బైసన్

Date of Release: 2025-10-24

Mari Selvaraj
Directer

Dhruv Vikram
Star Cast

Anupama Parameswaran
Star Cast

Rajisha Vijayan
Star Cast

Sameer Nair
Producer

Nivas K. Prasanna
Music
‘బైసన్’ మూవీ రివ్యూ
నటీనటులు: ధ్రువ్ విక్రమ్- పశుపతి- అనుపమ పరమేశ్వరన్- రజిష విజయన్- లాల్- అమీర్ తదితరులు
సంగీతం: నివాస్ ప్రసన్న
ఛాయాగ్రహణం: ఎలిల్ అరసు
నిర్మాతలు: సమీర్ నాయర్- దీపక్ సెహగల్- పా.రంజిత్- అదితి ఆనంద్
రచన-దర్శకత్వం: మారి సెల్వరాజ్
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘ఆదిత్య వర్మ’తో తమిళంలో కథానాయకుడిగా పరిచయం అయిన ధ్రువ్ విక్రమ్.. ఆ తర్వాత తండ్రితో కలిసి ‘మహాన్’ చేశాడు. ఐతే తొలి సినిమా ఓ మోస్తరుగా ఆడగా.. రెండో చిత్రం ఓటీటీకి పరిమితమైంది. అందుకే విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తో చేసిన ‘బైసన్’ను తన అసలైన అరంగేట్ర చిత్రంగా భావించాడు ధ్రువ్. ఈ తమిళ అనువాదం ఈ రోజే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ధ్రువ్ మెప్పించాడా.. మారి సెల్వరాజ్ మరోసారి తన మార్కు చూపించాడా.. తెలుసుకుందాం పదండి.
కథ: కిట్టయ్య (ధ్రువ్ విక్రమ్) ఒక పల్లెటూరిలో సాధారణ కుటుంబానికి చెందిన కుర్రాడు. అతడికి చిన్నప్పట్నుంచి కబడ్డీ అంటే ప్రాణం. అతడి తండ్రికీ కబడ్డీ అంటే ఇష్టం ఉన్నప్పటికీ.. ఆ ఆటలోకి వెళ్తే లేనిపోని గొడవల్లో తల దూర్చాల్సి వస్తుందని కొడుకును ప్రోత్సహించడు. కానీ స్కూల్లో కోచ్ తోడ్పాటుతో కిట్టయ్య కబడ్డీలో ఎదుగుతాడు. ముందు తన ఊరిలోనే సత్తా చాటిన కిట్టయ్య.. తర్వాత దేశానికి ఆడాలనే పట్టుదలతో కష్టపడుతుంటాడు. కానీ ఊర్లో కుల గొడవలు.. రాజకీయాలు ఎక్కడిక్కడ అతడికి అడ్డుకట్ట వేస్తూనే ఉంటాయి. మరి ఈ అడ్డంకులన్నీ దాటి అతను దేశానికి ఆడాలన్న కలను నెరవేర్చుకున్నాడా.. అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాడా.. అన్న ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ: తమిళంలో పా.రంజిత్.. మారి సెల్వరాజ్ అంటే ఒక రకం దర్శకులు. వాళ్లు ఏ కథలు ఎంచుకున్నా అందులో ఎక్కడో ఒకచోట కులం కోణం హైలైట్ అవుతుంది. లేదా మొత్తం కథే దాని చుట్టూ తిరుగుతుంది. కుల వివక్ష.. కుల ఘర్షణల నేపథ్యాలను తీసుకునే ఏ కథనైనా నరేట్ చేస్తారని వీరికి పేరుంది. పా.రంజిత్ వారసుడిగా పేరు తెచ్చుకున్న మారి సెల్వరాజ్.. ఇప్పటిదాకా తీసిన నాలుగు సినిమాలూ ఆ కోవకు చెందినవే. ఇప్పుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా తీసిన సినిమా ట్రైలర్ చూసినా... అతను మళ్లీ అదే నేపథ్యాన్ని తీసుకున్నాడని అర్థమైపోతుంది. ఇక ఒక చిన్న ఊరి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కబడ్డీ క్రీడాకారుడి కథను చెబుతున్నారంటే సగటు స్పోర్ట్స్ డ్రామాలు కళ్ల ముందు మెదులుతాయి. ఇలా సినిమా నేపథ్యం.. కథ గురించి ముందే ఒక అంచనాతో థియేటర్లలోకి అడుగు పెట్టాక.. ఆ అంచనాను దాటి ఏదైనా కొత్తదనం.. లేదా బలమైన ఎమోషన్ చూపిస్తేనే ఆ సినిమాకు కనెక్ట్ అవ్వగలం. కానీ ‘బైసన్’లో ఈ రెండూ మిస్ అయ్యాయి. టేకింగ్ బాగుంది.. పెర్ఫామెన్సులు బాగున్నాయి.. ఏదో ఒక మంచి ప్రయత్నం చేశారు అని చెప్పుకోవాలి తప్ప.. 2 గంటల 40 నిమిషాల సుదీర్ఘ నిడివితో సాగే ‘బైసన్’ చాలా వరకు బోరింగ్ గానే అనిపిస్తుంది. ప్రేక్షకుడిని ఎక్కడా పెద్దగా ఎగ్జైట్ చేయదు.
కుల ఘర్షణలతో అట్టుడిగే గ్రామీణ ప్రాంతం నుంచి ఒక కుర్రాడు.. తనకు ఎదురైన అడ్డంకులన్నీ అధిగమించి కబడ్డీలో అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడనే కథతో తెరకెక్కిన సినిమా ‘బైసన్’. ఐతే ఆ అడ్డంకులనేవి చాలా కఠినంగా అనిపించాలి.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎంతో బలంగా ఉండాలి. కథ-పాత్రలు హృదయానికి తాకేలా ఉండాలి. అప్పుడే ఎమోషన్ పండుతుంది. కానీ ‘బైసన్’లో ఈ ప్రయత్నం మధ్యలోనే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. పరియేరుం పెరుమాళ్.. కర్ణన్.. మామన్నన్ లాంటి చిత్రాల్లో కుల సమస్యను చాలా హృద్యంగా.. బలంగా చెప్పిన మారి సెల్వరాజ్.. ‘బైసన్’లో మాత్రం ఆ నేపథ్యాన్ని తీసుకున్నప్పటికీ విషయాన్ని బలంగా చెప్పలేకపోయాడు. హీరో తక్కువ కులం వాడు కావడం అతడికి సమస్యగా మారినట్లు కొన్ని సీన్లు.. డైలాగుల ద్వారా చెప్పే ప్రయత్నం జరిగింది. కానీ అవంత బలంగా లేవు. నిజానికి ఇందులో హీరో కెరీర్ కులం లేదా మరో సమస్య ఏ దశలోనూ ఆగదు. అతడికి ఎక్కడా అన్యాయం జరగదు. అడ్డంకులు ఎదురైనా అవంత పెద్ద సమస్యలా అనిపించవు. వాటిని సులువుగానే అధిగమిస్తాడు. ఇద్దరు కుల నాయకుల మధ్య గొడవ.. ఊర్లో ఘర్షణల మీద చాలా సీన్లు తీశారు కానీ.. అవి మొత్తం సినిమా నుంచి తీసేసినా పెద్దగా తేడా ఏమీ ఉండదు అనిపిస్తుంది. ఆ ట్రాక్ అంతా అంత సాధారణంగా సాగిపోతుంది. ఇద్దరు కుల నాయకులనూ మంచి వాళ్లుగానే చూపించి.. వాళ్లు అసలెందుకు గొడవ పడుతున్నారో బలమైన కారణం చెప్పకుండా.. కేవలం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం మీద సన్నివేశాలను నడిపించారు. రిపిటీటివ్ గా అనిపించే ఈ సీన్ల వల్ల నిడివి పెరగడం తప్ప కథకు పెద్దగా ప్రయోజనమే లేదు.
కుల నాయకుల గొడవలే కాదు.. ‘బైసన్’లో చాలా సీన్లు రిపిటీటివ్ గా అనిపిస్తాయి. రాష్ట్ర స్థాయిలో ఒకసారి హీరో పేరు సెలక్షన్ లిస్టులో ఉండదు. కానీ మళ్లీ చేరుస్తారు. అలాంటి సీన్ ఒక్కసారి పెడితే సరిపోదని.. మళ్లీ జాతీయ స్థాయిలో సేమ్ సీన్ రిపీట్ చేశారు. హీరో అనుకోకుండా ఒక గొడవలో తలదూరుస్తాడు. ప్రత్యర్థులు వేర్వేరు సందర్భాాల్లో రెండుసార్లు అతడి మీద ఎటాక్ చేస్తారు. రెండూ ఒకే రకం సీన్లలా అనిపిస్తాయి తప్పితే.. అందులో ఒకటి తీసేసినా తేడా ఉండదు. ఇలా చూసిన సీన్లే మళ్లీ మళ్లీ చూస్తుంటే కథ మీద ఏం ఆసక్తి పుడుతుంది? ఐతే ‘బైసన్’లో అక్కడక్కడా కొన్ని సీన్లు మాత్రం హృద్యంగా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో బస్సు సన్నివేశంతో కథకు మంచి పునాది వేశారు. హీరోతో పాటు అతడి తండ్రిగా పశుపతి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. వీరి మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. ఒక దశ వరకు ‘బైసన్’ ఓ మాదిరిగా ఎంగేజ్ చేస్తూ.. బలమైన కాన్ఫ్లిక్ట్ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ కుల నాయకుల గొడవ వల్ల కథకు ఏ ప్రయోజనం చేకూరకపోవడంతో ‘బైసన్’ సాధారణంగా మారుతుంది. ఇక హీరో కబడ్డీలో ఎదిగే వైనం కూడా అంత గొప్పగా అనిపించదు. కబడ్డీ మ్యాచ్ సీన్లు పర్వాలేదనిపిస్తాయి తప్ప.. గూస్ బంప్స్ ఇవ్వలేకపోయాయి. చివర్లో మాత్రం కొంచెం ఎమోషన్ వర్కవుట్ అయింది. మొత్తంగా చూస్తే.. ‘బైసన్’ ఒక మంచి ప్రయత్నమే కానీ.. కథలో బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం.. రిపిటీటివ్ సీన్ల వల్ల చాలా వరకు విసుగు పుట్టిస్తుంది.
నటీనటులు: ధ్రువ్ విక్రమ్ కిట్టయ్య పాత్ర కోసం సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. తొలి రెండు చిత్రాల్లో చాలా మోడర్న్ గా కనిపించిన అతను.. పల్లెటూరికి చెందిన మొరటు కుర్రాడిగా మేకోవర్ తో ఆశ్చర్యపరిచాడు. తన లుక్.. మేనరిజమ్స్ బాగున్నాయి. నటన కూడా ఓకే కానీ.. చాలా వరకు ఒకే రకమైన హావభావాలే పలికించాడు. దీంతో పోలిస్తే ‘మహాన్’లోనే అతను వైవిధ్యం చూపించాడు. పశుపతి మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. ఇలాంటి పాత్రలకు ఆయనకు కొట్టిన పిండే. అనుపమ పరమేశ్వరన్ పల్లెటూరి అమ్మాయిగా సులువుగా ఒదిగిపోయింది. తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రభావాన్ని చూపించింది. హీరో అక్క పాత్రలో రజిష విజయన్ బాగా చేసింది. లాల్.. అమీర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరో కోచ్ పాత్రలో చేసిన నటుడు ఆకట్టుకున్నాడు.
సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘బైసన్’లో మంచి ప్రమాణాలు కనిపిస్తాయి. మంచి క్వాలిటీతో సినిమా తీశారు. నివాస్ ప్రసన్న నేపథ్య సంగీతం సినిమాను డ్రైవ్ చేయడంలో ఉపయోగపడింది. తన పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ఎలిల్ అరసు ఛాయాగ్రహణం సినిమాలో మేజర్ హైలైట్. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్.. ఇంతకుముందు తీసిన నాలుగు సినిమాలతో పోలిస్తే ‘బైసన్’ సాధారణంగా అనిపిస్తుంది. తన సినిమాల్లో బలమైన ఎమోషన్ ఉంటుంది. ఇందులో అది మిస్ అయింది. సాధారణమైన పాత్రలు.. సన్నివేశాలతో తన మీద ఉన్న అంచనాలను అతను అందుకోలేకపోయాడు. కుల కోణాన్ని అతను ఈసారి సరిగా ఎలివేట్ చేయకపోవడమే సినిమాకు సమస్యగా మారింది.
చివరగా: బైసన్.. మెప్పించని ‘మంచి’ కథ
రేటింగ్-2.25/5