ఉన్నారు. ప్రొడక్షన్ డిజైన్.. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో పడ్డ కష్టం.. చూపించిన ప్రతిభను ఎంత కొనియాడినా తక్కువే. ప్రతిభ.. ప్రణాళిక తోడైతే తక్కువ బడ్జెట్లోనే ఎంత మంచి ఔట్ పుట్ తీసుకురావచ్చో చెప్పడానికి ఈ సినిమాలోని సన్నివేశాలు ఉదాహరణ. నోబిన్ పాల్ నేపథ్య సంగీతం.. అసిఫ్ జార్జ్ ఛాయాగ్రహణం కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ జూడ్ ఆంటోనీ జోసెఫ్ ఎంతో పరిశోధించి.. ఆసక్తికర పాత్రలు.. ఉదంతాలతో స్క్రిప్టు తీర్చిదిద్దుకున్నాడు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా తెరపైకి తీసుకురాగలిగాడు. నటీనటులు.. సాంకేతిక నిపుణుల నుంచి అతను బెస్ట్ ఔట్ పుట్ రాబట్టగలిగాడు. రచయితగా కంటే దర్శకుడిగా అతడికి ఎక్కువ మార్కులు పడతాయి.
చివరగా: 2018.. ఎమోషన్ల వరద
రేటింగ్ - 3/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater