నాని Vs నాని.. ఒకే స్టోరీ లైన్ తో ఇద్దరు హీరోలు..?

Fri May 13 2022 15:02:17 GMT+0530 (IST)

two movies same story line

ఇద్దరు ఫిలిం మేకర్స్ ఒకే పాయింట్ తో కథ రాసుకోవడం.. ఒకరికి తెలియకుండా మరొకరు సినిమా తీయడం అనేది కొన్ని సందర్భాలో చూస్తుంటాం. ఒకే లైన్ తో డిఫరెంట్ ట్రీట్ మెంట్ - ప్రజెంటేషన్ తో తెరకెక్కిన సినిమాలున్నాయి.అయితే ఇప్పుడు టాలీవుడ్ లో రెండు చిత్రాలు ఒకే స్టోరీ లైన్ తో వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. నేచురల్ స్టార్ నాని నటించిన 'అంటే సుందరానికీ' మరియు నాగశౌర్య హీరోగా రూపొందిన 'కృష్ణ వ్రింద విహారి' సినిమాల మెయిన్ ప్లాట్ ఒకటే అని టాక్ వినిపిస్తోంది.

నాగశౌర్య - షెర్లీ సెటియా జంటగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ''కృష్ణ వ్రింద విహారి''. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి నిర్మించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

అయితే ఈ సినిమా కథంతా పెళ్లికి అనర్హుడని భావించే ఒక యువకుడి చుట్టూ తిరుగుతుందట. ఇందులో హీరో తన ప్రైవేట్ పార్ట్ చాలా చిన్నదని భావిస్తూ ఉంటాడట. కానీ బయటకు మాత్రం ఆ భయం లేనట్లుగా ప్రవర్తిస్తాడట. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ యువకుడైన హీరో.. ఒక మోడ్రన్ గర్ల్ ని ప్రేమించిన తర్వాత ఏర్పడిన పరిస్థితులేంటనేది 'కృష్ణ వ్రింద విహారి' సినిమాలో ఫన్నీగా చూపిస్తారని టాక్.

మరోవైపు నాని - నజీమ్ ఫహాద్ హీరోహీరోయిన్లుగా నటించిన 'అంటే.. సుందరానికీ!' సినిమా కూడా కొంచెం మార్పుతో అదే లైన్ లో నడుస్తుందని అంటున్నారు. సుందర్ ప్రసాద్ అనే అమాయకపు బ్రాహ్మణ యువకుడు మరియు లీలా క్రిస్టియన్ అమ్మాయి మధ్య ఆహ్లాదకరమైన ప్రేమ కథతో ఈ సినిమాలో చూపించబోతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వివేక్ ఆత్రేయ 'అంటే.. సుందరానికీ' సినిమాని తెరకెక్కించారు. అయితే ఇందులో హీరో శృంగార సమయంలో సమస్యలు ఎదుర్కొనే వ్యక్తిగా కనిపిస్తాడట. ట్రైలర్ లోనే ఈ చిత్రంలో సుందర్ ప్రసాద్ కి ఇంకేదో చెప్పుకోలేని సమస్య ఉందనే క్యూరియసిటీ కలిగించిన సంగతి తెలిసిందే. అది ఇదేనని అంటున్నారు.

ఇదే కనుక నిజమైతే 'అంటే సుందరానికీ' మరియు 'కృష్ణ వ్రింద విహారి' చిత్రాలు దాదాపు ఒకే స్టోరీ లైన్ తో రూపొందినట్లేనని అనుకోవాలి. హీరోహీరోయిన్ల పాత్రలు కూడా అలానే డిజైన్ చేయబడ్డాయి. ఇంతకముందు 'ఏక్ మినీ కథ' చిత్రం కూడా ఇలాంటి పాయింట్ తోనే వచ్చింది.

ఇటీవల వచ్చిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మరియు అంతకుముందు వచ్చిన ‘వివాహ భోజనంబు’ సినిమాలు రెండూ లాక్ డౌన్ పెళ్లి అనే స్టోరీ లైన్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' 'షాదీ ముబారక్' సినిమాలు కొంతవరకు ఒకేలా అనిపిస్తాయి.

నందమూరి బ్రదర్స్ చేసిన 'టెంపర్' 'పటాస్ సినిమాలు ఒకే కథతో ఒకే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. గతంలో ఒకే కథతో రూపొందిన 'దాన వీర శూర కర్ణ' 'కురుక్షేత్రం' చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఒకే స్టోరీ లైన్ తో తెరకెక్కిన 'అశోక చక్రవర్తి' 'ధృవనక్షత్రం' సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి.

ఇప్పుడు సిమిలర్ స్టోరీ లైన్ తో రూపొందిన 'అంటే సుందరానికీ' - 'కృష్ణ వ్రింద విహారి' చిత్రాలు మూడు వారాల గ్యాప్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి. నాగశౌర్య సినిమా మే 20న విడుదల అవుతుంటే.. నాని మూవీ జూన్ 10న రిలీజ్ కాబోతోంది. మరి వీటిల్లో ఏది ప్రేక్షకాదరణ అందుకుంటాయో చూడాలి.