ఎయిర్ పోర్టులో స్టార్ హీరో సతీమణి డ్రెస్సింగ్ పై సోషల్ మీడియాలో చెడుగుడు

Sun Oct 24 2021 13:01:42 GMT+0530 (IST)

trolls on mira rajput dressing

ప్రముఖులైతే చాలు.. వారిని మైక్రోస్కోప్ వేసి చూడటం ఈ మధ్యన అలవాటైంది. దీనికి తోడు ప్రతి ఒక్కరి చేతిలో ఉండే సెల్ ఫోన్ తో ఫోటోలు.. వీడియోలు చేయటం.. తమ మనసుకు.. బుద్దికి పుట్టినట్లుగా సదరు విషయాన్ని ప్రచారం చేయటం.. ఆ వాదనను నచ్చి.. మెచ్చినోళ్లంతా కలిసి షేర్ చేయటం.. అదో వార్తగా మారటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇలాంటివేళలో.. నచ్చినట్లుగా బతికేస్తూ.. ఎవరేమన్నా పట్టించుకోకుండా ఉండటం ఒక పద్దతి. లేదంటే.. ఎవరేం అనుకుంటారన్న జాగ్రత్త.. భయంతో అందరి కోసం నటిస్తూ బతికేయటం మరో పద్దతి.బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సతీమణి మీరా.. తనకు తోచిన రీతిలో ఉంటున్నారు. ఇది కొద్దిమందికి నచ్చట్లేదు. తాజాగా కుటుంబ సమేతంగా వెకేషన్ కు వెళ్లి వచ్చిన వారు ముంబయి ఎయిర్ పోర్టులో ఇంటికి వెళుతున్న క్రమంలో వారికి సంబంధించిన తీసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో.. షాహిద్ కపూర్ మొదలు ఇద్దరు పిల్లలు ఫుల్ డ్రెస్సింగ్ లో ఉండే.. షాహిద్ వైఫ్ మీరా మాత్రం అందుకు భిన్నంగా బ్లాక్ డెనిమ్ షార్ట్స్ తో కనిపించారు.

ఈ వీడియోకు ఎవరికి తోచిన వ్యాఖ్య వారు చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లతో మోతక్కిస్తున్నారు. కొందరేమో.. పిల్లలు ఫుల్ డ్రెస్ తో.. తల్లి మాత్రం దుస్తుల్ని ధరించలేదన్న విపరీత వ్యాఖ్యలతో పాటు.. ఇప్పుడీ డ్రెస్ లో కనిపించినా రేపొద్దున ఎన్ సీబీ వారి విచారణకు మాత్రం పూర్తి దుస్తులతో హాజరుకావొచ్చని మరొకరు.. ఇష్టారాజ్యంగా రాసేస్తున్నారు. వాస్తవంగా చూస్తే.. ఇవాల్టి రోజున పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోనూ.. మల్టీఫ్లెక్సుల్లోనూ మీరా ధరించిన దుస్తుల్ని ధరించి వస్తున్న వారు చాలామంది కనిపిస్తున్నారు.

అలాంటివేళ.. ఒక స్టార్ హీరో సతీమణి ఫలానా రకంగా కనిపించాలన్న వ్యక్తిగత అభిప్రాయాన్ని విమర్శ రూపంలో ట్రోల్ చేస్తున్న వైనం చూసినప్పుడు.. సెలబ్రిటీలు.. సినీ స్టార్ కుటుంబాలు అందరికి నచ్చేలా ఉండాలనుకోవటం అత్యాశే అవుతుంది. పిల్లలు ఎలాంటి దుస్తులు ధరించాలో.. పెద్దలు ఎలాంటి డ్రెస్సింగ్ తో ఉండాలో డిసైడ్ చేయటం ఇప్పటి కాలానికి సూట్ అయ్యేది కాదు. ఎవరి ఇష్టం వారిదన్నట్లుగా వదిలేయటం మంచిదేమో? కానీ.. అందరూ అలా ఆలోచించరు కదా? కాబట్టి.. ఇలాంటి ట్రోలింగ్ సాధారణంగా మారుతోంది. ఇవాళ మీరా.. రేపొద్దున మరో సెలబ్రిటీ విషయం వచ్చినంతనే.. మీరా ఎపిసోడ్ ‘గతం’గా మారిపోతుంది.