Begin typing your search above and press return to search.

సీఎం జ‌గ‌న్ తో సినీపెద్ద‌ల‌ భేటీ వ‌చ్చే వారంలో?

By:  Tupaki Desk   |   14 Sep 2021 5:30 AM GMT
సీఎం జ‌గ‌న్ తో సినీపెద్ద‌ల‌ భేటీ వ‌చ్చే వారంలో?
X
సినీప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌లు వినేందుకు ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తీరిక చిక్క‌డం లేద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. మంత్రి పేర్ని నాని నేరుగా మెగాస్టార్ కి ఫోన్ చేసి ముఖ్య‌మంత్రి ఆహ్వానిస్తున్నార‌ని స‌మ‌స్య‌లు చెప్పాల‌ని కోరార‌ని ప్ర‌క‌టించి నెల‌రోజులు దాటినా ఇప్ప‌టికీ ఫైన‌ల్ కాలే రాక‌పోవ‌డం ర‌క‌ర‌కాల సందేహాల‌కు తావిచ్చింది. అయితే ఇప్ప‌టికైనా దీనిపై స్ప‌ష్ఠ‌మైన ప్ర‌క‌ట‌న వ‌స్తుందా? అని వేచి చూసిన వారికి ఎట్ట‌కేల‌కు వ‌చ్చే వారంలో సీఎం జ‌గ‌న్ తో భేటీ అంటూ క‌బురందింది.

వచ్చే వారం సీఎం జగన్ ని టాలీవుడ్ ప్రతినిధి బృందం క‌లుస్తుంది. వైకాపా అధ్యక్షుడు .. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 20 న మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధుల బృందానికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈ మేరకు కమ్యూనికేషన్ ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా చిరంజీవికి రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ద్వారా క‌బురందింది. సీఎంని క‌లిసే ప్రతినిధి బృందంలో మెగాస్టార్ చిరంజీవి సహా ప‌లువురికి ఆహ్వానం ఉంటుంద‌ని తెలిసింది.

భేటీకి ఏడుగురికే ఛాన్స్ ఉంటుందా?

టాలీవుడ్ సినీపెద్ద‌లు.. ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీకి ఎంద‌రికి అవ‌కాశం ఉంది? అంటే.. కేవ‌లం ఏడుగురు సినీప్ర‌ముఖులు మాత్ర‌మే పాల్గొన‌నున్నార‌ని ఇదివ‌ర‌కూ క‌థ‌నాలొచ్చాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి స‌హా ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత కం ఎగ్జిబిట‌ర్ డి.సురేష్ బాబు.. ఉన్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి- మండ‌లి అధ్య‌క్షుడు సి కళ్యాణ్- నిర్మాత డిస్ట్రిబ్యూట‌ర్ కం ఎగ్జిబిట‌ర్ దిల్ రాజు ఈ బృందంలో ఉంటారని తెలిసింది. ఈ ఐదుగురితో పాటు మ‌రో ఇద్ద‌రు ఎవ‌రు? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక‌పోతే వైయ‌స్ జ‌గ‌న్ కి అత్యంత స‌న్నిహితుడైన కింగ్ నాగార్జున కు ఛాన్సుంది. నాగ్ ఇప్పటికే బిగ్ బాస్ కొత్త‌ సీజ‌న్ తో బిజీ అయినా ఈ కీల‌క భేటీకి హాజ‌ర‌వుతారు.

స‌మావేశం లో ఏం చ‌ర్చిస్తారు?

ఆంధ్రప్ర‌దేశ్ లో టిక్కెట్టు రేట్ల స‌మ‌స్య ప్ర‌ధాన‌మైన‌ది.. దీనివ‌ల్ల‌నే చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కావ‌డం లేదు. ఇటీవ‌ల టికెట్ ధ‌ర‌ల‌పై ఏపీలో వ‌చ్చిన స‌వ‌ర‌ణ‌ జీవోతో చిక్కుల‌పై సీఎం భేటీలో చ‌ర్చించ‌నున్నార‌ని తెలిసింది. గ్రామ పంచాయితీ- న‌గ‌ర పంచాయితీ- కార్పొరేష‌న్ ఏరియాల్లో టిక్కెట్టు ధ‌ర‌ల‌పై నా చ‌ర్చిస్తారు. ద‌ర్శ‌క‌న‌టుడు నిర్మాత‌ ఆర్.నారాయ‌ణ మూర్తి ఇత‌ర చిన్న నిర్మాత‌ల‌ డిమాండ్ మేర‌కు ఐదో షోని చిన్న సినిమాకి కేటాయించాల్సిందిగా సీఎంని కోర‌నున్నారు. అలాగే మునుప‌టిలాగే ప్ర‌తియేటా నంది అవార్డులతో క‌ళాకారుల‌ను ప్రోత్సహించాల‌ని కోర‌తారు. వినోద‌పు ప‌న్ను మినహాయింపులు..ఏపీ టాలీవుడ్ నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే స్టూడియోలు నిర్మించడానికి అవసరమైన భూముల రాయితీలపైనా చ‌ర్చిస్తార‌ని తెలిసింది. క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో థియేట‌ర్లు మూత ప‌డి ఉన్నాయి. ఆ స‌మ‌యంలో క‌రెంటు బిల్లుల మాఫీ అంశం ప్ర‌స్థావ‌న‌కు తెస్తార‌ట‌. ఎగ్జిబిష‌న్ రంగాన్ని కాపాడ‌టానికి త‌క్ష‌ణ సాయం సీఎంని కోర‌తార‌ని తెలిసింది.

అత్యంత కీల‌కంగా సినిమా టిక్కెట్ ధరలను పెంచడం .. విడుదలైన మొదటి వారంలో సినిమాల కోసం అదనపు బెనిఫిట్ షోలను నడపడం వంటి అంశాల్ని టాలీవుడ్ ప్రతినిధి బృందం సీఎం దృష్టికి తీసుకెళుతుంది. ప్రభుత్వం వైపు నుండి, థియేటర్లలో ఆన్‌లైన్ సినిమా టికెట్ అమ్మకాన్ని చేపట్టాలని జగన్ తన ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రతినిధి బృందానికి వివరిస్తారని గుస‌గుస వినిపిస్తోంది. ప్రభుత్వం నిర్ణయం దాని చట్టపరమైన చిక్కులను క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు క‌మిటీ ప‌ని చేస్తుంద‌ట‌.

వైజాగ్ టాలీవుడ్ అంశం చ‌ర్చ‌కు..!

సీఎం జ‌గ‌న్ తో భేటీలో విశాఖ‌లో ఫిలింస్టూడియోల నిర్మాణానికి స్థ‌లాల సేక‌రణ.. స్థ‌లాల సేక‌ర‌ణ‌లో స‌బ్సిడీ అంశాలు వ‌గైరా వ‌గైరా చ‌ర్చించేందుక ఆస్కారం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే విశాఖ ఔట‌ర్ లో ఫిలింస్టూడియో నిర్మాణానికి మెగాస్టార్ చిరంజీవి.. న‌ట‌సింహా బాల‌కృష్ణ స‌హా ప‌లువురు స్టార్లు నిర్మాత‌లు ఆస‌క్తిగా ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఏవీఎం స్టూడియోస్ సైతం తేదేపా ప్ర‌భుత్వ హ‌యాంలో స్టూడియో నిర్మాణానికి స్థ‌లం కోరింది. ఇప్పుడు మ‌రోసారి ఈ భేటీలో స్టూడియోల నిర్మాణం కొత్త టాలీవుడ్ నిర్మాణంపై చ‌ర్చ ఉంటుంద‌ని భావిస్తున్నారు. దీనిపై జ‌గ‌న్ చాలా ఆస‌క్తిగా ఉన్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.