Begin typing your search above and press return to search.
కేరింత

Date of Release: 2015-06-12
రేటింగ్: 2 /5
తారాగణం: సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి మదివాడ, ప్రగతి, సిధ్ తదిరులు
సంగీతం : మిక్కీ.జె.మేయర్
ఛాయాగ్రహణం : విజయ్.సి.చక్రవర్తి
నిర్మాత : దిల్‌రాజు
దర్శకత్వం: సాయికిరణ్ అడివి
కాలేజ్ కుర్రాళ్ల ప్రేమకథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు కానీ.. స్టూడెంట్స్ లైఫ్, స్నేహం, కెరీర్, ప్రేమ, భావోద్వేగాలు, అమాయకత్వం.. ఇవన్నీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఏడెనిమిదేళ్ల క్రితం వచ్చిన 'హ్యాపీడేస్' సినిమాతో ఈ సబ్జెక్ట్‌లకు కొత్త ఊపు వచ్చింది. అప్పటినుంచి ఈ జానర్లో ఎన్నో సినిమాలొచ్చాయి. ఇలాంటి పరంపరలోని ఒకటి 'కేరింత' ఏడాదిన్నర కాలంగా ఈ సినిమాని చెక్కారు దర్శకనిర్మాతలు. పలుమార్లు కథల్ని మార్చి, నటీనటుల్ని మార్చి ప్రయోగాలు చేశారు. అయితే దిల్‌రాజు ఎంతో శ్రద్ధ తీసుకుని చెక్కించిన సినిమా కాబట్టి 'కేరింత' చిత్రంపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఆ అంచనాల్ని కేరింత అందుకుందా? లేదా? అన్నది తెలియాలంటే ఇది చదవాల్సిందే.
కథ:
నూనూగు మీసాల వయసులో అప్పుడే కాలేజ్‌లో అడుగుపెడుతున్న యువతరం స్నేహాలు, ప్రేమలు, కెరీర్ ఎలా ఉంటాయన్నదే సినిమా. చదువుల కోసం, కెరీర్ కోసం కాలేజ్‌లో అడుగుపెట్టిన ఓ ఆరుగురు స్నేహితుల కథ చివరికి ఏ కంచికి చేరిందన్నదే సినిమా కథాంశం. ఈ మధ్యకాలంలోనే ఇలాంటి కాలేజీ ప్రేమకథలు ఎన్నో వచ్చాయి. వాటన్నింటినీ చూసిన వారికి ఇదొక పరమ రొటీన్ స్టోరీ. జై (సుమంత్ అశ్విన్) -మానస్విని (శ్రీదివ్య), సిద్ధార్థ్ (సిద్)- తేజస్వి, నూకరాజు-భావన ఈ మూడు జంటల మధ్య కథ ఇది ప్రేమే పరమావధి అనుకొంటాడొకడు.. కెరీర్ ముఖ్యమంటూ వాడిని ప్రియురాలు తిరస్కరించడం చివరకు ఆమె అతడి ప్రేమను అర్థం చేసుకోవడం, చదువు వద్దని సంగీతాన్ని ప్యాషన్‌గా పెట్టుకొని దాని గురించి ఇంట్లో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పలేడు ఇంకో కుర్రాడు.. బాగా చదవాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చే తల్లిదండ్రులు చివరికి కుర్రాడి ప్యాషన్‌ను వారు అర్థం చేసుకోవడం.. వీరి కథ సుఖాంతం. ఇక అమ్మాయిల సాంగత్యం కోసం అడ్డదారులు తొక్కేవాడొకడు.. చివరికి అతడిలో రియలైజేషన్... ఇలాంటి కథల కలబోతే ఈ 'కేరింత'.
కథనం:
సినిమాకు కాలేజీ క్యాంపస్‌ను నేపథ్యంగా మార్చుకొన్నప్పుడు కథ విషయంలో ఇంత కన్నా వైవిధ్యం చూపలేకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రేమ, చదువు, కెరీర్, తల్లిదండ్రులు.. ఇవే కీలకాంశాలు. అయితే ఇక్కడ ట్రీట్మెంట్ మీదే అసలు వ్యవహారం ఆధారపడి ఉంటుంది. ఎప్పటికీ ఫ్రెష్ సబ్జెక్ట్స్ అనిపించే ఈ జోనర్లో రచన, దర్శకత్వాల పనితనం అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఇస్తుంది. అయితే సాయికిరణ్ అడవి సృజించిన ఈ కేరింతలో మాత్రం అలాంటి పనితనం కనిపించదు.
దర్శకుడు ప్రేమకథల్ని నడిపించిన తీరు అత్యంత పేలవంగా ఉంటుంది. కొత్తదనం కొంతైనా కనిపించదు. టీనేజ్ లవ్‌లో ఉండేంత మృదుత్వం మనసును తాకదు. ఈ విషయంలో ఫెయిలయ్యాకా సినిమాలో ఫీల్ ఏముంటుంది? శేఖర్‌కమ్ముల హ్యాపీడేస్ చాలా గుర్తుకొస్తుంది. అయితే హ్యాపీడేస్ స్టూడెంట్స్ మధ్య ఉన్న రోమాంచిత భావం కానీ, ప్రేమభావం కానీ, కిక్కు కానీ ఈ సినిమాలో ఏ కోశానా కనిపించవు. పైగా కుర్రాళ్లు ప్రేమించుకుంటున్నారు అంటే కాదనే తల్లిదండ్రులే ఈ సినిమాలో ఉండరు. యథేచ్ఛగా ప్రేమించుకోమనేవాళ్లే అంతా. కాలేజీ కథ ఫార్ములా కోసం అన్నట్టుగా.. కచ్చితంగా ఉండాలన్నట్టుగా చాలా పాత్రలను సెట్ చేశారు. అవి కాస్తా ఆకట్టుకోవడం మానేసి విసుగును తెప్పిస్తాయి.
శ్రీకాకుళం అంటే బాగా చీప్ అన్నట్టే నూకరాజు క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఆ పాత్ర లౌడ్‌గా అరుస్తూ శ్రీకాకుళం యాసలో మాట్లాడే తీరు నవ్వించదు.. సరికదా ఇర్రిటేషన్ పుట్టిస్తుంది. ఇది మాత్రమే కాదు.. అన్నీ 'ఫార్ములా' పాత్రలే. ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో ప్రేక్షకుడే ముందుగా ఒక అంచనాకు వచ్చేస్తాడు. దీంతో దర్శకుడి కన్నా ప్రేక్షకుడికే సినిమాపై ఎక్కువ పట్టు కనిపిస్తుంది.ఈ సినిమాకి ఎంచుకున్న కంటెంట్ పెద్ద మైనస్. అది పరమ రొటీన్ కంటెంట్. అక్కడే సినిమా ఫలితం సగం తేలిపోయింది. మరో హ్యాపీడేస్ చూపిస్తామంటే చూసేంత ఓపిక జనాలకు లేదు. ఉన్నా టీవీల్లో చూస్తారు కానీ థియేటర్లకు రారు. అలాగే కేరింత అన్న టైటిల్ పెట్టుకున్నందుకు ఒక్కచోటా జనాలు చప్పట్లతో కేరింతలు కొట్టింది లేదు. నవ్వు పులుముకుందామంటే చక్కిలిగింతలు పెట్టుకోవాల్సిన సన్నివేశాలు బోలెడు. అతి తక్కువ సన్నివేశాల్లో మాత్రమే ఆర్ధ్రత కనిపించింది. యూత్ సబ్జెక్టే అయినా ఎక్కడా అసభ్యత అనేదే లేని క్లీన్ సినిమా ఇది. ఆ మేరకు కుటుంబ ప్రేక్షకులకు రిలీఫ్. .
నటీనటులు:
ఇలాంటి సినిమాలు కొత్తవాళ్ల ఇంట్రడక్షన్‌కు మార్గాలు. దిల్ రాజు అండ్ కంపెనీ మాత్రం ఈ సినిమాలో నటీనటులను మార్చుకొంది. చివరకు వీళ్లతో సినిమాను చూపించింది. సుమంత్ అశ్విన్ ఇలాంటి కథలకు బాగానే సూటవుతాడు. అయితే ఈ కథకు అతడు అక్కర్లేదు. ఏదైనా కొత్త ముఖాన్ని పరిచయం చేస్తేనే టింజ్ కనిపించేది. అలాగే శ్రీదివ్య ఈ సినిమాకి పెద్ద ప్లస్. కానీ పాత ముఖమే అవ్వడం వల్ల కొత్త అన్న ఫీలింగ్ కలగదు. మిగతా వాళ్లంతా తమ తమ పాత్రలకు తగ్గట్టుగా చేసుకొంటూ పోయారు.
సాంకేతిక వర్గం:
ఫోటోగ్రఫీ ఎంతో అందంగా ఉంది. పాటలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. మిక్కీ.జె సంగీతం ఆయువు పోసింది. అతడు అందించిన రీరికార్డింగ్ పెద్ద ప్లస్. అది లేకపోతే అస్సలు ఈ సినిమానే లేదు. దర్శకత్వంలోని ఎన్నో లోపాల్ని ఆర్ఆర్తో కప్పి పుచ్చారంటే అతిశయోక్తి కాదు. అలాగే ఓ రెండు పాటలు హృదయాన్ని టచ్ చేయక మానవు. 'ఓ పున్నమి వెన్నెల..' పాట ఎనర్జిటిక్‌గా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ నేపథ్యం నుంచి వచ్చాం కదా అని సాఫ్ట్‌గా క్యారెక్టర్లను చూపిస్తే మాస్‌ని మెప్పించడమెలా? మాస్ థియేటర్లకు రాకుండానే సినిమాలు హిట్టవుతాయంటే ఎలా? కేవలం టార్గెటెడ్ ఆడియెన్ వస్తే చాలు అనుకుని సినిమా తీశారా? అనే విషయాల గురించి దర్శకుడు సాయికిరణ్ అడవి ఒక సారి దీర్ఘంగా ఆలోచించుకొంటే మేలేమో. అలాంటి పాత్రలతోనే సినిమాలు చేసినా వాటిల్లో ఈ దర్శకుడే తీసిన 'వినాయకుడు' సినిమాలో ఉన్నంత నవ్యత ఉండాలని గ్రహించాలి. నేరేషన్ విషయంలో గ్రిప్ ఎలా సాధించాలో సాయికి ఇప్పటికీ ఓ క్లారిటీ వచ్చినట్టు లేదు. అలాగే మాటల్లో పంచ్‌ల టైమింగ్‌లో ఏ మాత్రం గ్రిప్ కనిపించదు. ఈ సినిమాకి ఎడిటింగ్ విభాగం పూర్తిగా పనిచేస్తే మరో 20శాతం కోత కోయవచ్చు.
చివరిగా...
హ్యాపీడేస్‌ని పేలవంగా తీస్తే అది కేరింత. రొటీన్‌గా ఉన్నా కేరింతలు పెట్టగలమనుకొంటే.. ప్రొసీడ్ కావొచ్చు!