Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ ఆ సినిమాకి డైరెక్టర్ అని చెప్పుకోకపోవడానికి కారణం అదేనట...!

By:  Tupaki Desk   |   12 July 2020 12:50 PM GMT
ప్రశాంత్ వర్మ ఆ సినిమాకి డైరెక్టర్ అని చెప్పుకోకపోవడానికి కారణం అదేనట...!
X
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ 'అ!' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, ఇషా రెబ్బా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రశాంత్ న్యూ కాన్సెప్ట్‌ తో తీసిన ఫస్ట్ సినిమా 'అ!' విమర్శకుల మెప్పు పొందడమే కాకుండా ప్రేక్షకులను కూడా అలరించింది. 'అ!' ఏకంగా రెండు నేషనల్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకోవడంతో అందరూ ప్రశాంత్ వర్మ గురించి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ రెండో సినిమాగా రాజశేఖర్‌ తో 'కల్కి' తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో మరో వైవిధ్యమైన కథాంశంతో మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ప్రశాంత్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఇటీవల ఓ చిత్రానికి వర్క్ చేసి కూడా దర్శకుడిగా తన పేరు టైటిల్ కార్డులో వేయించుకోలేదు. ఆ సినిమా హిందీ 'క్వీన్‌' తెలుగు రీమేక్‌ 'దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి'.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ వర్మ.. తాను వర్క్ చేసిన సినిమాకి డైరెక్టర్ గా పేరు వేయించుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించారట. ప్రశాంత్ మాట్లాడుతూ.. హిందీ 'క్వీన్‌' తెలుగు రీమేక్‌ గా తెరకెక్కిన 'దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి'కి డైరెక్షన్ చేసిన మాట వాస్తవమే. కానీ ఆ మూవీకి సంబంధించి క్రెడిట్ నాకు ఇవ్వవద్దని నేనే చిత్ర నిర్మాతలకి చెప్పాను. నన్ను ఆ సినిమాకి డైరెక్షన్ చేయమని నా దగ్గరకు వచ్చే సమయానికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. అందుకే ఆ మూవీ క్రెడిట్ తీసుకోకూడదని నేను అనుకున్నాను. వేరే డైరెక్టర్ సగం చిత్రీకరణ చేసిన సినిమా నేను చేయడానికి కారణం ప్రొడ్యూసర్స్. కేవలం ఆ చిత్ర నిర్మాత కోసమే మిగతా భాగం డైరెక్ట్ చేశాను. క్రెడిట్ మాత్రం తీసుకోవాలి అనుకోలేదు అని చెప్పుకొచ్చారట. కాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'క్వీన్' సినిమాని తెలుగులో తమన్నా భాటియాతో నీలకంఠ దర్శకత్వంలో స్టార్ట్ చేసారు. అయితే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న తర్వాత నీలకంఠ ఈ సినిమా నుండి తప్పుకుని మలయాళ క్వీన్ కి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మిగతా భాగం 'దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి' షూటింగ్ ప్రశాంత్ వర్మ పూర్తి చేసారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది.