Begin typing your search above and press return to search.

'అఖండ' వైరస్ ను ఆపడం కష్టం: జగపతిబాబు

By:  Tupaki Desk   |   8 Dec 2021 12:30 PM GMT
అఖండ వైరస్ ను ఆపడం కష్టం: జగపతిబాబు
X
ఇప్పుడు ఎక్కడ చూసినా .. ఎక్కడ విన్నా 'అఖండ' నామ సంకీర్తనే జరుగుతోంది. బాలకృష్ణ ఈ సినిమాలో అఘోర పాత్రలో కనిపించనున్నాడని తెలిసిన తరువాత, పెద్దవాళ్లకే దడ పుట్టించే సంఘటనలు ఉండొచ్చని అనుకున్నారు. అలాంటి సంఘటనలు ఉన్నాయి కూడా. కానీ ఆ సంఘటనలను చిన్నపిల్లలు కూడా ఆసక్తికరంగా చూసేలా చిత్రీకరించడం బోయపాటి గొప్పతనం. చాలా కాలంగా బాలకృష్ణ సినిమాలేవీ ఓవర్సీస్ లో అంతగా సందడి చేయలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

బాలకృష్ణ లుక్ .. బలమైన కథాకథనాలు .. బోయపాటి టేకింగ్ .. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను ఒక రేంజ్ లో నిలబెట్టాయి. యాక్షన్ అయినా .. ఎమోషన్ అయినా అతిశయోక్తిగా అనిపించకుండా బోయపాటి తీసుకున్న జాగ్రత్తలు కూడా ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. గతంలో వచ్చిన 'లెజెండ్'లో విలన్ అదరగొట్టేసిన జగపతిబాబు, ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నట్టు చెప్పారు. విలన్ గా శ్రీకాంత్ పేరు వినిపించడంతో, మరి జగపతిబాబు పాత్ర ఎలా ఉండబోతుందనే విషయం అందరిలో ఉత్కంఠను రేకెత్తించింది.

అంత అనుకున్నట్టుగానే జగపతిబాబు పాత్రకి కూడా మంచి మార్కులు పడిపోయాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "బాలయ్య బాబు .. బోయపాటి శ్రీను 'లెజెండ్'తో నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. రిటన్ గిఫ్ట్ గా నేను 'అఖండ' సినిమా చేశాను. వాళ్ల కాంబినేషన్లో చేయమని అడిగారు .. చేయాలి అని ఫిక్స్ అయ్యాను. కథను గురించి నేను అడగలేదు .. ఆలోచించనూ లేదు. సినిమా హిట్ అవుతుందనే విషయంలో మొదటి నుంచి కూడా ఎవరికీ ఎలాంటి డౌట్ లేదు. సాలిడ్ హిట్ అని నేను కూడా ముందుగానే చెప్పాను .. కాకపోతే ఇంత హిట్ అవుతుందని అనుకోలేదు.

రీసెంట్ గా కరోనా ఎంత ఎఫెక్ట్ చేసిందనేది అందరికీ తెలుసు. అది ఎంత పెద్ద వైరస్ అనేది తెలుసు. దానిని మించినది 'అఖండ' వైరస్. దీని వేరియేషన్స్ ను మనం ఊహించలేం. ఈ సినిమాలో బాలకృష్ణ గెటప్ ఎక్కడికో రీచ్ అయిపోయింది. నాకు తెలిసి ఆయన కెరియర్లోనే ఇది బెస్ట్ గెటప్. ఇక ఈ సినిమాలో చూడగానే నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. వాయిస్ కూడా మార్చినట్టుగా ఉందని అంతా అంటున్నారు .. అలా చెప్పించింది బోయపాటినే. ఈ సినిమా అనేది ఒక సాహసమే అయినా .. ప్రయోగమే అయినా, ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.