కన్నప్ప

Date of Release: 2025-06-27

Mukesh Kumar Singh
Directer

Vishnu Manchu
Star Cast

Prabhas
Star Cast

Kajal Aggarwal
Star Cast

Mohan Babu
Star Cast

Brahmanandam
Star Cast

Mohan Babu
Producer

Stephen Devassy
Music
‘కన్నప్ప’ మూవీ రివ్యూ
నటీనటులు: మంచు విష్ణు- ప్రీతి ముకుందన్- మోహన్ బాబు- శరత్ కుమార్- ప్రభాస్- మోహన్ లాల్- మధుబాల- ముఖేష్ రుషి- రఘుబాబు- బ్రహ్మాజీ- శివబాలాజి- కౌశల్ తదితరులు
సంగీతం: స్టీఫెన్ దేవాసీ
ఛాయాగ్రహణం: షెల్డన్ చవు
నిర్మాత: మోహన్ బాబు
కథ-స్క్రీన్ ప్లే: మంచు విష్ణు
దర్శకత్వం: ముకేశ్ కుమార్ సింగ్
కన్నప్ప.. మంచు విష్ణు కలల చిత్రం. పుష్కర కాలం కిందటే ఈ సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టిన విష్ణు అండ్ టీం.. రెండేళ్ల కిందట ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లింది. మేకింగ్.. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమై ఎట్టకేలకు ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మంచు వారి డ్రీమ్ ప్రాజెక్టు ప్రేక్షకులను మెప్పించేలా ఉందా? వారి కష్టానికి ఫలితం దక్కుతుందా? తెలుసుకుందాం పదండి.
కథ:
కలియుగం 2వ శతాబ్దంలో ఉటుకూరు అనే గూడెంలో ఐదు గిరిజన తెగలు జీవిస్తుంటాయి. ఒక తెగకు నాయకుడైన నాథనాథుడి (శరత్ కుమార్) కొడుకు తిన్నడు (మంచు విష్ణు). తమ గూడెంలో అమ్మోరికి నరబలులు జరగడం చూసి తట్టుకోలేకపోయిన తిన్నడు చిన్నప్పటి నుంచే దేవుళ్ల మీద ద్వేషం పెంచుకుంటాడు. పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆ ద్వేషం ఇంకా పెరుగుతుంది. కానీ అతను ప్రేమించిన నెమలి (ప్రీతి ముకుందన్) శివుడికి మహా భక్తురాలు. మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న వాయులింగాన్నిసొంతం చేసుకోవాలని కాలాముఖుడు అనే రాక్షసుడికి చెందిన సైన్యం ప్రయత్నిస్తుంటుంది. అతడి తమ్ముడు తిన్నడి చేతిలో చావడంతో మొత్తం గిరిజన తెగల్ని అంతమొందించాలని కాలాముఖుడు పంతం పడతాడు. అతడి నుంచి అందరికీ ముప్పు పొంచి ఉన్న తిన్నడు గూడెం నుంచి బహిష్కరణకు గురవుతాడు. మరి కాలాముఖుడి నుంచి గూడేన్ని తిన్నడు కాపాడగలిగాడా.. తన ప్రేమ సంగతి ఏమైంది.. దేవుడంటే అస్సలు గిట్టని తిన్నడు శివుడికి పరమ భక్తుడిగా ఎలా మారాడు.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
‘కన్నప్ప’ సినిమాను మంచు విష్ణు అండ్ కో ఇంత పట్టుబట్టి.. భారీ బడ్జెట్ పెట్టి.. ఎంతో నమ్మకంగా తెరకెక్కించడానికి ప్రధాన కారణం.. ఆ కథలో ఉన్న బలం. కన్నప్ప అసలు పేరు.. తిన్నడు. మరి ఆ తిన్నడు కన్నప్ప ఎందుకు అయ్యాడు అన్నదే ఈ కథకు ప్రత్యేకతను చేకూర్చే విషయం. దేవుడు పేరెత్తితే మండిపడేవాడు.. పరమ భక్తుడిగా మారి.. తన కళ్లను దేవుడికి సమర్పించే దశకు వెళ్లడం అన్నది ఎంతో ఆసక్తి రేకెత్తించే పాయింట్. ముందు తరం ప్రేక్షకులను కదిలించిన ఈ కథను.. పకడ్బందీగా తెరకెక్కిస్తే ఇప్పటి ఆడియెన్సునీ కదిలించే అవకాశం ఉండేది. కానీ ఈ ప్రయత్నంలో విష్ణు అండ్ టీం పూర్తిగా సఫలం కాలేకపోయింది. అసహజమైన వాతావరణానికి తోడు కృత్రిమంగా అనిపించే పాత్రలు.. సన్నివేశాలతో చాలా సమయాన్ని వృథా చేసింది. గంటన్నర నిడివిలో ‘వావ్’ అనిపించే ఎపిసోడ్లు పెద్దగా లేవు. అసలు ప్రథమార్ధంలో కథే ముందుకు కదలదు. పూర్తిగా ద్వితీయార్ధం మీద భారం మోపేసి.. అంతకుముందు ఫిల్లింగ్ కోసం నామమాత్రపు సన్నివేశాలలో లాగించేసినట్లు అనిపిస్తుంది. గూడెం జనాల వ్యవహారాలు.. వాళ్ల ఆచారాలు.. అంతర్గత గొడవలు.. ఇవేవీ కూడా ఆసక్తి రేకెత్తించవు. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ కూడా సాగతీతగా అనిపిస్తుంది. విలన్ ట్రాక్ కూడా అంతంతమాత్రమే. ద్వితీయార్ధంలోనూ ఒక దశ వరకు ‘కన్నప్ప’ మామూలుగానే సాగుతుంది. మోహన్ లాల్ రాకతో కూడా కథలో ఊపు రాదు. చివరికి ప్రభాస్ రంగప్రవేశం చేశాక కానీ.. ‘కన్నప్ప’ వేగం పుంజుకోదు. ఎదురు చూపులకు తెరదించుతూ రుద్ర పాత్ర వచ్చాక అటు కథలో.. ఇటు ప్రేక్షకుల్లో చురుకు పుడుతుంది.
తిన్నడి పాత్ర పరిణామం చెందిన దగ్గర్నుంచి ‘కన్నప్ప’ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. కథ ప్రకారం తిన్నడు కన్నప్పగా మారడానికి రుద్ర పాత్ర ఒక ఉత్ప్రేరకం అన్నమాట. ఈ సినిమా కూడా స్లో మోడ్ నుంచి కొంచెం వేగం పుంజుకోవడానికి ప్రభాస్ ఉత్ప్రేరకం లాగే ఉపయోగపడ్డాడు. ప్రభాస్ గొప్పగా నటించాడని చెప్పలేం కానీ.. తన స్క్రీన్ ప్రెజెన్స్ ‘కన్నప్ప’కు ఎంతో ఉపయోగపడింది. నెమ్మదిగా నడుస్తున్న కథలో తన రాకతో వేగం అందుకుంటుంది. ప్రేక్షకుల్లోనూ ఉత్సాహం వస్తుంది. అక్కడి నుంచి చివరిదాకా ‘కన్నప్ప’ మంచి టెంపోతో సాగుతుంది. తిన్నడిలో పరివర్తన వచ్చే సన్నివేశాలు ఇంకా బలంగా ఉండాల్సింది అనిపిస్తుంది కానీ.. అతడిలో మార్పు వచ్చాక మాత్రం కథనం ఊపందుకుంటుంది. పతాక సన్నివేశాలు సినిమాకు మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. కానీ ముందు నుంచి సినిమాలో ఎమోషనల్ డెప్త్ ఉండుంటే.. ఈ సన్నివేశాలు ఇంకా గొప్పగా.. హృద్యంగా అనిపించేవి. మంచు విష్ణులో మునుపెన్నడూ చూడని నటనా ప్రతిభను ఆ సన్నివేశాల్లో చూస్తాం. గాయం చేసి మందేసినట్లుగా.. తొలి రెండు గంటల్లో నెమ్మదిగా సాగిన ‘కన్నప్ప’ చివరి గంటలో కొంత ఉపశమనాన్ని ఇస్తుంది.
నటీనటులు:
కన్నప్ప పాత్రను మంచు విష్ణు ఎలా చేస్తాడో అని అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్లను కొన్ని సన్నివేశాల్లో అతను ఆశ్చర్యపరుస్తాడు. మొదట్లో చూస్తే కన్నప్ప పాత్రకు సరిపోయినట్లు అనిపించకపోయినా.. నెమ్మదిగా అలవాటు పడతాం. పతాక సన్నివేశాల్లో అతను చాలా సిన్సియర్ గా నటించినట్లు అనిపిస్తుంది. నాస్తికుడి నుంచి శివభక్తుడిగా పరిణామం చెందాక విష్ణు నటన ఆకట్టుకుంటుంది. ముందే అన్నట్లు కండలు తిరిగిన దేహం.. స్టైలింగ్ చేయించిన గడ్డం.. ఒంటి మీద టాటూలతో విష్ణు లుక్ మాత్రం మోడర్న్ గా అనిపిస్తూ.. కొంచెం ఇబ్బంది పెడుతుంది. నటన పరంగా మాత్రం విష్ణు కెరీర్లో కన్నప్ప పాత్ర గుర్తుంచుకోదగ్గది. ప్రీతి ముకుందన్ నటన ఓకే. దాని కంటే గ్లామర్ విషయంలోనే ఆమెకు ఎక్కువ మార్కులు పడతాయి. ఆమెను శివభక్తురాలిగా చూపించారు కానీ.. తన అప్పీయరెన్స్ మాత్రం అలాంటి భావన కలగనీయదు. ప్రభాస్ తన క్యామియోకు న్యాయం చేశాడు. పెద్దగా నటించే అవకాశం ఈ పాత్ర ఇవ్వలేదు కానీ.. ప్రభాస్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే మ్యాజిక్ చేశాడు. మోహన్ లాల్ పాత్ర అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేదు. ఆయన నటన ఓకే. శివుడిగా అక్షయ్ కుమార్ పాత్ర పరిధి మేరకు నటించారు. ఆయనకు డబ్బింగ్ సరిగా కుదిరింది. పార్వతీగా కాజల్ అగర్వాల్ కూడా ఓకే. మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్ర ఆరంభంలో ఆసక్తి రేకెత్తిస్తుంది కానీ.. తర్వాత ప్రాధాన్యం కోల్పోయింది. పతాక సన్నివేశాల్లో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. తిన్నడి తండ్రి పాత్రలో శరత్ కుమార్ మెప్పించారు. కానీ తమిళ వాసనలతో సాగే ఆయన డబ్బింగ్ మాత్రం తేడా కొట్టింది. కాలాముఖుడిగా చేసిన విలన్ పాత్రధారి గురించి చెప్పడానికేమీ లేదు. పన్నగ పాత్రకు మధుబాల మిస్ ఫిట్ అనిపిస్తుంది. బ్రహ్మానందం సహా ఇంకా చాలామంది పేరున్న నటీనటులు నటించారు కానీ.. ఎవరికీ సరైన పాత్ర పడలేదు. తన పిల్లల్ని తెరపై చూసుకోవాలని మంచు విష్ణు ముచ్చటపడడం ఓకే కానీ.. చిన్నప్పటి తిన్నడిగా అవ్రామ్ క్యూట్ గా కనిపించినా.. ఆ పాత్రకు సరిపోలేదు. తన లుక్.. ముఖ్యంగా ఇంగ్లిష్ యాక్సెట్ తో సాగిన తన డైలాగులు ఆ పాత్రకు కుదరలేదు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘కన్నప్ప’ జస్ట్ ఓకే అనిపిస్తుంది. స్టీఫెన్ దేవాస్సీ నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచడానికి గట్టిగానే కృషి చేశాడు. కొన్ని చోట్ల మరీ లౌడ్ అనిపించినా.. చాలా వరకు సన్నివేశాలను ఎలివేట్ చేయడానికి ఆర్ఆర్ ఉపయోగపడింది. అతడి పాటలు మాత్రం సోసోగా అనిపిస్తాయి. షెల్డన్ చవు ఛాయాగ్రహణం నిలకడగా సాగలేదు. కొన్ని సన్నివేశాల్లో బాగా అనిపించినా.. కొన్ని చోట్ల నిరాశపరుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ స్థాయికి తగ్గ ఔట్ పుట్ తెరపై కనిపించలేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా మెరుగ్గా ఉండాాల్సింది. ‘కన్నప్ప’కు కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా సమకూర్చిన మంచు విష్ణు ఓకే అనిపిస్తాడు. ఈ కథకు బలంగా అనిపించే సన్నివేశాలు ఒరిజినల్ స్టోరీలో ఉన్నవే. అంతకుమించి విష్ణు ఆకర్షణలేమీ జోడించలేకపోయాడు. ‘మహాభారతం’ సీరియల్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్.. ‘కన్నప్ప’ సినిమాను సరిగా డీల్ చేయలేకపోయాడు. ఆయన టేకింగ్ ఓల్డ్ స్టయిల్లో సాగింది. పతాక సన్నివేశాల్లో మినహాయిస్తే దర్శకత్వ పరంగా మెరుపులు కనిపించవు.
చివరగా: క్లైమాక్స్ కోసం 'కన్నప్ప'
రేటింగ్- 2.5/5