భగవంత్ కేసరి

Date of Release: 2023-10-19

Anil Ravipudi
Directer

Nandamuri Balakrishna
Star Cast

Kajal Aggarwal
Star Cast

Sreeleela
Star Cast

Arjun Rampal
Star Cast

Sahu Garapati
Producer

Thaman S
Music
'భగవంత్ కేసరి' మూవీ రివ్యూ
నటీనటులు: నందమూరి బాలకృష్ణ-శ్రీలీల-అర్జున్ రాంపాల్- కాజల్ అగర్వాల్-జాన్ విజయ్-రవిశంకర్-శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సి.రామ్ ప్రసాద్
నిర్మాతలు: హరీష్ పెద్ది-సాహు గారపాటి
రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి
నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'భగవంత్ కేసరి'. వీళ్లిద్దరూ తమ శైలికి భిన్నంగా చేసిన ఈ చిత్రం.. ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'భగవంత్ కేసరి' ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
భగవంత్ కేసరి (బాలకృష్ణ) ఒక పెద్ద నేరం చేసి జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. తన తల్లి చనిపోయే ముందు ఆమెను కలిసే అవకాశం కల్పించిన జైలర్ (శరత్ కుమార్) మీద కృతజ్ఞతతో ఆయన మరణానంతరం తన కూతురు విజ్జి (శ్రీలీల) బాధ్యత తీసుకుంటాడు భగవంత్. ఐతే తండ్రి మరణంతో షాక్ కు గురైన విజ్జిని ఒక ఫోబియా వెంటాడుతుంటుంది. దీంతో ఆమెను శారీరకంగా.. మానసికంగా బలవంతురాలిని చేయాలని భగవంత్ ప్రయత్నిస్తుంటాడు. కానీ ఒక అబ్బాయి ప్రేమలో పడ్డ విజ్జి.. భగవంత్ ను అపార్థం చేసుకుని అతణ్ని దూరం పెడుతుంది. అలాంటి సమయంలోనే విజ్జి పెద్ద సమస్యలో చిక్కుకుంటుంది. తన ప్రాణానికే అపాయం వస్తుంది. అప్పుడు భగవంత్ రంగంలోకి దిగుతాడు. ఇంతకీ విజ్జికి ఎదురైన సమస్యేంటి.. దీన్ని భగవంత్ ఎలా పరిష్కరించాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
'భగవంత్ కేసరి' ఫస్ట్ టీజర్ నుంచి చూస్తే.. ఆయన ఎప్పుడూ చూసే సగటు మాస్ సినిమాలకు భిన్నమైన చిత్రంగానే కనిపించింది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ సినిమా గురించి మాట్లాడినపుడల్లా.. ఈసారి కొత్తగా ఏదో ట్రై చేస్తున్నట్లే చెబుతూ వచ్చాడు. ఈ సినిమా ప్రోమోలు చూసినా.. ఒక టెంప్లేట్లో సాగే సినిమాలా కనిపించలేదు. ఇది సగటు బాలయ్య సినిమాలతో పోలిస్తే కొంచెం భిన్నమైన ఫార్మాట్లో సాగే సినిమానే. ఇందులో బాలయ్య ఇంట్రో కొంచెం డిఫరెంటుగానే అనిపిస్తుంది. ఆయనకు ఇందులో ఇంట్రో సాంగ్ లేదు. కథానాయికతో రొమాన్సూ లేదు.. డ్యూయెట్టూ లేదు. అలాగే మాస్ మసాలా పాటలూ లేవు. 60 ప్లస్ వయసులోనూ బాలయ్యను ఒక యువకుడిలా చూపించలేదిందులో. నడి వయస్కుడిగా.. వయసుకొచ్చిన బిడ్డకు తండ్రిగా కనిపించాడు. బాలయ్యను ఇలా చూడటం కొత్తదనమే. అలా అని కథ పరంగా ఇది మరీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే సినిమా ఏమీ కాదు. బాలయ్య పాత్రను కొంచెం భిన్నంగా ప్రెజెంట్ చేయడం.. రొటీన్ పాటలు లేకుండా చూడటం వరకు అనిల్ వైవిధ్యం చూపించినా.. కథ విషయంలో.. సన్నివేశాల విషయంలో సగటు మాస్ సినిమాల రూట్లోనే వెళ్లాడు. ఎప్పుడూ చూసే ఎలివేషన్లు.. హై డోస్ యాక్షన్ సీక్వెన్సులు.. పంచ్ డైలాగులే ఇందులోనూ కనిపిస్తాయి. బాలయ్య అభిమానులకు.. మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా వాటిని తీర్చిదిద్దడంతో 'భగవంత్ కేసరి' రెండున్నర గంటలు బాగానే ఎంగేజ్ చేస్తుంది.
'భగవంత్ కేసరి' ఫ్లాష్ బ్యాక్ లో హీరో ఒక సీఐగా కనిపిస్తాడు. అతను నేరుగా ఎమ్మెల్యే సభ దగ్గరికి వెళ్లి ఆయనపై చేయి చేసుకుంటాడు. తర్వాత ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చి జైల్లో వేసేస్తాడు. ఎస్పీ వచ్చి ఎమ్మెల్యేను విడిచేయ్ అంటే.. ఒక లఫూట్ గాడిని విడిపించడానికి ఇంకో లఫూట్ వచ్చాడా అంటాడు. తానెంత వయొలెంటో చూపించి.. ఇటు ఎమ్మెల్యేకి అటు ఎస్పీకి చెమటలు పట్టించేస్తాడు. హీరో ఎంత సామాన్యుడైనా.. అవతల విలన్ ఎంత బలవంతుడిగా కనిపించినా.. ప్రతి సీన్లోనూ హీరోనే పైచేయి సాధించడం.. అతడికి ఎదురే లేనట్లు చూపించడం సగటు మాస్ సినిమాల లక్షణం. అనిల్ రావిపూడి కూడా అదే స్టయిల్లో 'భగవంత్ కేసరి'ని నడిపించాడు. ఇందులో విలన్.. సీఎం-పీఎంలను కూడా తన చెప్పుచేతుల్లో పెట్టుకునేంత పవర్ ఫుల్. కానీ ఇవతల బాలయ్య ఉంటే.. అవతల విలన్ ఎంత బలవంతుడైనా డోంట్ కేర్ అన్నట్లే ఉంటుంది వ్యవహారం. అందుకే సినిమాలో ఎక్కడా కూడా హీరోకు సవాల్ అంటూ ఎదురుకాదు. అడ్డంకులూ ఉండవు. ఎన్ని వందలమంది వచ్చినా ఒక్కడే దూసుకెళ్లిపోతుంటాడు. చెమట చుక్క చిందించకుండా అందరినీ మట్టుబెట్టేస్తుంటాడు. పేరుకు 'పవర్ ఫుల్' విలన్ అన్న మాటే కానీ.. హీరోను ఏ సీన్లోనూ అతను ఛాలెంజ్ చేసే స్థితిలో కనిపించడు. మొత్తం హీరో డామినేషనే కనిపిస్తుంది సినిమాలో.
'భగవంత్ కేసరి' కథ ప్రధానంగా తండ్రీ కూతుళ్ల బంధం నేపథ్యంలో నడవడం కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. ఒక ఫోబియాతో ఇబ్బంది పడుతున్న తన పెంపుడు కూతురిని దృఢంగా మార్చాలని తపించే తండ్రి కోణంలో ఈ కథ మొదలైన తీరు ఒక డిఫరెంట్ మూవీ చూడబోతున్న ఫీలింగే కలిగిస్తుంది. జైల్లో ఎంటర్టైనింగ్ గా సాగే హీరో ఎంట్రీ ఎపిసోడ్.. ఆ తర్వాత కథలో కొన్ని మలుపులతో ఆసక్తికరంగా మొదలయ్యే 'భగవంత్ కేసరి' చూస్తుండగానే రొటీన్ రూట్లోకి వచ్చేస్తుంది. హీరోయిన్ని రంగంలోకి దించి కామెడీ కొంచెం రొమాన్స్.. కామెడీతో సినిమాను నడిపించాలని అనిల్ చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ఒక అరగంటకు పైగా 'భగవంత్ కేసరి' సాధారణంగా అనిపిస్తుంది. ఐతే కూతురిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఇంటికెళ్లి వార్నింగ్ ఇచ్చే ఎపిసోడ్లో బాలయ్య అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులనూ అలరిస్తాడు. కేవలం మాటలతోనే భయపెట్టి అవతలి వ్యక్తిని హీరో తన కాళ్ల ముందుకు తీసుకొచ్చే ఎపిసోడ్ బాగా పేలింది. ఇక వందల మంది మీద హీరో విరుచుకుపడే ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ కూడా మాస్ కు గూస్ బంప్స్ ఇస్తుంది.
హీరో-విలన్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటో చూపిస్తూ మొదలయ్యే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లోనూ హీరో ఎలివేషన్ మీదే దృష్టిపెట్టాడు అనిల్. ఎలివేషన్ సీన్లు.. డైలాగులు బాగా పేలినా.. కథ పరంగా మాత్రం 'భగవంత్ కేసరి' కొత్తగా.. ఆసక్తికరంగా అనిపించదు. హీరో-విలన్ మధ్య శతృత్వాన్ని చాలా సాధారణంగా చూపించాడు. వర్తమానంలోకి వచ్చాక కూడా ఇద్దరి మధ్య అనుకున్న స్థాయిలో ఎత్తులు పై ఎత్తులు ఉండవు. హీరో ఏకపక్షంగా దూసుకెళ్లిపోతుంటాడు. విలన్నే ఆటాడుకుంటాడు. విలన్ నుంచి అసలు సవాలన్నదే ఉండదు. కానీ తర్వాత కూడా హీరో ఎలివేషన్లు.. పంచ్ డైలాగులు.. యాక్షన్ ఘట్టాలు బాగానే పేలాయి. మధ్య మధ్యలో కొన్ని సెంటిమెంట్ టచ్ ఉన్న సీన్లు ఓకే అనిపిస్తాయి. ముగింపు సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. ఓవరాల్ గా చూస్తే.. బాలయ్య టెంప్లేట్ మాస్ సినిమాలతో పోలిస్తే 'భగవంత్ కేసరి' కొంచెం భిన్నమే. ఆయన ఇందులో కొత్తగా కనిపించాడు. అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులనూ అలరించాడు. కానీ ఇది సగటు కమర్షియల్ సినిమానే తప్ప కథాకథనాల విషయంలో కొత్తగా అయితే అనిపించదు.
నటీనటులు:
బాలయ్య లుక్.. నటన పరంగా వైవిధ్యం చూపించాడు 'భగవంత్ కేసరి'లో. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఆయనకు బాగా సూటయింది. పెర్ఫామెన్స్ పరంగా మేకోవర్ అని చెప్పలేం కానీ.. ఎప్పుడూ చూసే బాలయ్య ఇందులో కనిపించలేదు. తన మార్కు మాస్ డైలాగులు.. పెర్ఫామెన్స్ ఇస్తూనే కొత్తదనం చూపించడానికి ప్రయత్నించాడు. ప్రి ఇంటర్వెల్.. ఇంటర్వెల్.. ద్వితీయార్ధంలోని కొన్ని ఎపిసోడ్లలో బాలయ్య మాస్ అవతారం చూడొచ్చు. బిడ్డ కోసం తపించే పెంపుడు తండ్రి పాత్రలో బాలయ్య నటన సిన్సియర్ గా అనిపిస్తుంది. శ్రీలీలలో తొలిసారిగా నటన చూస్తాం ఈ సినిమాలో. విజ్జి పాత్రలో అమాయకత్వాన్ని.. సున్నితత్వాన్ని ఆమె బాగా చూపించగలిగింది. నన్ను ఇడిసేయ్ చిచ్చా అంటూ భగవంత్ ను వేడుకునే సీన్లో శ్రీలీల బాగా చేసింది. ఓవరాల్ గా ఆమెకు కెరీర్లో ఇదొక భిన్నమైన పాత్రగా నిలవొచ్చు. కాజల్ అగర్వాల్ కాత్యాయని పాత్రలో జస్ట్ ఓకే అనిపించింది. తన లుక్స్.. నటన కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ బాగా చేశాడు. చాలా స్టైలిష్ గా కనిపించిన అర్జున్.. పాత్రకు తగ్గట్లు సటిల్ గా నటించాడు. రవిశంకర్ బాగా చేశాడు. మిగతా నటీనటులంతా మామూలే.
సాంకేతిక వర్గం:
తమన్ ఒక మాస్ మూవీకి సరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఐతే 'అఖండ' తరహాలో బలమైన ఇంపాక్ట్ మాత్రం వేయలేకపోయాడు. సినిమాలో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. కేసరి థీమ్ సాంగ్ మంచి ఊపు తెస్తుంది. ఉయ్యాలో ఉయ్యాలో పాట ఓకే. నేపథ్య సంగీతంలో కొత్తదనం లేదు కానీ.. ఎలివేషన్ సీన్లు.. యాక్షన్ ఘట్టాలకు సరిపోయింది. కొన్ని సౌండ్స్ ఎక్కడో విన్న ఫీలింగ్ కలుగుతుంది. రామ్ ప్రసాద్ కెమెరా పనితనం సగటు మాస్ సినిమాల శైలిలోనే సాగింది. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. మంచి క్వాలిటీ కనిపిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి.. సినిమాను మూసగా తీయలేదు. అలా అని మరీ కొత్తదనమూ చూపించలేదు. మధ్య రకంగా లాగించేశాడు. బాలయ్యను కొంచెం భిన్నంగా ప్రెజెంట్ చేయడంలో మాత్రం అతను విజయవంతం అయ్యాడు. ఎలివేషన్.. మాస్ సీన్లలో మాస్ డైరెక్టర్లకు తాను తీసిపోనని అతను చాటాడు. తన డైలాగుల్లో పంచ్ బాగుంది. ట్రెండీగా అనిపిస్తూనే.. మాస్ కు బాగా కనెక్ట్ అవుతాయి. ఓవరాల్ గా రచయితగా.. దర్శకుడిగా అనిల్ ఓకే అనిపించాడు.
చివరగా: భగవంత్ కేసరి.. మాస్ కథలో కొత్త బాలయ్య
రేటింగ్ - 2.75/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater