ఆమె అప్పుడు బాలయ్యతో.. ఇప్పుడు చిరంజీవితో

Thu Jun 10 2021 10:10:27 GMT+0530 (IST)

vidya balan lucifer remake

బాలీవుడ్ ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో నటించడం కొత్తేం కాదు. కాని కొందరు సీనియర్ హీరోయిన్స్ మాత్రం టాలీవుడ్ లో నటించేందుకు ఆసక్తి చూపించరు. కాని సీనియర్ హీరోయిన్ విద్యా బాలన్ మాత్రం మంచి పాత్ర అయితే తప్పకుండా నటించేందుకు సిద్దంగా ఉంటుంది. గతంలో నందమూరి బాలకృష్ణ కు జోడీగా 'ఎన్టీఆర్' సినిమాలో నటించిన విద్యా బాలన్ ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఎన్టీఆర్ చిత్రంలో హుందాగా కనిపించిన విద్యాబాలన్ మళ్లీ ఇన్నాళ్లకు మెగాస్టార్ చిరంజీవితో కలిసి మరో ముఖ్యమైన పాత్రలో నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.గత ఏడాది కాలంగా మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ రీమేక్ వార్తలు జోరుగా వస్తూనే ఉన్నాయి. మలయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్ ను తెలుగులో మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్నాడు. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా ను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది. లూసీఫర్ ను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి నేటివిటీకి తగ్గట్లుగా మార్చుతున్నట్లుగా చెబుతున్నారు. ఒరిజినల్ వర్షన్ లో హీరోయిన్ పాత్ర ఉండదు. కాని రీమేక్ లో మాత్రం చిరంజీవికి జోడీగా హీరోయిన్ నటించబోతుంది. లూసీఫర్ లో కీలక పాత్రకు గాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ ను నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది.

పాత్ర ప్రాముఖ్యత మరియు హీరో స్టార్ డమ్ నేపథ్యంలో విద్యా బాలన్ ఈ సినిమా ను చేసేందుకు ఓకే చెప్పిందని సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కాని త్వరలోనే ఈ విషయమై మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. లూసీఫర్ రీమేక్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సమయంలో విద్యా బాలన్ ఎంట్రీతో సినిమా బజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆచార్య షూటింగ్ పూర్తి అయిన వెంటనే చిరంజీవి లూసీఫర్ మొదలు పెట్టే అవకాశం ఉంది. కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ ను ముగించి చిరంజీవి లూసీఫర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నాడు.