నాయకుడు

Date of Release: 2023-07-14

Mari Selvaraj
Directer

Udhayanidhi Stalin
Star Cast

Vadivelu
Star Cast

Fahadh Faasil
Star Cast

Keerthy Suresh
Star Cast

Udhayanidhi Stalin
Producer

A. R. Rahman
Music
మూవీ రివ్యూ : 'నాయకుడు'
నటీనటులు: వడివేలు-ఉదయనిధి స్టాలిన్-ఫాహద్ ఫాజిల్-కీర్తి సురేష్-లాల్-రవీనా రవి తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం: తేని ఈశ్వర్
నిర్మాణం: రెడ్ జెయింట్ ఫిలిమ్స్-ఏషియన్ మూవీస్-సురేష్ ప్రొడక్షన్స్
రచన-దర్శకత్వం: మారి సెల్వరాజ్
గత ఏడాది కాలంలో కాంతార.. విడుదల.. 2018.. లాంటి అనువాద చిత్రాలు తెలుగులో మంచి ఫలితాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే తమిళంలో మంచి విజయం సాధించిన 'మామన్నన్'ను తెలుగులో 'నాయకుడు' పేరుతో అందించాయి సురేష్ ప్రొడక్షణ్స్.. ఏషియన్ మూవీస్ సంస్థలు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
తిమ్మరాజు (వడివేలు) ఒక వెనుకబడ్డ కులానికి చెందిన ఎమ్మెల్యే. కుల వివక్ష కారణంగా చిన్నతనంలో తన మిత్రులను కోల్పోయి.. మృత్యు అంచుల దాకా వెళ్లి బయటపడ్డ అతడి కొడుకు రఘువీర (ఉదయనిధి స్టాలిన్)కు.. అంత అన్యాయం జరిగినా తండ్రి ఏమీ చేయలేకపోయాడనే కోపం ఉంటుంది. అందువల్ల 15 ఏళ్లుగా ఇద్దరికీ మాటలు ఉండవు. కాల క్రమంలో ఎమ్మెల్యే అయినా సరే.. తన పార్టీలో పెద్ద స్థాయిలో ఉన్న రత్నవేలు (ఫాహద్ ఫాజిల్) కుటుంబం నుంచి వివక్ష ఎదుర్కొంటూనే ఉంటాడు. రత్నవేలు అన్నతో అనుకోకుండా తన కొడుక్కి తలెత్తిన గొడవను పరిష్కరించుకునేందుకు ఆ కుటుంబం దగ్గరికి వీరతో కలిసి వెళ్లిన తిమ్మరాజుకు అక్కడ అవమానం ఎదురవుతుంది. దీంతో రత్నవేలు మీద రఘువీర తిరగబడతాడు. గొడవ చాలా పెద్దదై.. ఈ తండ్రీ కొడుకుల అంతం చూడాలని పంతం పడతాడు రత్నవేలు. ఆ తర్వాత పరిణామాలేంటి.. చివరికి రత్నవేలుపై ఈ తండ్రీ కొడుకులు పైచేయి సాధించారా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
దక్షిణ భారత దేశంలో కుల వివక్ష వేళ్లూనుకుపోయిన రాష్ట్రాల్లో తమిళనాడు ముందు వరుసలో ఉంటుంది. దళితుల మీద వివక్ష.. అఘాయిత్యాలకు సంబంధించి అక్కడ శతాబ్దాల చరిత్ర ఉంది. గత కొన్ని దశాబ్దాల్లో పరిస్థితులు మెరుగుపడ్డా కూడా ఇప్పటికీ కొన్ని దారుణమైన ఉదంతాలు మీడియాలో పతాక శీర్షికలుగా మారుతుంటాయి. ఐతే ఈ వివక్ష.. అసమానతల నేపథ్యంలో తమిళంలో గొప్ప గొప్ప సినిమాలు తీసిన దర్శకులు ఉన్నారు. ఈ తరంలో పా.రంజిత్ సినిమాలన్నీ ఈ కోవలోనే సాగుతుంటాయి. అతనే పరి చయం చేసిన మారి సెల్వరాజ్ సైతం గురువు బాటలోనే సాగుతున్నాడు. పరియేరుం పెరుమాళ్.. కర్ణన్ లాంటి క్లాసిక్స్ తీసిన మారి నుంచి ఇప్పుడు వచ్చిన కొత్త చిత్రమే 'నాయకుడు' పేరుతో తెలుగులోకి వచ్చింది. కుల వివక్ష నేపథ్యంలో కథ అంటే ఇదేదో డాక్యుమెంటరీ టైపులో సాగే.. లేదా కేవలం వేదనతో కూడిన సినిమా ఏమీ కాదు. 'నాయకుడు'లో ఆలోచింపజేసే కథతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే.. కమర్షియల్ టచ్ ఉన్న కథనమూ ఉంది. ఇందులో హీరోయిజం చూడొచ్చు. గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్లు ఉన్నాయి. గొప్ప సందేశమూ ఉంది. కాకపోతే కథలో తమిళ నేటివిటీ పాళ్లు ఎక్కువ ఉండటం.. ఏ దశలోనూ కనెక్ట్ కాలేని హీరో ఇందులోని ప్రతికూలతలు. కానీ ఒకసారి చూసేందుకు ఢోకా లేని సినిమా ఇది.
వడివేలు అనగానే మనకు ఆయన పంచిన నవ్వులే గుర్తుకు వస్తాయి. 'చంద్రముఖి' సహా ఎన్నో తమిళ అనువాద చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇప్పుడు 'నాయకుడు'లో వడివేలును చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఇంకా షాకవుతాం. 'నాయకుడు' కథ కూడా ఆయనదే. ఆయన పాత్ర.. నటన 'నాయకుడు'లో మేజర్ హైలైట్. తనకున్న కామెడీ ఇమేజ్ నుంచి బయటికి వచ్చి ఆయన ఇచ్చిన పెర్ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. తొలి సన్నివేశం నుంచి ఆ పాత్ర మీద ఏర్పడే ఆపేక్ష.. ప్రేక్షకులను ముందుకు నడిపిస్తుంది. అటు వైపు ఫాహద్ ఫాజిల్ రూపంలో బలమైన విలన్ ఉండటం 'నాయకుడు'ఖు మరో పెద్ద ప్లస్. కథాకథనాల పరంగా కొంచెం వీక్ అనిపించిన చోటల్లా.. వీళ్లిద్దరూ తమ నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి పెర్ఫామర్ల మధ్య ఉదయనిధి స్టాలిన్ లాంటి ఎక్స్ ప్రెషన్ లెస్ హీరోను చూడాల్సి రావడమే విచారకరం. ఇంతకుముందు 'ఓకే ఓకే' అనే కామెడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు ఉదయ్. అది కామెడీ సినిమా కాబట్టి.. తన పాత్ర నామమాత్రం కాబట్టి సరిపోయింది. కానీ 'నాయకుడు' లాంటి ఇంటెన్స్ మూవీలో అతను తేలిపోయాడు. చిన్నతనంలో శరీరానికి.. మనసుకు ఏర్పడ్డ బలమైన గాయాల కారణంగా రెబల్ గా మారిన ఇంటెన్స్ క్యారెక్టర్లో ఉదయ్ ఓ మోస్తరుగా నటించినా అది ఎలివేట్ అయ్యేది. కానీ ఎప్పుడూ ముభావంగా కనిపించడం తప్ప.. మనసులోని బాధను.. సంఘర్షణను చూపించేలా అతను నటించలేకపోయాడు. ఇలాంటి పాత్రలో ఏ ధనుష్ లాంటి వాడో అయితే ఎలా ఉండేదో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఓవైపు వడివేలు.. ఫాహద్ తమ నటనతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నంలో ఉంటే.. ఉదయ్ మాత్రం 'నాయకుడు'ను కిందికి లాగేస్తున్నట్లు అనిపిస్తుంది.
'నాయకుడు'లో కుల వివక్ష.. అగ్ర వర్ణాల దురహంకారం.. అసమానతలు.. లాంటి విషయాలను చాలా ఇంటెన్స్ గా చూపించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. కాకపోతే సినిమాలో చూపించిన పరిస్థితులు ప్రస్తుతం తమిళనాడులో కూడా ఉన్నాయంటే నమ్మలేం. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరు. కాబట్టి ఈ రోజుల్లో ఇలా జరుగుతుందా.. ఇంత తీవ్రత ఉందా అన్న సందేహాలు కలుగుతాయి. దీని వల్ల మన ప్రేక్షకులు ఇందులో చూపించే అంశాలతో అంతగా రిలేట్ కాకపోవచ్చు. ఐతే గుడికి సంబంధించిన బావిలో వెనుకబడ్డ కులానికి చెందిన కుర్రాళ్లు దూకి దాన్ని మలినం చేస్తున్నారని.. వారి మీద రాళ్లు విసిరి ప్రాణాలు తీసే ఎపిసోడ్.. ఆ తర్వాత పరిణామాలు చూసి ఎవ్వరైనా కదిలిపోవాల్సిందే. ఇక వడివేలు ఎమ్మెల్యే అయినా సరే.. అగ్ర వర్ణాల వ్యక్తుల ముందు నిలబడే ఉండటం మీద ఈ సినిమా మూల కథకు ముడిపెట్టి.. దాని మీద డ్రామాను నడిపించిన విధానంలోనూ మారి సెల్వరాజ్ తన ప్రతిభను చాటుకున్నాడు. ఇక ఎమ్మెల్యే కొడుకు అయిన హీరో పందులను పెంచడం లాంటి అంశాలు చాలా కొత్తగా అనిపిస్తాయి. దర్శకుడు ఇలాంటి విషయాల్లో సింబాలిక్ షాట్స్ ద్వారా తన భావజాలాన్ని చెప్పడంలో ఒక స్థాయి కనిపిస్తుంది.
కథలో కీలక మలుపుకి దారి తీసి ప్రి ఇంటర్వెల్ ఎపిసోడ్ 'నాయకుడు'లో హైలైట్ గా నిలుస్తుంది. అందులో ఇంటెన్సిటీ చూసి రెండో అర్ధం మీద చాలా అంచనాలే పెట్టుకుంటాం. కానీ ద్వితీయార్ధంలో 'నాయకుడు' అంచనాలకు తగ్గట్లుగా సాగదు. ఎన్నికల్లో ఇరు వర్గాల మధ్య ఎత్తులు పై ఎత్తులు.. విలన్ నుంచి ఎదురయ్యే అడ్డంకులు.. హీరో.. అతడి తండ్రి వాటిని అధిగమించడం.. ఇలా రొటీన్ టెంప్లేట్లో సాగిపోతుంది 'నాయకుడు'. చాలా వరకు రియలిస్టిగ్గా సాగే సినిమాలో పతాక సన్నివేశాలు కొంచెం నాటకీయంగా అనిపిస్తాయి. హీరో తండ్రి ఒక స్పీచ్ ఇచ్చి గెలిచేయడం.. ఆ తర్వాత అత్యున్నత పదవిని అందుకోవడం ఇదంతా కన్వీనియెంట్ గా సాగిపోతుంది. మారి ఒక దశ వరకు కథను నడిపించిన తీరు చూసి.. క్లైమాక్సులో ఇంకేమైనా హార్డ్ హిట్టింగ్ గా ఏమైనా చేస్తాడనుకుంటే అలా ఏమీ జరగలేదు. అయినా సరే.. ఒక అర్థవంతమైన.. విభిన్నమైన సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటులు:
వడివేలును మనం ఇన్నేళ్లుగా చూసిన కోణం వేరు. ఈ సినిమా తర్వాత వేరే యాంగిల్లో చూస్తాం. ఆయన ఎంత గొప్ప నటుడో ఈ సినిమా రుజువు చేస్తుంది. తన పాత్రను ఆయన అంత అద్భుతంగా పోషించారు. కామెడీ క్యారెక్టర్లలో వాటి అవసరార్థం చాలా హడావుడి చేసే వడివేలు.. ఇందులో మాత్రం గుంభనంగా కనిపిస్తూ గొప్పగా తన పాత్రను పండించారు. ఆయన పాత్ర.. నటన చాన్నాళ్లు గుర్తుండి పోతాయి. ఫాహద్ ఫాజిల్ తనదైన శైలిలో నటించాడు. ఆ పాత్ర తాలూకు ఇంటెన్సిటీని తన కళ్లతోనే చూపించాడతను. తొలి సన్నివేశంలోనే బలమైన ముద్ర వేసే ఫాహద్.. ఆద్యంతం తన నటనతో మెప్పించాడు. ఉదయనిధి స్టాలిన్ మాత్రం వీరి మధ్య నిలవలేకపోయాడు. అసలు దర్శకుడు ఈ పాత్రకు అతణ్ని ఎందుకు తీసుకున్నాడో అర్థం కాదు. కీర్తి సురేష్ బాగానే చేసింది కానీ.. తన పాత్రకు సినిమాలో ప్రాధాన్యం తక్కువే. లాల్ ముఖ్యమంత్రి పాత్రలో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులంతా ఓకే.
సాంకేతిక వర్గం:
ఏఆర్ రెహమాన్ మామూలుగా చేసే సినిమాలతో పోలిస్తే.. 'నాయకుడు' భిన్నమైంది. కొన్నేళ్లుగా స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వట్లేదని విమర్శలు ఎదుర్కొంటున్న రెహమాన్.. 'పొన్నియన్ సెల్వన్' తర్వాత ఇందులో తన ముద్రను చూపించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాను డ్రైవ్ చేస్తుంది. ఎప్పుడూ వినే సౌండ్స్ ఇందులో వినిపించవు. రెహమాన్ పాటలు పర్వాలేదు. తేని శేఖర్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు మారి సెల్వరాజ్.. తన స్టయిల్లోనే మరో ఇంటెన్స్ మూవీ తీశాడు. కానీ ఇందులో కొంచెం కమర్షియల్ టచ్ ఎక్కువ అయిపోయింది.దాని కారణంగా కథాకథనాల్లో కొంచెం బిగి తగ్గింది. ప్రథమార్ధంలో.. అలాగే కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లలో దర్శకుడి ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది.
చివరగా: నాయకుడు.. ఆసక్తికరంగా.. ఆలోచింపజేసేలా..
రేటింగ్- 2.75/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater