బేబీ

Date of Release: 2023-07-14

Sai Rajesh
Directer

Anand Deverakonda
Star Cast

Vaishnavi Chaitanya
Star Cast

Viraj Ashwin
Star Cast

Viva Harsha
Star Cast

Sreenivas Kumar
Producer

Vijay Bulganin
Music
మూవీ రివ్యూ : 'బేబి'
నటీనటులు: వైష్ణవి చైతన్య-ఆనంద్ దేవరకొండ-విరాజ్ అశ్విన్-నాగబాబు-హర్ష చెముడు తదితరులు
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఛాయాగ్రహణం: ఎం.ఎన్.బాల్ రెడ్డి
నిర్మాత: ఎస్కేఎన్
రచన-దర్శకత్వం: సాయిరాజేష్
ఈ మధ్య కాలంలో పెద్దగా పేరున్న ఆర్టిస్టులు.. టెక్నీషియన్లు లేకపోయినా.. ఇంట్రెస్టింగ్ ప్రోమోలు.. మంచి పాటలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న సినిమా 'బేబి'. వైష్ణవి చైతన్య.. ఆనంద్ దేవరకొండ.. విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో 'హృదయ కాలేయం' దర్శకుడు.. 'కలర్ ఫొటో' కథకుడు సాయిరాజేష్ రూపొందించిన చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
వైష్ణవి (వైష్ణవి చైతన్య) స్కూల్ రోజుల్లో తన క్లాస్ మేట్ అయిన ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను చూసి ప్రేమలో పడుతుంది. ముందు ఆ అమ్మాయిని పట్టించుకోని ఆనంద్.. తర్వాత ఆమె తన మీద చూపించే ప్రేమకు లొంగిపోతాడు. ఆనంద్ పదో తరగతి ఫెయిలై ఆటో డ్రైవర్ గా మారితే.. వైష్ణవి మాత్రం ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చేరుతుంది. ఇంజినీరింగ్ మొదలు పెట్టే ముందు ఆనంద్ కు ఎక్కడ దూరం అయిపోతానేమో అని బాధ పడుతూ కాలేజీలో అడుగు పెట్టిన ఆమె.. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నెమ్మదిగా మారిపోతుంది. తన వేషం సహా వ్యవహారం మార్చేయడంతో పాటు తనను ఇష్టపడే విరాజ్ (విరాజ్ అశ్విన్) పట్ల ఆకర్షితురాలు అవుతుంది. వైష్ణవి ప్రవర్తన నచ్చక ఆమె పట్ల ఆనంద్ దురుసుగా ప్రవర్తిస్తాడు. దీంతో వైష్ణవి అతడికి మరింత దూరమై విరాజ్ కు ఇంకా దగ్గరవుతుంది. మరి ఈ ముక్కోణపు ప్రేమ కథ ఎక్కడిదాకా వెళ్లింది.. చివరికి ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
కాలం మారుతుంటుంది.. తరాలు మారుతుంటాయి.. ట్రెండు మారుతుంటుంది. కానీ వెండి తెర మీద ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జానర్ ఏది అంటే లవ్ స్టోరీనే. కానీ ప్రేమకథలు ఎఫ్పుడూ ఒకేలా ఉండవు. ప్రతి పదేళ్లకూ ప్రేమకథల రూపం మారిపోతుంటుంది. ఆ మార్పు యువత ఆలోచన ధోరణిని బట్టే ఉంటుంది. సమాజంలో ఆయా సమయాల్లో అబ్బాయిలు.. అమ్మాయిలు ఎలా ఉన్నారు.. ప్రేమ-పెళ్లి-శృంగారం విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు.. ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది సరిగా అర్థం చేసుకుని తీసే ప్రేమకథలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. పాత్రలు.. సన్నివేశాలు.. సంభాషణలు.. ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా ఉండి.. వాళ్లలో ఒక కదిలిక తీసుకురాగలిగితే వెండితెరపై ప్రేమకథ విజయవంతం అయినట్లే. 'బేబి' ఈ కోవకు చెందిన సినిమానే. ఇప్పటి యువత అంతా ఇంతే అంటూ అందరినీ ఒక గాటన కట్టేసి.. ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ అంటే ఒక బూటకం అంటూ జనరలైజ్ చేసి చెప్పలేం కానీ.. ప్రస్తుతం పరిణితి లేని వయసులో మొదలయ్యే రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తుంది 'బేబి'. ఇప్పటి యువత భాషలో చెప్పాలంటే.. ఇదొక 'నిబ్బా-నిబ్బి' స్టోరీ. కానీ ఇది యూత్ తో పాటు 'యూత్' ఆలోచనలు ఉన్న వాళ్లందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
'ఆర్ఎక్స్ 100' అని ఒక చిన్న సినిమా కొన్నేళ్ల ముందు బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపింది. ఓవరాల్ గా చూస్తే అదొక మామూలు సినిమా అయినా.. దాన్ని కుర్రాళ్లు ఎగబడి చూడ్డానికి కారణం.. అందులోని హీరోయిన్ పాత్ర. అబ్బాయిల జీవితాలతో ఆడుకునే అమ్మాయిలకు అద్దం పట్టేలా ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానానికి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అందులో రావు రమేష్.. హీరోయిన్ని తిట్టే సన్నివేశానికి ఒక పెద్ద మాస్ హీరో సినిమాలో ఎలివేషన్ సీన్ చూసినపుడు వచ్చిన స్పందన వచ్చింది థియేటర్లలో. అబ్బాయిలను ప్రేమ మైకంలో దించి.. మధ్యలో వదిలేసి వెళ్లిపోయే అమ్మాయిల విషయంలో కుర్రాళ్లలో ఉండే కసే ఆ స్పందనకు రుజువు. ఇప్పుడు 'బేబి'లో సాయి రాజేష్ కూడా ఇంచుమించుగా ఇలాంటి లేడీ క్యారెక్టర్ కేంద్రంగానే ఈ కథను నడిపించి యూత్ కు గాలం వేశాడు. ఒక అబ్బాయితో ప్రేమను మొదలుపెట్టి.. మధ్యలో మరో కుర్రాడికి ఆకర్షితురాలై.. మళ్లీ పాత కుర్రాడి వైపే చూసే అమ్మాయి కథ ఇది. ఒకేసారి ఇద్దరు అబ్బాయిలతో వ్యవహారం నడిపేలా అమ్మాయిని లీడ్ క్యారెక్టర్ గా మార్చి తెరపై ప్రెజెంట్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. కానీ సొసైటీలో అలాంటి అమ్మాయిలూ ఉన్నారనే హార్ష్ రియాలిటీని చిన్న చిన్న రైడర్స్ పెట్టి కొంచెం బోల్డుగానే చూపించేశాడు సాయిరాజేష్. 'బేబి'కి ఇది అతి పెద్ద సెల్లింగ్ పాయింట్.
దాదాపు మూడు గంటల నిడివి ఉన్న 'బేబి'.. మూడు ప్రధాన పాత్రల చుట్టూనే తిరుగుతుంది. సినిమాలో దాదాపుగా ప్రతి సన్నివేశంలోనూ ఈ మూడు పాత్రల్లో ఒకటి కచ్చితంగా కనిపిస్తుంది. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరి మధ్యో సంభాషణ ఆధారంగానే మెజారిటీ సన్నివేశాలు నడుస్తాయి. ఐతే సీన్లేమీ మరీ కొత్తగా అనిపించకపోయినా.. ఎన్నో సినిమాల్లో చూసినట్లే అనిపించినా.. పాత్రలు-వాటి మధ్య సన్నివేశాలు ట్రెండీగా ఉండటం.. కాన్వర్జేషన్లు వాస్తవికంగా.. ఆసక్తికరంగా సాగడం వల్ల చాలా వరకు కథనం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా డైలాగులు చాలా రియలిస్టిగ్గా.. ఏమాత్రం నాటకీయత లేకుండా.. యూత్ కు బాగా కనెక్టయ్యేలా ఉండటం పెద్ద ప్లస్. దీనికి తోడు ముఖ్య పాత్రలు పోషించిన ముగ్గురూ ఎవరి స్థాయిలో వాళ్లు చక్కగా నటించడం కూడా ప్లస్ అయింది. స్కూల్ రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించి.. కాలేజీ మెట్లెక్కగానే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా హీరోయిన్ పాత్ర ఎలా మారిపోయేందనే క్రమాన్ని ప్రథమార్ధంలో చూపించాడు దర్శకుడు. హీరోయిన్ పాత్రలోని ద్వంద్వ వైఖరిని చాటేలా బోల్డుగా తీసిన ఇంటర్వెల్ సీన్ ప్రథమార్ధానికి హైలైట్.
ఇక ద్వితీయార్ధం మొదట్లో దశా దిశా లేనట్లు సాగినా.. హీరోయిన్ పాత్రలోని గందరగోళం.. అసహజత్వ ప్రవర్తన ఇబ్బంది పెట్టినా.. తర్వాత కథనం ఊపందుకుంటుంది. ఆ అమ్మాయి తన తొలి ప్రేమికుడిని ఏ దశలోనూ నిజాయితీగా ప్రేమిస్తున్నట్లుగా అనిపించదు. అదే సమయంలో రెండో అబ్బాయి వైపు మొగ్గడానికి సహేతుకమైన కారణాలే కనిపిస్తుంటాయి. మరి ఆమెలో కన్ఫ్యూజన్ ఎందుకో అర్థం కాదు. ఇక్కడ ఆ పాత్రను అంత కన్విన్సింగ్ గా చూపించలేదు. కానీ చివరి 40 నిమిషాల్లో 'బేబి' ఊహించని టర్న్ తీసుకుంటుంది. అమ్మాయి గురించి మొదటి అబ్బాయికి నిజం తెలిసిన దగ్గర్నుంచి 'బేబి' ఇంటెన్స్ గా సాగుతుంది. ఇద్దరబ్బాయిలు తొలిసారి కలిసిన సన్నివేశం దగ్గర దర్శకుడు తన పనితనం చూపించాడు. కాసేపు ప్రేక్షకులు తెరకు అతుక్కుపోయేలా చేస్తుంది ఆ ఎపిసోడ్.
అక్కడ్నుంచి చివరి వరకు ఒకే టెంపోలో సాగింది 'బేబి'. పతాక సన్నివేశం అంచనాలకు తగ్గట్లు లేకపోయినా ఓవరాల్ గా సినిమా మీద మంచి ఇంప్రెషనే ఇస్తుంది. కుటుంబ ప్రేక్షకులకు కష్టం కానీ.. 'బేబి'కి యూత్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. కుర్రాళ్లు ఈ సినిమా కోసం ఎగబడితే ఆశ్చర్యం లేదు. ఇలాంటి సినిమాలను ఎంజాయ్ చేయాలంటే కొంచెం 'లెవెల్' తగ్గించుకోవాలి. లేదంటే పైన అన్నట్లు ఇదొక 'నిబ్బ-నిబ్బి' లవ్ స్టోరీలా అనిపిస్తుంది.
నటీనటులు:
ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో సోసోగా అనిపించాడు ఆనంద్ దేవరకొండ. టాలెంట్ లేకున్నా.. తన అన్న పేరు చెప్పుకుని అతను అవకాశాలు అందుకుంటున్నాడనే అభిప్రాయం ఉన్న వాళ్లందరూ 'బేబి' చూశాక కచ్చితంగా ఆ ఆలోచన మార్చుకుంటారు. 'బేబి'లో అవకాశం అతడికి ఎలా వచ్చిందో ఏమో కానీ.. ఈ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడి మనసునూ అతను గెలుస్తాడు. ఆనంద్ పాత్రలో అంతగా జీవించేశాడతను. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి.. అమ్మాయే జీవితం అనుకునే కుర్రాడి పాత్రకు ఇంకెవరినీ ఊహించుకోలేనంతగా అతను పెర్ఫామ్ చేశాడు అంటే అతిశయోక్తి కాదు. తన గుండె బద్దలయ్యే విషయం తెలిసినప్పుడు అతను రియాక్టయ్యే సీన్లో ఆనంద్ లోని 'పెర్ఫామర్' కనిపిస్తాడు. అక్కడి నుంచి చివరి వరకు ఒకే ఇంటెన్సిటీ చూపించాడు ఆ క్యారెక్టర్లో. ఇక యూట్యూబర్ టర్న్డ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య తనకు దక్కిన అరుదైన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది. కథానాయికగా తొలి చిత్రంలో 'ది బెస్ట్ పెర్ఫామెన్స్' ఇచ్చిన అమ్మాయిల్లో ఒకరిగా తనకు గుర్తింపు వస్తుంది. కథ మొత్తం తన చుట్టూనే తిరిగే పాత్రలో వైష్ణవి రకరకాల ఎమోషన్లను చక్కగా పండించింది. స్కూల్ వయసు నుంచి పెళ్లి వరకు వివిధ దశల్లో ఆమె లుక్స్ అనే కాక.. హావభావాల పరంగా చూపించి వైవిధ్యం ప్రశంసనీయం. తన బోల్డ్ యాక్ట్స్ కూడా ఆకట్టుకుంటాయి. విరాజ్ అశ్విన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అతను ప్రతి సీన్లోనూ పెర్ఫామెన్స్ పరంగా డీసెంట్ అనిపిస్తాడు. నాగబాబు కనిపించే తక్కువ సన్నివేశాల్లో తన ముద్ర వేశాడు. హర్ష చెముడు.. హీరో ఫ్రెండుగా చేసిన మరో కుర్రాడు.. హీరో తల్లి పాత్రలో చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాగా చేశారు.
సాంకేతిక వర్గం:
'బేబి'కి టెక్నికల్ గా మంచి సపోర్ట్ దొరికింది. ప్రేమకథలకు సంగీతం ఎంత కీలకమో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. విజయ్ బుల్గానిన్ ఎంతో మనసు పెట్టి చేసిన పాటలు.. నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓ రెండు ప్రేమ మేఘాలిలా వినడానికే కాదు.. చూడ్డానికి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. మిగతా పాటలు కూడా కథను ముందుకు నడిపించడంలో ముఖ్య పాత్ర పోషించాయి. బాల్ రెడ్డి కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. చిన్న సినిమా అనే ఫీలింగ్ రాకుండా రిచ్ గా అనిపిస్తాయి విజువల్స్. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి మించి ఉన్నాయి. తెరపై క్వాలిటీ కనిపిస్తుంది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ సాయిరాజేష్.. ఈ తరం యువత ఆలోచనలను బాగా చదివాడనే విషయం అర్థమవుతుంది. బహుశా తాను విన్న.. కన్న విషయాల్లోంచే అతను ఈ కథ.. పాత్రలు.. సన్నివేశాలను అల్లాడని అనిపిస్తుంది. సాయిరాజేష్ మాటలు కూడా సహజంగా.. ఆసక్తికరంగా సాగాయి. అతను కాన్ఫ్టిక్ట్ ఇంకొచెం కన్విన్సింగ్ గా.. బలంగా ఉండేలా చూసుకుని ఉంటే.. సినిమాను ఇంకొంచెం క్రిస్ప్ గా తీసి ఉంటే 'బేబి' ఇంకా మంచి స్థాయిలో ఉండేది.
చివరగా: బేబి.. కుర్ర గుండెలకు గుచ్చుకుంటుంది
రేటింగ్: 2.75/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater