ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో

Date of Release: 2025-11-07

Rahul Srinivas
Directer

Thiruveer Reddy
Star Cast

Tinu Shravya
Star Cast

Rohan Roy
Star Cast

Ashmita Reddy
Producer

Kalyan Nayak
Music
‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ
నటీనటులు: తిరువీర్- టీనా శ్రావ్య- నరేంద్ర రవి- మాస్టర్ రోహన్- యామిని తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: కె.సోమశేఖర్
నిర్మాతలు: సందీప్ అగరం- అశ్మితా రెడ్డి బసాని
రచన- దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్
పలాస.. మసూద.. పరేషాన్ లాంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించిన యువ నటుడు.. తిరువీర్. అతను ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం.. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. శుక్రవారం విడుదలవుతున్న ఈ చిత్రం.. పెయిడ్ ప్రిమియర్స్ తో ముందే ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
రమేష్ (తిరువీర్) శ్రీకాకుళం ప్రాంతంలోని ఓ చిన్న గ్రామంలో ఫోటో స్టూడియో కమ్ జిరాక్స్ షాప్ నడుపుతుంటాడు. పెళ్లిళ్లకు.. ఫంక్షన్లకు ఫోటోలు వీడియోలు తీస్తుంటాడు. అదే ఊళ్ళో పంచాయతీలో సెక్రెటరీగా పనిచేసే హేమ (టీనా శ్రావ్య)ను ఇష్టపడతాడు. ఆమెకూ అతనంటే ఇష్టమే. కానీ బయటపడదు. ఐతే ఆ ఊరిలో రాజకీయంగా పలుకుబడి ఉణ్న ఆనంద్ (నరేంద్ర)కు పెళ్లి ఫిక్సవడంతో ప్రి వెడ్డింగ్ షూట్ కోసం రమేష్ దగ్గరికొస్తాడు. ఆనంద్ కోరుకున్నట్లే సౌందర్య (యామిని)తో అతడి ప్రి వెడ్డింగ్ షూట్ భారీగానే చేస్తాడు రమేష్. కానీ అతడి అసిస్టెంట్ చేసిన తప్పు వల్ల చిప్ పోతుంది. దీంతో రమేష్ ఇబ్బందుల్లో పడతాడు. ఈ సమస్య నుంచి బయట పడడానికి ఆనంద్ పెళ్లి ఆపడమే మార్గం అనుకుంటాడు. మరి అతడి ప్రయత్నం ఫలించిందా.. ఇంతకీ చిప్ ఎలా పోయింది.. అది మళ్లీ దొరికిందా.. ఈ సమస్య నుంచి రమేష్ బయటపడ్డాడా.. హేమతో తన ప్రేమ సంగతి ఏమైంది.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెరపైనే తెలుసుకోవాలి.
కథనం - విశ్లేషణ:
కథలో భారీతనం.. బలం ఉన్నా.. కథనం ఆసక్తికరంగా లేక కొన్ని సినిమాలు తేడా కొడుతుంటాయి. అదే సమయంలో కథ సింపుల్ గా అనిపించినా.. ఎంగేజింగ్ కథనంతో కొన్ని చిత్రాలు ప్రేక్షకులను మెప్పిస్తుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్లో కామెడీ ఎంటర్టైనర్లు రెండో దారిలోనే నడుస్తున్నాయి. సింపుల్ స్టోరీ తీసుకుని.. మంచి కామెడీ సిచువేషన్లు రాసుకుని.. సరైన ఆర్టిస్టులను రంగంలోకి దించితే నవ్వులకు ఢోకా ఉండదు. ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ కూడా ఈ కోవకు చెందిన సినిమానే. తెలుగులో అరుదు అనదగ్గ ఇండీ స్టైల్ సినిమా ఇది. సినిమా బండి.. మెయిల్ లాంటి చిత్రాల స్ఫూర్తితో పల్లెటూరి నేపథ్యంలో సునిశితమైన హాస్యంతో ఆహ్లాదకరమైన సినిమాను అందించాడు కొత్త దర్శకుడు రాహుల్ శ్రీనివాస్. ఇందులో చెప్పుకోదగ్గ కథ లేకపోయినా.. లైట్ హార్టెడ్ కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ సాగే కథనం ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’కు బలంగా నిలిచింది. ఆర్గానిగ్గా సాగే కామెడీ సిచువేషన్లకు ఆర్టిస్టుల బలం కూడా తోడవడంతో సినిమా రెండు గంటల పాటు మంచి వినోదాన్నే అందిస్తుంది.
డేటా ఉన్న ఒక చిప్ పోతే పడే ఇబ్బందులు ఏంటి అని గతంలో పలు సినిమాల్లో చూసాం. ఐతే ఈ పాయింట్ మీద సీరియస్ సినిమాలే ఎక్కువగా చూసి ఉంటాం. దీని మీద ఫుల్ లెంత్ కామెడీ ట్రై చేశారు ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’లో. కొంచెం ఎమోషన్ కూడా వర్కవుట్ చేయాలని చూసినా అది పెద్దగా పండలేదు కానీ నవ్వులకైతే ఇందులో ఢోకా లేదు. ప్రి వెడ్డింగ్ ఫొటో షూట్లలో వింత పోకడల గురించి సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ చూస్తుంటాం. వాటిని సినిమాలో బాగానే వాడుకున్నారు. పల్లెటూరి నేపథ్యం తీసుకోవడం వల్ల అక్కడి జనాల అమాయకత్వం.. తెలియనితనం మీద కామెడీ సీన్లకు మంచి స్కోప్ దొరికింది. ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ల ప్రేమాయణం మీద కూడా ఒక ట్రాక్ నడిచినా.. అది సాధారణంగానే అనిపిస్తుంది. కానీ ఫొటోగ్రాఫర్ గా తిరువీర్.. తన అసిస్టెంటుగా ‘నైంటీస్’ కుర్రాడు రోహన్.. పెళ్లి కొడుకుగా నరేందర్.. ఎవరికి వాళ్లు పెర్ఫామెన్స్ అదరగొట్టేయడంతో వినోదానికి ఢోకా లేకపోయింది. ప్రథమార్ధంలో ప్రి వెడ్డింగ్ షూట్ చుట్టూ రాసుకున్న సీన్లే హైలైట్. ఈ షూట్ కు సంబంధించిన చిప్ పోవడంతో కథలో వచ్చే మలుపు కూడా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ఇంకో చిన్న ట్విస్ట్ చూస్తాం.
ఇంటర్వెల్ తర్వాత కాసేపు కథను ఎమోషనల్ గా నడిపించారు. అక్కడ కథ కొంచెం నెమ్మదించినా.. ఆ సన్నివేశాలు బాగానే అనిపిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ కథ కామెడీ వైపు మళ్లుతుంది. అసలు సమస్యకు కారణమైన కుర్రాడు చేసే అల్లరి నవ్వులు పండిస్తుంది. ప్రిక్లైమాక్సులో కథ కొంచెం నెమ్మదించినట్లు అనిపించినా.. క్లైమాక్స్ బాగానే వర్కవుట్ అయింది. ప్రి వెడ్డింగ్ ఫోటో షూట్.. ప్రేమ.. పెళ్లి లాంటి అంశాలను కామెడీగా చూపిస్తూనే అంతర్లీనంగా ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. క్లైమాక్స్ లో కూడా ఎమోషనల్ టచ్ ఇచ్చి.. చివర్లో మళ్ళీ నవ్వులతో ముగించడం బాగుంది. స్టార్లు లేకపోయినా.. భారీ కథ లేకపోయినా.. క్లీన్ అండ్ ఆర్గానిక్ కామెడీతో ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ ప్రేక్షకులకు రెండు గంటల పాటు ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుంది. ఓపెన్ మైండ్ తో సినిమాకు వెళ్తే కచ్చితంగా ఓ మంచి సినిమా చూసిన అనుభూతితో బయటికి వస్తారు.
నటీనటులు:
తిరువీర్ ఎప్పట్లాగే సింపుల్ గా.. సహజంగా నటించి మెప్పించాడు. సినిమాలో అతను హీరోలా కనిపించడు. ఒక పాత్రధారిలానే అనిపిస్తాడు. ఇటు కామెడీలో.. అటు ఎమోషనల్ సీన్లలో తిరువీర్ ఆకట్టుకున్నాడు. పాత్రలోని అమాయకత్వాన్ని హావభావాలతో బాగా చూపించాడు. హీరోయిన్ టీనా శ్రావ్య మంచి లుక్స్.. క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఆనంద్ పాత్రలో చేసిన నరేంద్ర సినిమాకు రియల్ హీరో అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఈ నటుడు.. ఫుల్ లెంత్ రోల్ లో అదరగొట్టేశాడు. కామెడీతో పాటు ఎమోషన్ ను కూడా అతను బాగా పండించాడు. అతడికి జోడీగా నటించిన యామిని కూడా బాగానే చేసింది. ‘నైంటీస్’ ఫేమ్.. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ భలే పాత్ర చేశాడు. అతడి కామెడీ అదిరిపోయింది. మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ ఓకే అనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి సినిమా శైలికి తగ్గ పాటలు.. నేపథ్య సంగీతం అందించాడు. పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించేలా లేకపోయినా.. సినిమాలో అలా అలా సాగిపోయాయి. ఆర్ఆర్ సన్నివేశాలకు బలం చేకూర్చింది. సినిమాటోగ్రాఫర్ సోమశేఖర్ ఇండీ సినిమాల స్టైల్ ఫాలో అయిపోయాడు. పల్లెటూరిలో సన్నివేశాలను బాగానే చూపించాడు. సినిమాను తక్కువ ఖర్చుతో సింపుల్ గా తీసేశారు. బడ్జెట్ పరిమితులు తెరపై కనిపించినప్పటికీ.. సన్నివేశాల్లో బలం కవర్ చేస్తుంది. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ తక్కువ వనరులతోనే మంచి సినిమా తీశాడు. సింపుల్ స్టోరీనే ఎంచుకున్నప్పటికీ.. కామెడీ సీన్లను బాగా రాసుకోవడం.. ఆర్టిస్టుల నుంచి మంచి పెర్ఫామెన్స్ రాబట్టుకోవడం ద్వారా అతను ప్రేక్షకులను అలరించాడు. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కామెడీ సీన్లతో అతను తన ముద్రను చూపించాడు.
చివరగా: ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో.. క్లీన్ కామెడీ షో
రేటింగ్: 2.75/5