మహావీరుడు

Date of Release: 2023-07-14

Madonne Ashwin
Directer

Yogi Babu
Star Cast

Sivakarthikeyan
Star Cast

Aditi Shankar
Star Cast

Sunil
Star Cast

Arun Viswa
Producer

Bharath Sankar
Music
మూవీ రివ్యూ: 'మహావీరుడు'
నటీనటులు: శివ కార్తికేయన్-అదితి శంకర్-మిస్కిన్-యోగిబాబు-సరిత-సునీల్ తదితరులు
సంగీతం: భరత్ శంకర్
ఛాయాగ్రహణం: విదు అయ్యన్న
నిర్మాత: అరుణ్ విశ్వ
రచన-దర్శకత్వం: మడోన్ అశ్విన్
అనువాద చిత్రం 'వరుణ్ డాక్టర్'తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని.. ఆపై 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ కేవీతో చేసిన 'ప్రిన్స్'తో నేరుగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్.. ఇప్పుడు 'మహావీరుడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం.. సినిమాగా ఏమేర మెప్పించిందో తెలుసుకుందాం పదండి.
కథ:
సత్య (శివ కార్తికేయన్) కామిక్ కథలు రాసే కార్టూనిస్ట్. పేద కుటుంబానికి చెందిన అతను తల్లి.. చెల్లితో కలిసి ఒక బస్తీలో ఉంటాడు. ఆ బస్తీలో ఉన్న వాళ్లందరినీ ఖాళీ చేయించి.. ప్రభుత్వం కట్టించిన 'ప్రజాభవనం' అనే అపార్టుమెంట్లోకి మారుస్తారు. కానీ నాసిరకంగా కట్టిన ఆ భవనంలో సత్య కుటుంబంతో పాటు అందరికీ అనేక సమస్యలు ఎదురవుతాయి. కానీ పిరికివాడైన సత్యకు ఈ అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ఉండదు. ఐతే వరుసగా తనకు ఎదురు దెబ్బలు తగలడం, తన కుటుంబానికి అవమానాలు ఎదురవడంతో తన అపార్టుమెంట్ మీది నుంచే దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంటాడు సత్య. కానీ ఆ ప్రయత్నంలో పట్టు తప్పి తీవ్ర గాయాల పాలవుతాడు. ఆసుపత్రిలో మృత్యు అంచుల దాకా వెళ్లి అనూహ్యంగా బతికిన అతను.. ఆ తర్వాతి నుంచి చిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. గాల్లోంచి వినిపించే ఒక వాయిస్ ను అనుసరించి అతను నాసిరకంగా ఆపార్టుమెంట్ కట్టించి డబ్బులు తినేసిన మంత్రి (మిస్కిన్)నే ఎదిరిస్తాడు. మరి పిరికివాడైన సత్యకు అంత ధైర్యం ఎలా వచ్చింది.. చివరికి మంత్రితో అతడి పోరు ఎక్కడిదాకా వెళ్లింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
కథలో ఫాంటసీ అంశాలను జోడిస్తే.. లాజిక్కుల గురించి ప్రేక్షకులు ఆలోచించరు. కొంచెం కన్విన్సింగ్ గా అనిపిస్తే చాలు.. ఈ తరహా కథాంశాలతో ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు. వినోదం పండించవచ్చు. 'మండేలా' అనే వైవిధ్యమైన సినిమాతో అరంగేట్రంలోనే దర్శకుడిగా బలమైన ముద్ర వేసిన మడోన్ అశ్విన్.. 'మహావీరుడు'లో అదే మార్గం ఎంచకున్నాడు. ప్రధాన పాత్రను దయ్యం ఆవహిస్తే.. ఆ పాత్ర విచిత్ర ప్రవర్తనతో నవ్వులు పంచే 'హార్రర్ కామెడీ' జానర్ జనాలకు మొహం మొత్తేయగా.. మడోన్ అశ్విన్ అలాంటి కథనే కాస్త డిఫరెంట్ స్టయిల్లో ప్రెజెంట్ చేసి 'మహావీరుడు'ను విభిన్నమైన సినిమాగా మార్చాడు. తనకు మాత్రమే వినిపించే ఇన్నర్ వాయిస్ ఆధారంగా హీరో చేసే విన్యాసాలతో 'మహావీరుడు'ను వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు. ఇందులో మూలకథేమీ కొత్తగా అనిపించదు. దీనికి తోడు ఆరంభం-ముగింపు ఎపిసోడ్లు కూడా సాధారణంగా అనిపిస్తాయి. కానీ మధ్యలో ఈ 'వాయిస్' చుట్టూ తిరిగే సన్నివేశాలే హైలైట్. 'మహావీరుడు' టికెట్ డబ్బులకు సరిపడా నవ్వుల్ని ఆ సన్నివేశాలు అందిస్తాయి.
హీరోకు వినిపించే ఇన్నర్ వాయిస్ కు తెలుగులో గాత్రదానం చేసింది మాస్ రాజా రవితేజ. ఆయనతోనే వాయిస్ ఓవర్ ఇప్పించాలనే నిర్ణయం ఎవరిదో కానీ.. సినిమాకు రవితేజ వాయిస్ పెద్ద ఎసెట్ అయింది. ఒక పిరికివాడి ఒంట్లోకి దయ్యం దూరి అతడితో అసాధారణమైన పనులు చేయించడం చాలా సినిమాల్లో చూశాం కానీ.. వెనుక నుంచి వాయిస్ వినిపిస్తుంటే దాన్ని అనుసరించి హీరో తన ప్రమేయం లేకుండా చేసే పనులు ఇందులో బోలెడంత వినోదాన్ని పండిస్తాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సుల్లో.. ''వీరుడు తనపైకి సంధించిన కర్రను ఎడమ చేత్తో పట్టుకుని.. దాంతోనే మరొకరి ముఖం పగులగొట్టి''.. ''పక్కకు వంగి కుడివైపు తిరిగి.. ఆయుధము అందుకుని.. ముఖమును చీల్చినాడు'' అంటూ ఓవైపు రన్నింగ్ కామెంట్రీలా వాయిస్ వినిపిస్తుంటే.. హీరో విలన్ల తాట తీసే సీన్లు భలేగా అనిపిస్తాయి. ఈ వాయిస్ అసలెందుకు వినిపిస్తుంది.. ఆ వాయిస్ ఎవరిది.. అనే విషయాలేమీ చెప్పకుండా కేవలం ఆ ఫాంటసీ మీదే వినోదం పండించడం మీదే దృష్టిపెట్టాడు దర్శకుడు. లాజిక్స్ సంగతి పక్కన పెడితే.. ఈ కాన్సెప్ట్.. దీని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలైతే చాలా గమ్మత్తుగా అనిపిస్తాయి.
తొలి అరగంటలో చాలా మామూలుగా సాగిపోయే 'మహావీరుడు' ఈ ఫాంటసీ అంశం మొదలైన దగ్గర్నుంచి ఊపందుకుంటుంది. హీరో పాత్రకు తోడు.. యోగిబాబు పాత్ర నుంచి కావాల్సినంత కామెడీ పండించిన మడోన్ అశ్విన్.. ప్రథమార్ధంలో మంచి హై ఇచ్చాడు. ద్వితీయార్ధం కూడా ఒక దశ వరకు బాగా నడిచిపోతుంది. కానీ ఈ కథకు ముగింపు ఇంకెంత గమ్మత్తుగా ఉంటుందో అని ఆశిస్తే.. అక్కడ మాత్రం నిరాశ తప్పదు. ఈ వాయిస్ వెనుక ఏదైనా కథను చూపిస్తే ఇదొక రొటీన్ 'దయ్యం' సినిమా అయిపోతుందనో ఏమో.. చివర్లో కూడా దాని జోలికి వెళ్లలేదు దర్శకుడు. ద్వితీయార్ధంలో కథనం కూడా కొంచెం సాగతీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కోసం చాలా సేపు ఎదురు చూడాల్సి వస్తుంది. ముగింపు సన్నివేశాలను చాలా మామూలుగా లాగించేయడంతో ఒకింత నిరాశ తప్పదు. కథ పరంగా అయితే 'మహావీరుడు' సాధారణంగా అనిపిస్తుంది. సినిమా నిడివి కూడా ఎక్కువైపోవడం సమస్య అయింది. కానీ కామెడీ పాళ్లు తగ్గి.. మనస్ఫూర్తిగా నవ్వుకునే సినిమాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో 'మహావీరుడు' కనీసం ఒక గంట పాటు ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వు తీసుకొస్తుందనడంలో సందేహం లేదు.
నటీనటులు:
శివ కార్తికేయన్ లో మంచి ఈజ్ ఉంటుంది. హీరోలా కాకుండా మనలో ఒకడిలా కనిపించే అతను పక్కింటి కుర్రాడి పాత్రలకు భలే సూటవుతాడు. ఏ పాత్ర చేసినా త్వరగా అలవాటు పడిపోతాం. 'మహావీరుడు'లో చలాకీ నటనతో అతను మెప్పించాడు. సినిమాలో వినోదం పండించడంలో బాధ్యత తనే తీసుకుని ప్రేక్షకులను నవ్వించాడు. తన పాత్ర.. నటన సరదాగా అనిపిస్తాయి. అతడి పక్కన కథానాయికగా చేసిన శంకర్ కూతురు అదితి ఓకే. రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్లలా అనిపించదు కానీ.. చూడ్డానికి బాగుంది. పాత్రకు ప్రాధాన్యం తక్కువే అయినా ఉన్నంతలో బాగా నటించింది. విలన్ పాత్రలో దర్శకుడు మిస్కిన్ ఆకట్టుకున్నాడు. మన సునీల్ కూడా ఓ కీలక పాత్రలో మెరిశాడు. యోగిబాబు తనదైన శైలిలో నవ్వించాడు. సీనియర్ నటి సరిత హీరో తల్లి పాత్రలో సహజంగా నటించింది.
సాంకేతిక వర్గం:
భరత్ శంకర్ సంగీతం సోసోగా అనిపిస్తుంది. నిజానికి బ్యాగ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను మరింత ఎంటర్టైనింగ్ గా మార్చే స్కోప్ ఉంది. కానీ భరత్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. 'వరుణ్ డాక్టర్'లో చాలా సీన్లను ఎలివేట్ చేసిన అనిరుధ్ అయితే.. అదరగొట్టేవాడేమో అనిపిస్తుంది. పాటలు కూడా అంతంతమాత్రంగానే అనిపిస్తాయి. విదు ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు మడోన్ అశ్విన్.. కామెడీ పండించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఎక్కువ హడావుడి చేయకుండానే.. అతను జెన్యూన్ లాఫ్స్ అందించాడు. కథను ఇంకొంచెం ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుని.. కథనంలో బిగి ఉండుంటే 'మహావీరుడు' వేరే లెవెల్లో ఉండేది.
చివరగా: మహావీరుడు.. ఫాంటసీ ఫన్
రేటింగ్-2.75/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater