దీవానా

Date of Release: 2026-06-20

Sreekanth Sangishetty
Directer

Harshith Reddy
Star Cast

Smeha Manimegalai
Star Cast

Allu Aravind
Producer

Eswar Chand
Music
'దీవానా' మూవీ రివ్యూ
నటీనటులు: హర్షిత్ రెడ్డి - స్నేహ మణిమేఘలై - నరేష్ - ఝాన్సీ- వేణు యల్దండి - రఘు కారుమంచి - జీవన్ తదితరులు
సంగీతం: ఈశ్వర్ చంద్
ఛాయాగ్రహణం: వంశీ పచ్చుపులుసు
నిర్మాతలు: వాసుదేవ్ కొప్పినేని - విద్య కార్యంపూడి
రచన - దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి
మెయిల్ మూవీ.. తరగతి గది దాటి వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న యువ నటుడు హర్షిత్ రెడ్డి.. ఇప్పుడు ‘దీవానా’ అనే ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు.. కొత్త నిర్మాతలు కలిసి చేసిన ఈ సినిమాను గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేయడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. మరి ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులను మెప్పించిందా? చూద్దాం పదండి.
కథ:
మున్నా (హర్షిత్ రెడ్డి) డిగ్రీ పూర్తి చేసి ఆవారాగా తిరిగే కుర్రాడు. అతడికి బాధ్యత తెలియదు. కుటుంబం కోసం తండ్రి పడే కష్టమూ పట్టదు. ఎప్పుడూ స్నేహితులతో అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. అలాంటి కుర్రాడు మీసేవ సెంటర్లో పని చేసే అమూల్య (స్నేహ మణిమేఘలై)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తన కోసమే రోజూ ఏదో ఒక బిల్లు పట్టుకుని మీసేవకు వెళ్తుంటాడు. కానీ అమూల్య మాత్రం అతణ్ని పట్టించుకోదు. అమూల్యను ఏడిపించిన వాళ్లను కొట్టి జైలుకు వెళ్లొచ్చిన మున్నా.. కుటుంబానికి దూరం కావాల్సిన పరిస్థితి వస్తుంది. అమూల్య ముందు మున్నా ప్రేమ ప్రపోజల్ పెడితే.. ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకో అప్పుడు చూద్దాం అంటుంది. దీంతో మున్నా ఆ ప్రయత్నాల్లో పడతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన ఇబ్బందులేంటి.. నిజంగా అతను ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నాడా.. ఇంతకీ అమూల్య అతణ్ని ప్రేమించిందా.. చివరికి ఈ ఇద్దరూ కలిశారా.. మున్నా కుటుంబంతో ఒక్కటయ్యాడా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
‘దీవానా’ను వీక్షిస్తుంటే రెండు వేర్వేరు చిత్రాలను మార్చి మార్చి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక పార్శ్వ్యంలో ఏమో గుండెల్ని పిండేసే ఒక లవ్ స్టోరీ నడుస్తుంటుంది. హీరో హీరోయిన్ల ప్రేమకథకు అడ్డుగా నిలిచే ఒక షాకింగ్ పాయింట్ నేపథ్యంలో ఈ కథను నడిపించిన తీరుకు కదిలిపోతాం. అలాగే కుటుంబం నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరిగేల ా చేస్తాయి. ఎమోషనల్ సీన్లు అన్నింటినీ దర్శకుడు డీల్ చేసిన విధానం.. వాటిలో వచ్చే డైలాగులు ఒక టాప్ క్లాస్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఇందులో చూపించిన రెండో పార్శ్వం మాత్రం సినిమా మీద ఇంప్రెషన్ ను అంతకంతకూ తగ్గించేస్తుంటుంది. స్నేహితులతో కలిసి హీరో వేసే అల్లరి వేషాల దగ్గర్నుంచి.. ప్రేమ-ఉద్యోగం అంటూ అతను పడే పాట్లకు సంబంధించిన సీన్లన్నీ చికాకు పుట్టించేస్తాయి. ఒకే సినిమాలో ఇంత వైరుధ్యం చూసి ఆశ్చర్యం కలగక మానదు. ఎమోషనల్ సీన్లలో దర్శకుడు చూపించిన పరిణతిని మిగతా సన్నివేశాల్లో కూడా చూపించి ఉంటే.. వాటిని ఫిల్లింగ్ సీన్లలో పేర్చేసి ఉండకపోతే ‘దీవానా’ తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ఒకటిగా నిలిచేది. ఐతే ఈ లోపం ఉన్నా సరే.. ‘దీవానా’ ఒక లుక్కేయడానికి ఢోకా లేని సినిమానే. ఇందులో కొన్ని సన్నివేశాలకు కదిలిపోని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాాదు.
మిగతా జానర్లతో పోలిస్తే లవ్ స్టోరీల్లో కొత్తదనం చూపించడం అంత తేలికైన విషయం కాదు. అమ్మాయిని తొలి చూపులోనే చూసి హీరో మైమరిచిపోవడం దగ్గర్నుంచి ప్రతి సీన్ ఏదో ఒక సినిమాలో చూసిన ఫీలింగే కలిగిస్తుంది లవ్ స్టోరీల్లో. ఇక ప్రేమకథలకు కాన్ఫ్లిక్ట్ పాయింట్ క్రియేట్ చేయడం కూడా ఒక పెద్ద సవాలే. ఐతే ఇందులో ప్రేమకథకు అడ్డుగోడగా నిలిచే పాయింట్ పూర్తిగా కొత్తది అని చెప్పలేం కానీ.. అదేంటో తెలిసినపుడు ప్రేక్షకులు విస్మయానికి గురై కాసేపు నోరెళ్లబెట్టి చూడడం మాత్రం. అప్పటిదాకా ఒకలా నడుస్తున్న సినిమా మీద.. ఆ సన్నివేశం చూడగానే పూర్తిగా అభిప్రాయమే మారిపోతుంది. సినిమా స్వరూపం కూడా మారిపోయి అక్కడ్నుంచి పైన చెప్పుకున్నట్లు వేరే కొత్త చిత్రమేదో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పూర్తిగా ఎమోషనల్ గా ఈ సినిమాను నడిపిస్తే ప్రేక్షకులకు భారం అయిపోతుందనో ఏమో.. హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ అల్లరి.. గొడవలతో వేరే ట్రాక్ నడిపించాడు. కానీ అవి ప్రేక్షకులకు వినోదాన్ని పంచకపోగా.. అసహనాన్ని కలిగిస్తాయి. హీరో వెళ్లి అవతలి గ్యాంగుతో గొడవలు పడడం... అవతలి గ్యాంగ్ వీళ్ల మీద గొడవకు రావడం.. ఇలాంటి రిపీటెడ్ సీన్లతో ప్రేక్షకులను విసిగించాడు దర్శకుడు.
మరోవైపు ప్రేమకథలో ట్విస్టు బయటపడే వరకు వచ్చే సన్నివేశాలు కూడా అంతంతమాత్రంగానే సాగుతాయి. హీరోయిన్ కోసం హీరో వేసే వేషాలు.. ప్రపంచాన్ని మరిచిపోయి ప్రేమ ప్రేమ అంటూ అతను వెర్రెత్తిపోయే సీన్లు ఒక ‘నిబ్బా’ లవ్ స్టోరీ చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి.
కానీ ఈ మైనస్సులను కవర్ చేసేలా ప్రేమకథలో.. కుటుంబ సన్నివేశాల్లోని ఎమోషనల్ యాంగిల్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇంటర్వెల్ దగ్గర్నుంచి కథానాయికతో ముడిపడ్డ సన్నివేశాలన్నీ కదిలించేస్తాయి. అలాగే తండ్రి పడే కష్టం గురించి హీరో కళ్లు తెరిపించే ఒక సన్నివేశం.. దాని ఫాలోఅప్ సీన్లు కూడా ప్రేక్షకుల గుండెల్ని తడి చేస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్తుంది. మిగతా సినిమా అంతా ఒకెత్తయితే.. క్లైమాక్సులో హీరో చెప్పే ఒక డైలాగ్ మరో ఎత్తు. సినిమాలో ఉన్న మైనస్సులన్నింటినీ ఆ ఒక్క డైలాగ్ కవర్ చేస్తుంది. ఐతే సినిమాలో ఎమోషనల్ సీన్లను మరీ లాగకుండా.. కొంచెం షార్ట్ చేసి ఉండొచ్చు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఒక ఎపిక్ లవ్ స్టోరీ కాగల లక్షణాలు ‘దీవానా’లో ఉన్నప్పటికీ.. వినోదం కోసం పెట్టిన ఫిల్లింగ్ సీన్ల వల్ల దీని అనుభూతి తగ్గి ఒక మోస్తరు స్థాయిలో నిలబడుతుంది. యూత్ మాత్రమే కాక కుటుంబ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యే అంశాలు ‘దీవానా’లో ఉన్నాయి.
నటీనటులు:
హర్షిత్ రెడ్డి టాలెంట్ ఏంటో అతను చేసిన వెబ్ ఫిలిమ్స్.. సిరీసుల్లోనే చూశాం. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. అచ్చమైన పక్కింటి కుర్రాడి పాత్రలో అతను ఒదిగిపోయే తీరు భలే ఉంటుంది. సినిమాలో తన పాత్ర కొన్నిసార్లు లవబుల్ గా ఉంటూ.. కొన్నిసార్లు చికాకు పెట్టి.. అంతిమంగా భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్తుంది. పూర్తిగా క్లోజప్ లో సాగే క్లైమాక్స్ సీన్లో అతను అద్భుతంగా హావభావాలు పలికించాడు. డైలాగులు కూడా బాగా చెప్పాడు. హీరోయిన్ స్నేహ మణిమేఘలై కూడా బాగా చేసింది. సగం సినిమా వరకు ఒక కోణంలో నడిచే తన పాత్ర.. తర్వాత ఊహించని టర్న్ తీసుకుని ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి పాత్రను ఒప్పుకున్నందుకు ఆమెను అభినందించాలి. నరేష్ తండ్రి పాత్రలో గొప్పగా నటించాడు. తల్లి పాత్రలో ఝాన్సీ ఓకే. వేణు యల్దండి.. జీవన్.. రఘు కారుమంచి చిన్న చిన్న పాత్రల్లోనే మెప్పించారు. హీరో మిత్ర బృందంలో కనిపించిన ఆర్టిస్టులు బాగా చేశారు.
సాంకేతిక వర్గం:
‘దీవానా’లో సాంకేతిక నిపుణుల పనితీరు ఆకట్టుకుంటుంది. ఈశ్వర్ చంద్ బీజీఎం చాలా బాగుంది. ఎమోషనల్ సీన్లలో మంచి అనుభూతి కలగడానికి స్కోర్ కూడా ఒక కారణం. ఈశ్వర్ పాటలు పర్వాలేదు. వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం నీట్ గా సాగింది. పతాక సన్నివేశాలను క్లోజప్స్ మీద నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. దాని వల్ల ఎమోషన్లు మరింత బాగా పండాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. రచయిత-దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి అరంగేట్రంలో తన ముద్ర వేశాడు. డిఫరెంట్ పాయింట్ రాసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్ల వరకు రైటింగ్-టేకింగ్ రెండూ వేరే లెవెల్ అనిపిస్తాయి. కానీ మిగతా సన్నివేశాల్లో మాత్రం శ్రీకాంత్ ఆ ప్రమాణాలను అందుకోలేకపోయాడు. ఓవరాల్ గా రైటర్-డైరెక్టర్ గా శ్రీకాంత్ కు మంచి మార్కులే పడతాయి.
చివరగా: దీవానా.. టచింగ్ లవ్ స్టోరీ
రేటింగ్- 2.75/5