థామా

Date of Release: 2025-10-21

Aditya Sarpotdar
Directer

Ayushmann Khurrana
Star Cast

Rashmika Mandanna
Star Cast

Sathyaraj
Star Cast

Dinesh Vijan
Producer

Sachin Sanghvi
Music
‘థామా’ మూవీ రివ్యూ
నటీనటులు: రష్మిక మందన్నా- ఆయుష్మాన్ ఖురానా- నవాజుద్దీన్ సిద్ధిఖీ- పరేష్ రావల్- గీత అగర్వాల్ శర్మ- ఫైజల్ ఖాన్- వరుణ్ ధావన్- సత్యరాాజ్ తదితరులు
సంగీతం: సచిన్- జిగార్
ఛాయాగ్రహణం: సౌరభ్ గోస్వామి
నిర్మాతలు: దినేశ్ విజాన్- అమర్ కౌశిక్
రచన: నీరేన్ భట్- సురేష్ మాథ్యూ- అరుణ్ ఫలారా
దర్శకత్వం: ఆదిత్య సర్పోట్దర్
హిందీలో హార్రర్ కామెడీ సినిమాలతో ఒక యూనివర్శ్ ను క్రియేట్ చేసింది మ్యాడ్ రాక్ ఫిలిమ్స్ సంస్థ. అందులో బేడియా (తోడేలు).. ముంజియా.. స్త్రీ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి విజయం సాధించాయి. ఈ కోవలోనే ఇప్పుడు ‘థామా’ సినిమా తెరకెక్కింది. రష్మిక మందన్నా ప్రధాన పాత్ర పోషించడంతో ఈ చిత్రం దక్షిణాది ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ రోజే పాన్ ఇండియ ా స్థాయిలో రిలీజైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
అలోక్ (ఆయుష్మాన్ ఖురానా) ఒక మీడియా సంస్థలో జర్నలిస్టు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే స్టోరీ కోసం తన టీంతో కలిసి అతను అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఒక ఎలుగుబంటి అతడి వెంట పడుతుంది. ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న అతణ్ని తడ్కా (రష్మిక మందన్నా) కాపాడుతుంది. ఆమెతో అలోక్ ప్రేమలో పడిపోతాడు. కానీ తడ్కా మామూలు మనిషి కాదు. అడవిలోనే బతికే బేతాళ జాతికి చెందింది. ఎన్నో ఏళ్ల నుంచి బందీగా ఉన్న యక్షాసన్ అనే మహా రాక్షసుడు అలోక్ ను బలి తీసుకోబోతున్న సమయంలో అతణ్ని రక్షించి తనతో పాటు దిల్లీకి వచ్చేస్తుంది తడ్కా. కానీ ఆమె మామూలు మనిషి కాదని నెమ్మదిగా అలోక్ కు అర్థమవుతుంది. తన వల్ల అలోక్ కు హాని ఉందని అర్థం చేసుకున్న తడ్కా.. తిరిగి అడవిలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ అప్పుడే అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఆ పరిణామం ఏంటి.. దాని వల్ల అలోక్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది.. చివరికి అలోక్-తడ్కా కలిశారా లేదా.. ఇంతకీ యక్షాసన్ కథ ఏంటి.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
హార్రర్ కామెడీ.. సౌత్ ఇండియన్ సినిమాలు ఎప్పుడో నమిలి పడేసిన జానర్. చంద్రముఖి.. కాంచన.. ప్రేమకథా చిత్రమ్.. సహా ఎన్నో చిత్రాలు ఇక్కడి ప్రేక్షకులను భయపెట్టి.. థ్రిల్ పంచి.. నవ్వుల్లో ముంచెత్తి బాక్సాఫీస్ దగ్గర జయకేతనం ఎగురవేశాయి. ఈ జానర్ ఇక్కడి ప్రేక్షకులకు మొహం మొత్తేస్తున్న సమయంలో బాలీవుడ్ దాన్ని అందుకుని వేరే లెవెల్ కు తీసుకెళ్లింది. ముఖ్యంగా మ్యాడ్ రాక్ ఫిలిమ్స్ వాళ్లు హార్రర్ కామెడీలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయారు. వందల కోట్ల వసూళ్లు రాబట్టే సినిమాలను అందించారు. కానీ వాళ్ల సినిమాలను చూస్తే ఇవి మనవాళ్లు ఎప్పుడో తీసేశారు కదా.. మన సినిమాలు ఇంకా గ్రిప్పింగ్ గా ఉంటాయి కదా అనే ఫీలింగే కలుగుతుంది. గత ఏడాది ఏకంగా ఆరొందల కోట్ల వసూళ్లు రాబట్టిన ‘స్త్రీ-2’ను చూస్తే అది ఎందుకంత పెద్ద హిట్టయిందో అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పుడు మ్యాడ్ రాక్ హార్రర్ కామెడీ యూనివర్శ్ నుంచి వచ్చిన ‘థామా’ను చూసి కూడా హిందీ ఆడియన్స్ ఆహా ఓహో అనుకోవచ్చేమో. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది అంత కిక్కిస్తుందా అన్నది సందేహమే. హార్రర్ కామెడీల్లో ఇప్పటికే పీక్స్ చూసేసిన మన వాళ్లను ఎగ్జైట్ చేసేంత కథాకథనాలేమీ లేవిందులో. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలంతో ‘థామా’ కొంతమేర ఆకట్టుకుంది తప్ప.. కథాకథనాల్లో అంత బిగి లేదు. అన్నింటికీ మించి ఇందులో ‘థ్రిల్’ ఫ్యాక్టర్ పూర్తిగా మిస్ అయింది.
‘థామా’ ఆరంభ సన్నివేశంలో అలెగ్జాండర్ ఇండియా మీద దాడి చేసే క్రమంలో ఒక అడవిలోకి తన సైన్యంతో ప్రవేశిస్తాడు. కానీ దయ్యాల్లో ఒక రకం అయిన బేతాళుల గుంపు వాళ్ల మీదికి దాడి చేసి చంపేస్తుంది. అలెగ్జాండర్ సైతం ఒక బేతాళుడి చేతిలోనే హతమవుతాడు. ఫాంటసీ సినిమాల్లో లాజిక్కుల గురించి ఆలోచించకూడదన్నది వాస్తవమే అయినా.. మా దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తావా అంటూ అలెగ్జాండర్ని ఒక బేతాళుడు చంపేయడం అన్నది విడ్డూరంగా అనిపిస్తుంది. ఇలా మొదలైన కథ ఎలా ముందుకు సాగుతుందో అంచనా వేయడం కష్టమేమీ కాదు. ఫాంటసీ పేరు చెప్పి ప్రతి పాత్రతోనూ చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేయించారు. దయ్యాలు.. భూతాల స్టోరీలంటే.. ఆ పాత్రలంటే మనకు కొన్ని అంచనాలుంటాయి. కానీ ‘థామా’లో మాత్రం ఇష్టానుసారం ఆ పాత్రలను తీర్చిదిద్ది.. ప్రేక్షకులకు పిచ్చెక్కేలా చేశారు మేకర్స్. ఇందులో యక్షాసన్ అనే బ్రహ్మరాక్షసుడిగా నవాజుద్దీన్ సిద్ధిఖి చేసిన పాత్రే చాలా వింతగా ఉంటుంది. ఆ క్యారెక్టర్.. జర్నలిస్ట్ అయిన హీరోతో ఇంగ్లిష్ తో మాట్లాడుతుంది. నీకు ఇంగ్లిష్ కూడా వచ్చా అంటే.. నేను ఇంగ్లిష్ వాళ్ల రక్తం తాగా కదా అందుకే వచ్చు అంటుంది. ఇలా మాట్లాడే పాత్రను చూసి ప్రేక్షకులు భయపడతారా.. అలా భయపడనపుడు హార్రర్ ఎమోషన్ ఎలా వర్కవుట్ అవుతుంది? టెన్షన్ ఎలా బిల్డ్ అవుతుంది? నవాజుద్దీన్ అనే కాదు.. రష్మిక సహా ప్రతి పాత్రను ఇలాగే తీర్చిదిద్దడం వల్ల సినిమాలో ఎక్కడా ఫియర్ ఫ్యాక్టర్ అన్నదే కనిపించదు. కథలో వచ్చే కీలక మలుపులన్నీ కూడా చాలా తేలిగ్గా అనిపిస్తాయి తప్ప.. ఒక టెన్షన్ బిల్డ్ చేయడం కానీ.. ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేయడం కానీ ఉండదు ‘థామా’లో.
ఐతే ఈ లోపాలను పక్కన పెట్టి చూస్తే.. ‘థామా’ విజువల్ గా మాత్రం ఆకట్టుకుంటుంది. వీఎఫెక్స్ ను ఈ సినిమా బాగా ఉపయోగించుకుంది. రష్మిక.. ఆయుష్మాన్ ఖురానా.. బేతాళ అవతారాల్లో చేసే విన్యాసాలు క్రేజీగా అనిపిస్తాయి. అవి పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి. మ్యాడ్ రాక్ హార్రర్ కామెడీ యూనివర్శ్ లో ‘తోడేలు’గా కనిపించిన వరుణ్ ధావన్ పాత్రను ఇందులో క్యామియోగా చూడొచ్చు. ఆయుష్మాన్-వరుణ్ మధ్య వచ్చే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ప్రథమార్దంలో రష్మిక-ఆయుష్మాన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ బోర్ కొట్టించినా.. విరామం నుంచి మొదలయ్యే మలుపులతో కథనం కొంచెం ఊపందుకుంటుంది. ద్వితీయార్ధం అంతా భారీ యాక్షన్ ఘట్టాలు.. వీఎఫెక్స్ తో ముడిపడ్డ సీన్లే ఉండడం వల్ల విజువల్ గా సినిమా మెప్పిస్తుంది. కానీ చివరి వరకు కథ పరంగా టెన్షన్ బిల్డ్ చేయడంలో.. థ్రిల్స్ పంచడంలో మాత్రం ‘థామా’ ఫెయిలైంది. విజువల్ గా సినిమా బాగుండడం వల్ల.. రష్మిక-ఆయుష్మాన్ పాత్రల విన్యాసాలు ఆకట్టుకోవడంతో ‘థామా’ కొంతమేర నిలబడింది. హిందీ ఆడియన్స్ ‘థామా’కు ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశముంది కానీ.. హార్రర్ కామెడీల్లో పీక్స్ చూసిన తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది జస్ట్ ఓకే అనిపిస్తుందంతే.
నటీనటులు:
రష్మిక మందన్నా తన అభిమానులను పూర్తిగా మెప్పిస్తుంది. తెలుగు ఆడియన్స్ తన కోసమే చూడాలి ఈ చిత్రాన్ని. తన పెర్ఫామెన్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చేసింది బేతాళ పాత్రే కానీ.. అందులో ఆమెను చాలా గ్లామరస్ గా చూపించారు. లిప్ లాక్స్.. క్లీవేజ్ షోలతో రెచ్చిపోయింది రష్మిక. ఆయుష్మాన్ ఖురానా సరదా నటనతో ఆకట్టుకున్నాడు. మంచి ఎనర్జీతో అలోక్ పాత్రను పోషించాడతను. నవాజుద్దీన్ సిద్ధిఖి యక్షాసన్ పాత్రలో అనుకున్నంతగా భయపెట్టలేకపోయాడు. మొదట్లో క్రేజీగా అనిపించే ఆ పాత్ర.. తర్వాత తేలిపోతుంది. హీరో తల్లిదండ్రుల పాత్రల్లో పరేష్ రావల్.. గీతా అగర్వాల్ శర్మ ఆకట్టుకున్నారు. వరుణ్ ధావన్ క్యామియో ఆకట్టుకుంటుంది. సత్యరాజ్ పాత్ర మాత్రం ఇంపాక్ట్ వేయలేదు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘థామా’ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. వీఎఫెక్స్ తో ముడిపడ్డ సన్నివేశాలను మంచి క్వాలిటీతో తీశారు. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. సచిన్- జిగార్ పాటలు.. నేపథ్య సంగీతం బాగానే సాగాయి. సౌరభ్ గోస్వామి ఛాయాగ్రహణమూ ఆకట్టుకుంటుంది. స్క్రిప్ట్ విషయానికి వేస్తే.. ‘థామా’ బేసిక్ ఐడియా బాగున్నా.. కథా విస్తరణలో దాన్ని అంత ఆసక్తికరంగా తీర్చిదిద్దలేదనిపిస్తుంది. ఆదిత్య ఆదిత్య సర్పోట్దర్ టేకింగ్ బాగుంది. వీఎఫెక్స్ తో ముడిపడ్డ సీన్లను అతను బాగా ప్రెజెంట్ చేశాడు.
చివరగా: థామా.. కొన్ని మెరుపుల కోసం
రేటింగ్- 2.5/5