మార్టిన్ లూథర్ కింగ్

Date of Release: 2023-10-27

Puja Kolluru
Directer

Sampoornesh Babu
Star Cast

Venkatesh Maha
Star Cast

Naresh
Star Cast

Saranya Pradeep
Star Cast
'మార్టిన్ లూథర్ కింగ్' మూవీ రివ్యూ
నటీనటులు: సంపూర్ణేష్ బాబు-నరేష్-వెంకటేష్ మహా-శరణ్య ప్రదీప్ తదితరులు
సంగీతం: స్మరణ్ సాయి
ఛాయాగ్రహణం: దీపక్ యరగెరా
కథ: మడోన్ అశ్విన్
కథనం-మాటలు: వెంకటేష్ మహా
నిర్మాతలు: శశికాంత్-చక్రవర్తి రామచంద్ర
దర్శకత్వం: పూజ కొల్లూరు
సంపూర్ణేష్ బాబు అంటే హృదయ కాలేయం.. కొబ్బరిమట్ట లాంటి స్పూఫ్ సినిమాలే గుర్తుకొచ్చేవి ఇంతకుముందు. ఐతే అతను ఒక సీరియస్ పాత్రలో నటించిన సినిమా 'మార్టిన్ లూథర్ కింగ్'. పేరుతోనే కాదు.. వైవిధ్యమైన ప్రోమోలతోనూ ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: ఆంధ్రా ప్రాంతంలోని పడమరపాడు అనే ఒక ఊరిలో రెండు కులాలకు చెందిన వర్గాల మధ్య దశాబ్దాలుగా వైరం నడుస్తుంటుంది. ఈ రెండు కులాల మధ్య ఘర్షణను ఆపాలని ఆ కులాల్లోంచి ఇద్దరు అమ్మాయిలను పెళ్లాడతాడు ఓ పెద్ద మనిషి. కానీ ఆ ఇద్దరు పెళ్లాలకు పుట్టిన జగ్గు (నరేష్).. లోకి (వెంకటేష్ మహా) పుణ్యమా అని ఆ ఊర్లో కులాల గొడవలు ఇంకా పెరుగుతాయి. అభివృద్ధికి నోచుకోకుండా తిరోగమనంలో పయనిస్తున్న ఈ ఊరిలో కొత్తగా ఎన్నికలు వస్తాయి. చాలా ఏళ్ల నుంచి ప్రెసిడెంటుగా ఉన్న తమ తండ్రి అనారోగ్యం బారిన పడటంతో జగ్గు-లోకి ఎన్నికల బరిలోకి దిగుతారు. ఐతే ఊర్లోని రెండు కులాలకు చెందిన ఓట్లు సమానంగా ఉండటంతో ఎవరు గెలుస్తారో తెలియని ఉత్కంఠ నెలకొంటుంది. ఆ సమయంలోనే ఊరిలో కొత్తగా ఓటు సంపాదించిన మార్టిన్ లూథర్ కింగ్ (సంపూర్ణేష్ బాబు) కీలకం అవుతాడు. ఇంతకీ ఈ కింగ్ ఎవరు.. తన నేపథ్యమేంటి.. తన పేరు వెనుక కథేంటి.. అతను ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసి గెలిపించాడు.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ: సినిమాల్లో మంచి విషయాలు చెప్పాలని చూస్తే.. వామ్మో అనే రోజులివి. సూటిగా సందేశాలు ఇవ్వాలని చూస్తే ప్రేక్షకులు దండం పెట్టేస్తున్నారు. దీంతో మంచి విషయాలు చెప్పాలన్నా.. సందేశం ఇవ్వాలన్నా దాన్ని సుగర్ కోటెడ్ స్టయిల్లో చెప్పాల్సిందే. వినోదం పండిస్తూ అంతర్లీనంగా సందేశాలిస్తే దాని రీచ్ కూడా బాగుంటుంది. 'మార్టిన్ లూథర్ కింగ్' ఆ కోవలోని సినిమానే. ఓటు హక్కు ప్రాధాన్యాతను తెలియజేయడం.. కులాల గొడవలతో జరిగే నష్టాన్ని చూపించడం అంతర్లీనంగా ఈ సినిమాలో ఉన్న ఉద్దేశం. కానీ దాన్ని పూర్తి వినోదాత్మకంగా చెప్పడానికి 'మార్టిన్ లూథర్ కింగ్' ప్రయత్నించింది. 'మండేలా' అనే మంచి తమిళ సినిమాను తెలుగీకరించడంలో రచయిత వెంకటేష్ మహా.. దర్శకురాలు పూజ కొల్లూరు బాగానే కష్టపడ్డారు. కాకపోతే పెర్ఫామెన్స్ తో ఎలివేట్ చేయాల్సిన పాత్రను నటుడిగా అనేక పరిమితులున్న సంపూర్ణేష్ బాబుతో చేయించడం ఈ చిత్రానికి మైనస్ అయింది. పాత్రకు అతను సూటవ్వలేదనేమీ లేదు. కానీ ఆ పాత్ర బరువును అతను మోయలేకపోయాడు. దీనికి తోడు ఆర్ట్ సినిమా స్టయిల్లో నెమ్మదిగా సాగే కథనం.. రిపీటెడ్ సీన్లు కూడా ఈ మంచి కథకు అక్కడక్కడా అడ్డం పడ్డాయి. ఓవరాల్ గా 'మార్టిన్ లూథర్ కింగ్' ఓ మోస్తరుగా అనిపించే కొత్త ప్రయత్నంలా అనిపిస్తుంది.
'మార్టిన్ లూథర్ కింగ్' కథకు కుదిరిన సెట్ ఈ సినిమాలో మేజర్ హైలైట్. ఒక పల్లెటూరిలో ఉత్తరం-దక్షిణం అని రెండు కులాల వారు విడిపోయి దశాబ్దాలుగా కొట్టుకు చస్తున్న తరుణంలో పంచాయితీ ఎన్నికలు రావడం.. రెండు వర్గాల మధ్య నువ్వా నేనా అన్న పోరు నెలకొన్న స్థితిలో ఒక్క ఓటు కీలకం కావడం.. ఆ ఓటరును ప్రసన్నం చేసుకోవడానికి ఇరు వర్గాలు పడే పాట్లు.. ఈ నేపథ్యంలో 'మార్టిన్ లూథర్ కింగ్' కథ ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎన్నికల ఫలితాన్ని తేల్చే ఒక్క ఓటరు నేపథ్యం కూడా ఆకట్టుకునేలా సాగుతుంది. చెప్పులు కుట్టుకుంటూ ఊర్లోవాళ్లు చెప్పిన ప్రతి పనీ చేస్తూ.. వాళ్లందరి దగ్గరా అవమానాలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. తను కొత్తగా సంపాదించుకున్న ఓటు హక్కుతో అందరితో దండాలు పెట్టించుకుని రాజభోగాలు అందుకునే క్రమంలో వచ్చే సీన్లు మంచి వినోదాన్ని పండిస్తాయి. కింగ్ పాత్ర మీద ఒక జాలి.. ఆపేక్ష కలిగేలా ఆ పాత్రకు సంబంధించిన ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కథలో కీలక మలుపు వచ్చే వరకు 'మార్టిన్ లూథర్ కింగ్' వేగంగా సాగిపోతుంది. హీరోయిన్ అని చెప్పలేం కానీ.. అలాంటి లక్షణాలే ఉన్న శరణ్య ప్రదీప్ కు హీరోకు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి.
ఐతే ద్వితీయార్ధంలో మాత్రం 'మార్టిన్ లూథర్ కింగ్' గ్రాఫ్ తగ్గిపోతుంది. హీరోను ప్రసన్నం చేసుకోవడానికి ఇరు వర్గాలు ప్రయత్నించే సీన్లు ఒక మూసలో సాగిపోతాయి. హీరో ప్రవర్తన అతిగా అనిపిస్తుంది. తన పాత్ర చిత్రణ లాజికల్ గా అనిపించదు. చూసిన సీన్లే మళ్లీ చూస్తున్నట్లు అనిపించి బోర్ కొడుతుంది. కథ ముందుకు కదలదు. ప్రి క్లైమాక్సులో సెంటిమెంట్ పండించడానికి చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. హీరో తన అత్యాశతో హద్దులు దాటి ప్రవర్తించే తీరు ఎబ్బెట్టుగా అనిపించినట్లే.. అతడిలో ఉన్నట్లుండి మార్పు వచ్చి మంచి చేయాలని చూసే వైనం కూడా అతిగా అనిపిస్తుంది. ఓటు అనేది ఎంత బలమైన ఆయుధం అని చెప్పే ప్రయత్నం బాగున్నప్పటికీ.. ఇంకొంచెం రియలిస్టిగ్గా.. ఆసక్తికరంగా ఈ సీన్లు డీల్ చేయాల్సింది. ముగింపు ఓ మోస్తరుగా అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే 'మార్టిన్ లూథర్ కింగ్' పారలల్ సినిమాల తరహాలో సాగే ఒక విభిన్న ప్రయత్నం. ఆర్టిస్టులు ఎవరని చూడకుండా ఓపెన్ మైండ్ తో ఒక మంచి కథను తెరపై చూడాలనుకుంటే ఇది ఓకే అనిపిస్తుంది. సగటు కమర్షియల్ సినిమాల్లో ఆశించే అంశాలు మాత్రం ఇందులో ఉండవు. కాసేపు నవ్వుకోవడానికి.. కొన్ని మంచి విషయాలు మనసులోకి ఎక్కించుకోవడానికి 'మార్టిన్ లూథర్ కింగ్' మంచి ఆప్షనే.
నటీనటులు: స్పూఫ్.. పేరడీ సినిమాల్లో సంపూర్ణేష్ బాబును చూసి తన మీద ఒక రకమైన అభిప్రాయంతో ఉన్న వాళ్లందరూ ఈ సినిమాలో సంపూని చూసి ఆశ్చర్యపోతారు. అతడి నటనలో కొత్త కోణాన్ని చూపించే సినిమా ఇది. కాకపోతే ఒరిజినల్లో యోగిబాబు పెర్ఫామెన్స్ ను మాత్రం సంపూ మ్యాచ్ చేయలేకపోయాడు. అమాయకత్వం వరకు బాగానే చూపించగలిగినా.. తన హావభావాలు ఒక దశ దాటాక ఒకేలా అనిపిస్తాయి. పాత్రకు యాప్ట్ అనిపించినా.. దాంతో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడే స్థాయిలో అతను దాన్ని పండించలేకపోయాడు. ఇక నరేష్.. వెంకటేష్ మహా ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. ఇద్దరి నటనా సహజంగా సాగింది. నరేష్ కు ఇలాంటి పాత్రలకు కొట్టిన పిండే కానీ.. వెంకటేష్ ఆయనకు దీటుగా నటించడం ఆశ్చర్యపరుస్తుంది. సినిమాను చాలా వరకు డ్రైవ్ చేసేది ఈ రెండు పాత్రలే. ఇక వీళ్లిద్దరి తండ్రి పాత్రలో చేసిన నటుడు కూడా ఆకట్టుకున్నాడు. సినిమాలో మిగతా పాత్రలన్నీ కూడా సహజంగా అనిపిస్తాయి. నిజంగా ఒక గ్రామంలోకి వెళ్లి అక్కడి మనుషులను చూస్తున్న ఫీలింగ్ కలిగించారు.
సాంకేతిక వర్గం: 'మార్టిన్ లూథర్ కింగ్'కు సాంకేతిక ఆకర్షణలు బాగానే కుదిరాయి. స్మరణ్ సాయి సంగీతం.. దీపక్ యరగెరా ఛాయాగ్రహణం ఆకట్టుకుంటాయి. పాటలు సినిమాలో బాగా కలిసిపోయాయి. పల్లె జానపదాలను బాగా వాడుకున్నారు. నేపథ్య సంగీతం కూడా ఆహ్లాదకరంగా సాగింది. పల్లె వాతావరణాన్ని సహజంగా చూపించడంలో కెమెరా పనితనంతో పాటు ఆర్ట్ వర్క్ ముఖ్య పాత్ర పోషించింది. వెంకటేష్ మహా తమిళ మాతృకలోని మంచి కథను తీసుకుని.. మన నేటివిటీకి తగ్గట్లు తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. కొన్ని కొత్త సీన్లు.. మాటలను అతను జోడించాడు. ఇదొక రీమేక్ మూవీ అనే ఫీల్ రాకుండా చూశాడు. పూజ కొల్లూరు టేకింగ్ ఓకే. నరేషన్ విషయంలో ఆమె ఒరిజినల్ ను ఫాలో అయిపోయింది.
చివరగా: మార్టిన్ లూథర్ కింగ్.. కథ మంచిది కథనం నెమ్మది
రేటింగ్-2.5/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater