'పాంచ్ మినార్' మూవీ రివ్యూ

Date of Release: 2025-11-21

Ram Kadumula
Directer

Raj Tarun
Star Cast

Rashi Singh
Star Cast

Madhavi
Producer

Shekar Chandra
Music
నటీనటులు: రాజ్ తరుణ్- రాశి సింగ్- అజయ్ ఘోష్- బ్రహ్మాజీ- శ్రీనివాస్ రెడ్డి- నితిన్ ప్రసన్న- రవి వర్మ- సుదర్శన్- కృష్ణ తేజ- లక్ష్మణ్ మీసాల తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: ఆదిత్య జవ్వాది
నిర్మాతలు: మాధవి- ఎంఎస్ఎం రెడ్డి
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రామ్ కడుముల
రాజ్ తరుణ్ మంచి హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతోంది.. తన నుంచి వరుసగా సినిమాలు వస్తున్నా అవి సరైన ఫలితాన్నివ్వడం లేదు. ఇటీవలే ఓటీటీ మూవీ చిరంజీవతో నిరాశపరిచిన రాజ్.. ఇప్పుడు పాంచ్ మినార్ మూవీతో సైలెంటుగా థియేటర్లలోకి దిగాడు. మరి ఈ చిత్రమైనా అతను కోరుకున్న విజయాన్నందించేలా ఉందా? చూద్దాం పదండి.
కథ: అందరూ కిట్టు అని పిలిచే కృష్ణచైతన్య (రాజ్ తరుణ్) బిట్ కాయిన్లో ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేసి అక్కడ మోసం జరగడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంటాడు. నష్టం భర్తీ చేసుకోవడానికి క్యాబ్ డ్రైవర్ గా పనికి కుదురుతాడు. కానీ ఇంట్లో వాళ్లకు.. తన ప్రేయసి ఖ్యాతి (రాశి సింగ్కు మాత్రం అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తుంటాడు. అదనంగా టిప్స్ వస్తాయన్న ఆశతో క్యాబ్ డ్రైవర్ ప్రొఫైల్లో తాను చెవిటివాడిని అని పేర్కొంటాడు. ఐతే కిట్టు ముందే ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లు ఓ వ్యక్తిని హత్య చేసి.. అతణ్ని కూడా చంపేయాలని ప్లాన్ చేస్తారు. వారి నుంచి తాత్కాలికంగా తప్పించుకోవడమే కాక ఐదు కోట్ల డబ్బు కొట్టేస్తాడు కిట్టు. ఆ కిల్లర్లతో పాటు లోకల్ రౌడీ మూర్తి (అజయ్ ఘోష్).. సీఐ అయ్యర్ (నితిన్ ప్రసన్న).. కిట్టును టార్గెట్ చేస్తారు. మరి వీళ్లందరి నుంచి కిట్టు తప్పించుకోగలిగాడా.. ఆ ఐదు కోట్ల డబ్బును అతను ఏం చేశాడు.. అన్నది మిగతా కథ
కథనం - విశ్లేషణ: ఒక హీరో సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుంటే.. అంతకంతకూ తన సినిమాల పరిధి చిన్నదైపోతుంటే.. ఒక దశ దాటాక ప్రేక్షకులు అతణ్ని లైట్ తీసుకోవడం మొదలుపెడతారు. తన సినిమాలు రిలీజవుతున్న విషయం కూడా పెద్దగా గుర్తుండదు. ఉయ్యాల జంపాల.. సినిమా చూపిస్త మావ.. కుమారి 21 ఎఫ్ చిత్రాలతో కెరీర్ ఆరంభంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజ్ తరుణ్.. తర్వాత పేలవమైన కథల ఎంపికతో రేసులో బాగా వెనుకబడిపోయాడు. ఇలాంటి టైంలో ఈ వారం రాజ్ తరుణ్ మూవీ పాంచ్ మినార్ బాక్సాఫీస్ బరిలో దిగింది. కానీ ఏ అంచనాలు లేకుండా ఈ సినిమా థియేటర్లో అడుగు పెడితే చివరికి ఒకింత ఆశ్చర్యంతో.. ఆనందంతో బయటికి రావచ్చు. రాజ్ మళ్లీ ఓ మోస్తరు కంటెంట్ ఉన్న సినిమా చేయడం.. ఇందులో కామెడీ బాగానే వర్కవుట్ కావడం ఆ ఆశ్చర్యానికి.. ఆనందానికి కారణాలు. రాజ్ ఈ మాత్రం మంచి సినిమాను అందించి చాలా కాలమే అయింది.
క్రైమ్ కామెడీలంటే పెద్దగా కథేమీ ఉండదు. కథనంతో ఎంతమేర మ్యాజిక్ చేశారు అన్నదాన్ని బట్టే ఆ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. రామ్ కుడుముల ఈ విషయంలో పాస్ మార్కులు వేయించుకున్నాడు. కొంచెం థ్రిల్ చేసి.. బాగా నవ్వించి పాంచ్ మినార్ ను ఎంగేజింగ్ మూవీగా మలిచాడు. క్రైమ్ కామెడీల్లో చాలా వరకు కథా వస్తువు డబ్బు-హత్య చుట్టూనే తిరుగుతాయి. పాంచ్ మినార్ కూడా ఆ కోవకు చెందిన సినిమానే. హీరో చెవిటి వాడు కాకపోయినా.. అలా చెప్పుకోవడం కథలో కీలక మలుపుకి కారణం అవుతుంది. దాని మీద కామెడీ ఆఫ్ ఎర్రర్స్ తో ప్రేక్షకులకు వినోదం పంచాడు దర్శకుడు. హీరో చుట్టూ ట్రికీ సిచువేషన్స్ క్రియేట్ చేసి.. అతను అందరి మధ్య నలిగిపోయే సన్నివేశాల నుంచే బాగా నవ్వించగలిగారు. రాజ్ చాన్నాళ్ల తర్వాత తనకు సూటయ్యే పాత్రలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలిగాడు. లక్ష్మణ్ మీసాల.. అజయ్ ఘోష్.. బ్రహ్మాజీ.. శ్రీనివాసరెడ్డి.. నితిన్ ప్రసన్న లాంటి ఆర్టిస్టులు తలో చేయి వేయడంతో సినిమా సాఫీగా సాగిపోయింది.
ప్రథమార్ధంలో ఒక అరగంట వరకు రొటీన్ లవ్ సీన్లు.. స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలతో పాంచ్ మినార్ బోర్ కొట్టిస్తుంది కానీ.. ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్ హీరో కారు ఎక్కాక కథ మలుపు తిరిగిన దగ్గర్నుంచి సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. కథలో వచ్చే మలుపులకు తోడు.. కామెడీ సీన్లు సినిమా స్పీడును పెంచుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగా పేలింది. సెకండాఫ్ అంతా కథ పరుగులు పెడుతుంది. ఓవైపు రౌడీలు.. ఇంకోవైపు పోలీసులు.. మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఇరుక్కుని హీరో నలిగిపోయే సీన్లు వినోదాన్ని పంచుతాయి. స్క్రీన్ ప్లే రేసీగా సాగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించదగిందే అయినా..ఆకట్టుకుంటుంది. చివర్లో సీక్వెల్ కు కూడా లీడ్ ఇచ్చింది టీం. ఐతే రాజ్ తరుణ్ మీద నమ్మకం కోల్పోయిన ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతమేర ఆదరిస్తారన్నదాన్ని బట్టి పార్ట్-2 వస్తుందా రాదా అన్నది ఆధారపడి ఉంది. ఓపెన్ మైండ్ తో ఈ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు కచ్చితంగా మంచి కాలక్షేపమే అవుతుంది.
నటీనటులు: రాజ్ తరుణ్ పాత్ర.. నటన చూస్తే ఆరంభంలో రొటీన్ గా అనిపిస్తుంది. కానీ సినిమా ముందుకు సాగేకొద్దీ తన క్యారెక్టర్.. యాక్టింగ్ మెరుగ్గా అనిపిస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో అందరి మధ్యలో నలిగిపోతూ నవ్వులు పంచాడు. చాన్నాళ్ల తర్వాత రాజ్ పట్ల ప్రేక్షకులకు పాజిటివ్ ఫీలింగ్ కలిగించే సినిమా ఇది. తనకు నప్పే పాత్రలేవో.. ఎలా నటిస్తే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చో ఈ సినిమాతో అతడికి ఒక క్లారిటీ వస్తుందని ఆశించవచ్చు. హీరోయిన్ రాశి సింగ్ పర్వాలేదు. తనను కొన్ని రొమాంటిక్ సీన్లు.. పాటలకే పరిమితం చేశారు. మిగతా ఆర్టిస్టుల్లో లక్ష్మణ్ మీసాల అందరికంటే బాగా మెప్పించాడు. సినిమాలో ఎక్కువ నవ్వించేది అతనే. నితిన్ ప్రసన్న నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ పాత్రలో చక్కగా నటించాడు. బ్రహ్మాజీ, అజయ్ ఘోష్ తమ పాతరల పరిధిలో బాగా చేశారు. జీవా, రవివర్మ, కృష్ణతేజ, శ్రీనివాస రెడ్డి.. మిగిలిన నటీనటులు ఓకే.
సాంకేతిక వర్గం: శేఖర్ చంద్ర సంగీతం సోసోగా అనిపిస్తుంది. పాటలు వినసొంపుగా లేవు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఆదిత్య జవ్వాది విజువల్స్ ఆకట్టుకుంటాయి. రాజ్ తరుణ్ మార్కెట్ దెబ్బ తిన్నప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ కు ఏమీ ఢోకా లేదు. అవసరమైన మేర ఖర్చు పెట్టారు. దర్శకుడు రామ్ కుడుముల ఎంచుకున్న కథ కొత్తదేమీ కాకపోయినా.. రేసీ స్క్రీన్ ప్లేతో బండి బాగానే నడిపించాడు. టేకింగ్ పరంగా అతను బాలీవుడ్ క్రైమ్ కామెడీల స్టైల్ ఫాలో అయ్యాడు. రామ్ కామెడీని బాగా డీల్ చేశాడు.
చివరగా: పాంచ్ మినార్.. టైంపాస్ క్రైమ్ కామెడీ
రేటింగ్-2.5/5