ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3

Date of Release: 2025-11-22

Raj Nidimoru
Directer

Manoj Bajpayee
Star Cast

Priyamani
Star Cast

Raj Nidimoru
Producer

Sachin Sanghvi
Music
‘ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3’ రివ్యూ
నటీనటులు: మనోజ్ బాజ్ పేయి- జైదీప్ అహ్లావత్- షరీబ్ హష్మి- ప్రియమణి- నిమ్రత్ కౌర్- శ్రేయా ధన్వంతరి- గుల్ పనాగ్- ఆశ్లేషా ఠాకూర్- సీమా బిశ్వాస్- వేదాంత్ సిన్హా- సందీప్ కిషన్ తదితరులు
సంగీతం: సచిన్ జిగార్
ఛాయాగ్రహణం: జై చరోలా
నిర్మాతలు: రాజ్-డీకే
రచన-దర్శకత్వం: రాజ్-డీకే-సుమన్ కుమార్-తుషార్ సేత్
ఇండియన్ ఒరిజినల్స్ చరిత్రలో ‘ఫ్యామిలీ మ్యాన్’ను మించిన వెబ్ సిరీస్ లేదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు వాళ్లే అయిన రాజ్-డీకే క్రియేట్ చేసిన ఈ సిరీస్ లో శ్రీకాంత్ తివారి పాత్రలో అదరగొట్టిన మనోజ్ బాజ్ పేయి ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ ఏజెంట్ అయిపోయాడు. ఇప్పటికే రెండు సీజన్లతో అలరించిన ఈ సిరీస్.. ఇప్పుడు మూడో సీజన్ తో ప్రేక్షకులను పలకరించింది. రాజ్-డీకే మరోసారి మ్యాజిక్ చేశారా? చూద్దాం పదండి.
ముందుగా కథ విషయానికి వస్తే.. ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొన్న అశాంతిని.. అలజడిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి చైనా ‘గువాన్ యు’ అనే ప్రాజెక్టును ప్రారంభిస్తుంది. దానికి ప్రతిగా ఇండియా ‘ప్రాజెక్ట్ సహకార్’ను మొదలుపెడుతుంది. ఇందులో భాగంగా నేషనల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ సీనియర్ అధికారి కులకర్ణి (దలిప్ తాహిల్).. ఏజెంట్ శ్రీకాంత్ తివారి (మనోజ్ బాజ్ పేయి) నాగాలాండ్ కు వెళ్లి.. అక్కడి రెబల్ నాయకులతో శాంతి ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వీరి మీద జరిగిన దాడిలో కులకర్ణితో పాటు రెబల్ గ్రూప్ నాయకుడు మరణిస్తారు. శ్రీకాంత్ అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడతాడు. ఈ దాడి వెనుక పెద్ద కుట్రే ఉందని శ్రీకాంత్ గ్రహిస్తాడు. కానీ అతను పని చేసే ‘టాస్క్’ టీం ఈ దాడికి సూత్రధారిగా తననే అనుమానించి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది. దీంతో దేశం కోసం ఎంతో చేసిన శ్రీకాంత్.. కుటుంబంతో సహా ఇల్లు వదిలి పారిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇంతకీ కులకర్ణిని చంపింది ఎవరు.. దీని వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటి.. దాన్ని శ్రీకాంత్ ఎలా ఛేదించాడు.. తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు అన్నది మిగతా కథ.
మిగతా ఏ వెబ్ సిరీస్ నుంచి అయినా ‘ఫ్యామిలీ మ్యాన్’ను భిన్నంగా నిలబెట్టేది.. ఇందులోని యునీక్ ఎంటర్టైన్మెంట్. థ్రిల్లర్ కథలతో తెరకెక్కే వెబ్ సిరీసులు ప్రధానంగా ప్రేక్షకులను ‘థ్రిల్’ చేయడం మీదే దృష్టిపెడతాయి. కానీ ఇందులో థ్రిల్ కు తోడు ప్రేక్షకుల ముఖాలపై ఎప్పుడూ చిరునవ్వులు చెరగనీయకుండా చేసే కామెడీ.. ఆసక్తి రేకెత్తించే ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. థ్రిల్లర్ కథల్లో ఈ రెండు అంశాలను మిళితం చేసి మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. కానీ రాజ్-డీకేల ఇంట్రెస్టింగ్ రైటింగ్- ప్రెజెంటేషన్.. ప్రధాన పాత్రధారుల అదిరిపోయే పెర్ఫామెన్స్ మూలంగా ‘ఫ్యామిలీ మ్యాన్’ ఫ్యామిలీ అంతా కూర్చుని చూసి ఎంజాయ్ చేసే ఎంటర్టైనర్ గా మారింది. అదే సమయంలో ప్రేక్షకులను ఉత్కంఠతో ఊపేయడంలోనూ తొలి రెండు సీజన్లు విజయవంతం అయ్యాయి. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ‘ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ సైతం ముందు రెండు సీజన్ల లాగే మంచి టెంపోతో సాగుతూ ప్రేక్షకులను ఎంగేజ్ చేసింది. శ్రీకాంత్ తివారి పాత్రలో మనోజ్ బాజ్ పేయి మరోసారి టాప్ లెవెల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఏడు ఎపిసోడ్లతో ఆరు గంటలకు పైగా నిడివితో సాగే ‘ఫ్యామిలీ మ్యాన్-3’ని ఆపకుండా చూసేయొచ్చు. ఐతే తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఇందులో థ్రిల్ ఫ్యాక్టర్ కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. కథ విస్తృతి పెద్దది.. విలన్ల సెటప్ కూడా భారీగా ఉన్నప్పటికీ.. తొలి సీజన్లో మూసా (నీరజ్ మాధవ్).. రెండో సీజన్లో రాజి (సమంత) లాంటి స్టన్నింగ్ విలన్ క్యారెక్టర్ మిస్ కావడం దీనికి మైనస్. రుక్మాంగద పాత్ర రూపంలో జైదీప్ అహ్లావత్ లాంటి సూపర్ పెర్ఫామర్ని ప్రతినాయకుడిగా దించినా.. ఆ పాత్ర ఇంపాక్ట్ అంతగా లేకపోవడంతో ‘ఫ్యామిలీ మ్యాన్’లో ఇంటెన్సిటీ తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా ఇది ఎంగేజింగ్ సిరీస్ అనడంలో మాత్రం సందేహం లేదు.
మణిపూర్లో అల్లర్లు తీవ్ర రూపం దాల్చినప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాలు-చైనా కుట్రల నేపథ్యంలో బాలీవుడ్లో సినిమాలు.. సిరీసులు పెరుగుతున్నాయి. ఆల్రెడీ ‘పాతాళ్ లోక్-2’కు ఈ నేపథ్యాన్నే తీసుకున్నారు. ఇప్పుడు ‘ఫ్యామిలీ మ్యాన్-3’ని కూడా ఇదే బ్యాక్ డ్రాప్ తో నడిపించారు రాజ్-డీకే. ఐతే ఇక్కడి పరిస్థితుల గురించి పెద్దగా అవగాహన లేని వాళ్లకు కూడా బాగా అర్థమయ్యేలా వాటి గురించి ప్రభావవంతంగా చూపించారు రాజ్-డీకే-సుమన్ కుమార్-తుషార్ సేత్. వివాదాలకు తావు లేకుండా కథను నడిపిస్తూనే.. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించడంలో ఈ టీం విజయవంతం అయ్యింది. ప్రపంచ వ్యవహారాల గురించి పరిజ్ఞానం ఉండడం వేరు. వాటిని కథలో భాగంగా ఆసక్తికరంగా.. అర్థమయ్యేలా చెప్పడం వేరు. ‘ఫ్యామిలీ మ్యాన్’ టీం ఇదే చేసింది. ఇంటి దొంగల సాయంతో ఇండియాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో జరిగే కుట్రలు.. వీటిని అడ్డుకోవడానికి సీక్రెట్ ఏజెన్సీలు చేసే పోరాటం నేపథ్యంలో ‘ఫ్యామిలీ మ్యాన్-3’ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. దేశం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఒక సీక్రెట్ ఏజెంట్ మీద.. దేశద్రోహిగా ముద్ర పడితే అతనేం చేశాడన్నది ఇందులో ప్రధాన కథాంశం. అలాంటి పరిస్థితుల్లో కూడా డ్యూటీ మరవకుండా.. ఓవైపు కుటుంబాన్ని కాపాడుకుంటూ.. ఇంకోవైపు ఈ కుట్రను ఎలా ఛేదించాడనే నేపథ్యంలో కథాకథనాలు రసవత్తరంగా నడుస్తాయి.
పూర్తిగా ఈశాన్య రాష్ట్రాల్లోనే కథ నడవడంతో ‘ఫ్యామిలీ మ్యాన్-3’కి ఒక కొత్త లుక్ వచ్చింది. అక్కడి పరిస్థితుల గురించి ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నప్పటికీ.. ఆ సెటప్ అంతా ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కాకపోతే జైదీప్ అహ్లావత్ చేసిన రుక్మ పాత్ర మొదట్లో ఇంట్రెస్టింగ్ గానే అనిపించినా.. రాను రాను సాధారణంగా మారిపోతుంది. ముందే అన్నట్లు మూసా.. రాజి పాత్రల్లా స్టన్నింగ్ అనిపించేలా ఈ క్యారెక్టర్ని డిజైన్ చేయలేకపోయారు రాజ్-డీకే. రూత్ లెస్ విలన్ లాగా కాకుండా తన పాత్రకూ ఒక ఎమోషనల్ టచ్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం అంతగా పని చేయలేదు. అందువల్ల ఆ పాత్ర తీవ్రత తగ్గింది. జైదీప్ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ.. ఈ క్యారెక్టర్ సిరీస్ కు కొంత మైనస్సే. అలాగే ఇందులోనూ కొన్ని ట్విస్టులున్నప్పటికీ.. అవి పేలిపోయే రేంజిలో మాత్రం లేవు. ఈ ప్రతికూలతల్ని పక్కన పెట్టి చూస్తే.. సిరీస్ మాత్రం ఎక్కడా బ్రేక్ లేకుండా మంచి టెంపోతో సాగిపోతుంది. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ గా అనిపించే ఎపిసోడ్లు ఇందులో ఉన్నాయి. ఇక ‘ఫ్యామిలీ మ్యాన్’ ప్రత్యేకతను చాటే ఎంటర్టైన్మెంట్ కూ లోటు లేదు. జేకే పాత్రలో షరిబ్ హష్మి మరోసారి ఎంటర్టైన్ చేశాడు. మనోజ్-షరిబ్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ప్రియమణి అండ్ కోతో ఫ్యామిలీ డ్రామా కూడా బాగుంది. అందులోనూ బాగానే వినోదాన్ని పండించారు. ఇక శ్రీకాంత్ తివారిగా మనోజ్ పెర్ఫామెన్స్ గురించి చెప్పేదేముంది? అదరగొట్టేశాడు. శ్రేయా ధన్వంతరి.. నిమ్రత్ కౌర్ సిరీస్ కు గ్లామర్ టచ్ ఇచ్చారు. విజయ్ సేతుపతి క్యామియో ఆకట్టుకుంటుంది. సందీప్ కిషన్ కూడా ఓకే. అక్కడక్కడా బూతుల డోస్ ఎక్కువైంది. కొంచెం సర్దుకోవాలి. సిరీస్ కు శుభం కార్డు వేయకుండా.. తొలి సీజన్లో మాదిరే అర్ధంతరంగా ఆపేసిన టీం సీజన్-4కు రెడీగా ఉండాలని హింట్ ఇచ్చింది. మూడు సీజన్ల తర్వాత కూడా ‘ఇక చాలు’ అనే ఫీలింగ్ రాకుండా.. ఇంకో సీజన్ కోసం ఎదురు చూసేలా చేయడమే ‘ఫ్యామిలీ మ్యాన్’ విజయంగా చెప్పొచ్చు.
చివరగా: ఫ్యామిలీ మ్యాన్.. కొంచెం థ్రిల్ తగ్గినా మిషన్ సక్సెస్
రేటింగ్- 3/5