Begin typing your search above and press return to search.

వ‌డ్డీ భారం మోయ‌లేక షూటింగుల‌కు నోనో

By:  Tupaki Desk   |   4 Aug 2020 6:50 AM GMT
వ‌డ్డీ భారం మోయ‌లేక షూటింగుల‌కు నోనో
X
అధిక వ‌డ్డీ భారం కుటుంబాల్ని రోడ్డున ప‌డేస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి అనుభ‌వాలు ఎంద‌రికో అయ్యాయి. ముఖ్యంగా సినీప‌రిశ్ర‌మ‌లో నిర్మాత‌ల‌కు ఇలాంటివి కొత్తేమీ కాదు. టాలీవుడ్ లో ఓ టాప్ ప్రొడ్యూస‌ర్ ఇంటి చుట్టూ ఎప్పుడూ అప్పుల ‌వాళ్లు తిరుగుతుంటారు. ఆయ‌న త‌న వార‌సుడిని హీరోగా నిల‌బెట్టేందుకు ఎలాంటి అప్పుల‌కు వెన‌కాడ‌డు. అప్పు చేసి ప‌ప్పు కూడు అయినా నెగ్గుకు రావాల‌న్న పంతాన్ని వీడ‌డు. ఇత‌ర హీరోల కోసం అప్పులు తెచ్చే నిర్మాత‌ల ప‌రిస్థితి ఇంత‌కంటే భిన్నంగా ఉండ‌దు.

అయితే కోవిడ్ -19 స‌న్నివేశంలో ఎలా ఉంది? అంటే.. ఇటీవ‌ల నాలుగు నెల‌ల స్వీయ నిర్భంధ స‌న్నివేశం టాలీవుడ్ ని అల్ల‌క‌ల్లోలం చేసిన సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డి వాళ్లు అక్క‌డే గ‌ప్ చుప్ అన్న‌ట్టే ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా దేశంలోని అన్ని ఇతర చిత్ర పరిశ్రమల మాదిరిగానే టాలీవుడ్ మూత ప‌డిపోయింది. కొంత‌కాలానికి ప్ర‌భుత్వాలు షూటింగుల‌కు అనుమ‌తులిచ్చినా ఎవ‌రూ ఆస‌క్తిగా లేనేలేరు. చిత్ర పరిశ్రమ సాధారణ స్థితికి వచ్చి షూటింగులను తిరిగి ప్రారంభించే సూచనలు ఇప్ప‌ట్లో క‌నిపించ‌లేదు.

ఇండ‌స్ట్రీ వ్య‌క్తుల‌ మానసిక స్థితి అంత ఘోరంగా దెబ్బ తిందనేది ఓ సర్వే. హీరోలు లేదా నిర్మాతలు రిస్క్ తీసుకొని షూటింగులను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా లేరు. జ‌ర‌గ‌కూడ‌నిది ఏదైనా సెట్స్ లో జ‌రిగితే అకస్మాత్తుగా షూటింగులు ఆపేయాలి. యూనిట్ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్ వ‌చ్చినా మొత్తం షెడ్యూల్ ఖ‌రాబ్ అవుతుంది. మొత్తం యూనిట్ 20 రోజులు స్వీయ నిర్భంధంలోకి వెళ్లాలి. ఒక‌వేళ ఇలా జ‌రిగితే అధిక వ‌డ్డీలు తెచ్చి పోషించే నిర్మాత‌ల ప‌ని అయిపోయిన‌ట్టే.

ఫైనాన్సియ‌ర్లు మొదటి మూడు నెలలకు వడ్డీని వదులుకోవడానికి ఇప్పటికే అంగీకరించారు. షూటింగ్‌లు తిరిగి ప్రారంభమైన తర్వాత మాత్రం నిర్మాతలు రిలీజ‌య్యే వరకు భారీ వడ్డీ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే థియేట‌ర్లు ఇప్ప‌ట్లో తెరిచేనా? అంటే సందేహ‌మే. దీనిపై ఎలాంటి కచ్ఛిత‌మైన స‌మాచారం లేదు. అందుకే నిర్మాతలు త్వ‌ర‌త్వ‌ర‌గా షూటింగుల‌ను ప్రారంభించేసి పూర్తి చేయాల‌నే ఆలోచ‌న‌ను విర‌మించుకున్నారు. ఏదేని కార‌ణంతో షూటింగ్ లు అకస్మాత్తుగా నిలిచిపోతే లేదా విడుదల ఆలస్యం అయితే భారీ వడ్డీని చెల్లించాల్సిందే. దాని కంటే వేచి చూసే పాలసీని అనుసరించడం అర్ధవంత‌మైన‌ద‌ని భావిస్తున్నారు. చిరంజీవి- మ‌హేష్ - అల్లు అర్జున్- ఆర్.ఆర్.ఆర్ టీమ్ స‌హా ప్ర‌తి ఒక్క‌రూ ఇదే ప‌ద్ధ‌తిని అవ‌లంబిస్తున్నారు.