విజయ్ దేవరకొండను ఉద్దేశించి నేనేమీ అనలేదు: విశ్వక్ సేన్

Tue May 04 2021 15:00:01 GMT+0530 (IST)

vishwak sen talking about vijay devara Konda

విశ్వక్ సేన్   పేరు వినగానే 'ఫలక్ నుమా దాస్' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ తరువాత 'హిట్' సినిమాలో ఆయన చేసిన సహజమైన యాక్టింగ్ కళ్లముందు కదలాడుతుంది. ఆయన తాజా చిత్రంగా 'పాగల్' రూపొందింది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. పరిస్థితులు అనుకూలించగానే థియేటర్లకు రావడానికి ఈ సినిమా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమం ద్వారా విశ్వక్ సేన్   తన మనోభావాలను పంచుకున్నాడు."నా అసలు పేరు దినేశ్ .. స్క్రీన్ నేమ్ గా విశ్వక్ సేన్   పెట్టుకున్నాను. నేను పుట్టిపెరిగింది హైదరాబాద్ లోనే. చిన్నప్పుడు డాన్స్ .. జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను. టీనేజ్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉండేది. నా అభిమాన దర్శకుడు కృష్ణవంశీ గారు .. ఇక నేను ఇష్టపడే హీరో ఎన్టీఆర్. డైరెక్టర్ ను అయినా .. హీరోను అయినా నాకు ఇష్టమే. మొత్తానికి ఇండస్ట్రీలోనే ఏదో ఒకటి కావాలనే పట్టుదలతో అలా తిరుగుతూనే ఉండేవాడిని.

నాకు చాలా పొగరు అని కొంత ప్రచారం జరిగింది .. కానీ అందులో నిజం లేదు. నేను అందరితోను స్నేహాంగానే ఉంటాను. నాతో పరిచమైన ఏ ఒక్కరూ నన్ను వదులుకోవడానికి ఇష్టపడరు. 'ఫలక్ నుమా దాస్' సినిమా థియేటర్లలో ఉండగా కొంతమంది ఆ సినిమా పోస్టర్లు చింపారు. అప్పుడు నేను ట్విట్టర్ ద్వారా ఒక వార్నింగ్ ఇచ్చాను .. చివర్లో ఒక మాట యూజ్ చేశాను. దాంతో నేను విజయ్ దేవరకొండను .. ఆయన ఫ్యాన్స్ ను ఉద్దేశించి అన్నట్టుగా క్రియేట్ చేశారు. నిజానికి నేను వాళ్లను ఏమీ అనలేదు .. హాట్ టాపిక్ చేయడం కోసం కొంతమంది చేసిన పని ఇది" అని చెప్పుకొచ్చాడు.