Begin typing your search above and press return to search.

అలర్ట్ః ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 3 నెల‌ల త‌ర్వాత‌ జరిగేది ఇదే!

By:  Tupaki Desk   |   27 July 2021 5:30 PM GMT
అలర్ట్ః  ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 3 నెల‌ల త‌ర్వాత‌ జరిగేది ఇదే!
X
ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి ఇప్ప‌టి వ‌ర‌కు మందు లేదు. ఉన్న‌ద‌ల్లా వ్యాక్సిన్ మాత్ర‌మే. అందుకే.. ప్ర‌పంచం మొత్తం వ్యాక్సినేష‌న్లో నిమ‌గ్న‌మైపోయింది. అర్హ‌త ఉన్న‌వారంద‌రికీ వ్యాక్సిన్ చేస్తే చాలు కొవిడ్ ను జ‌యించిన‌ట్టే అనే భావ‌న‌లో ఉన్నాయి దేశాల‌న్నీ. అయితే.. తాజాగా ఓ స‌ర్వే విడుద‌ల చేసిన నివేదిక స‌రికొత్త ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది.

ఫైజ‌ర్ లేదా ఆస్ట్రాజెనికా మ‌న దేశంలో కొవిషీల్డ్ తీసుకున్న వారిలో మూడు నెల‌ల త‌ర్వాత యాంటీ బాడీలు భారీగా త‌గ్గిపోతున్నాయ‌ట‌. వ్యాక్సిన్ తీసుకున్న తొలినాళ్ల‌లో విప‌రీతంగా పెరుగుతున్న యాంటీ బాడీలు.. ప‌ది వారాల త‌ర్వాత 50 శాతానికిపైగా క్షీణించిపోతున్నాయ‌ని యూనివ‌ర్సిటీ కాలేజ్ అండ‌న్ ప‌రిశోధ‌కుల అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

ఫైజ‌ర్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 21 వ రోజు నుంచి 40 రోజుల మ‌ధ్య 7,506 u/ml (యూనిట్స్ ఫ‌ర్ మిల్లీ మీట‌ర్‌) ఉంటున్న యాంటీ బాడీలు.. 70 రోజుల త‌ర్వాత 3,330 u/ml వ‌ర‌కు త‌గ్గిపోతున్నాయ‌ని నిపుణులు గుర్తించార‌ట‌. ఆస్ట్రాజెనికా విష‌యంలో మ‌రింత దారుణంగా ప‌డిపోతున్నాయట‌. 20 రోజుల్లోపు 1,201 u/ml ఉంటున్న యాంటీ బాడీలు.. 70 రోజుల త‌ర్వాత 190 u/ml గా ఉంటున్నాయ‌ని స‌ద‌రు నివేదిక చెబుతోంది.

దీనివ‌ల్ల డెల్టా, డెల్టా ప్ల‌స్ వంటి బ‌ల‌మైన వేరియ‌ట్ల‌ను ఎదుర్కోవ‌డం సాధ్యం కాద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే.. క‌రోనా ముప్పు తగ్గుతంద‌ని భావిస్తున్న వారిలో.. ఈ రీసెర్చ్ ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు 80 నుంచి తొంభై శాతం మేర మాత్ర‌మే ప్రభావం చూపిస్తోంద‌ని నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అలాంటి వ్యాక్సిన్ల ప్ర‌భావం కూడా మూడు నెల‌ల త‌ర్వాత త‌గ్గిపోతోంద‌ని తేల‌డం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే. ఇదే నిజ‌మైతే.. క‌రోనా నిబంధ‌న‌లు ప‌టిష్టంగా పాటించ‌డం మాత్ర‌మే జ‌నాన్ని కాపాడుతుంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు.