Begin typing your search above and press return to search.

దసరా బరిలో 'వరుడు కావలెను'

By:  Tupaki Desk   |   25 Sep 2021 6:55 AM GMT
దసరా బరిలో వరుడు కావలెను
X
యువ హీరో నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''వరుడు కావలెను''. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య అనే డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది.

దసరా పండుగ కానుకగా ''వరుడు కావలెను'' చిత్రాన్ని అక్టోబర్ 15న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇది లవ్, ఫన్ అండ్ ఎమోషన్స్ కలబోసిన అందమైన కుటుంబ కథా చిత్రమని.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా హీరోహీరోయిన్లు ఉండే ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని వదిలారు.

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పడకపోతే 'వరుడు కావలెను' సినిమా ఈపాటికే థియేటర్లలోకి వచ్చి ఉండేది. వైరస్ కు భయపడి జనాలు సినిమా హాళ్లకు వస్తారో రారో అనే సందేహంతో ఇన్నాళ్ళు విడుదలకు కాస్త వెనుకాడారు. అయితే ఈ మధ్య విడుదలైన సినిమాలను ప్రేక్షకాదరణ దక్కుతుండటంతో.. ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాడానికి రెడీ అయ్యారు.

అయితే దసరా సీజన్ లో వస్తున్నట్లు ఇప్పటికే కొన్ని క్రేజీ మూవీస్ ప్రకటించాయి. అక్టోబర్ 8న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' 'కొండపొలం' సినిమాలు వస్తుంటే.. అక్టోబర్ 14న 'మహా సముద్రం' విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పుడు 'వరుడు కావలెను' సినిమా కూడా బరిలో దిగుతోంది. మరి వీటిలో ఏయే సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి.

'వరుడు కావలెను' చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చగా.. వంశీ పచ్చిపులుసుల సినిమాటోగ్రఫీ అందించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేశారు. ఇందులో నదియా - మురళీశర్మ - వెన్నెల కిశోర్ - ప్రవీణ్ - హర్ష వర్ధన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.