Begin typing your search above and press return to search.

హీరో ఫ్యాన్స్ పై పోలీసులకు కంప్లైంట్ చేసిన తరుణ్ భాస్కర్...!

By:  Tupaki Desk   |   1 July 2020 8:50 AM GMT
హీరో ఫ్యాన్స్ పై పోలీసులకు కంప్లైంట్ చేసిన తరుణ్ భాస్కర్...!
X
ఫస్ట్ సినిమా 'పెళ్లి చూపులు' తోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు త‌రుణ్ భాస్క‌ర్. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' అంటూ మరో ప్రయోగాత్మక సినిమా చేసాడు. ఆ వెంటనే నటుడిగా మారి 'ఫలక్‌నుమా దాస్' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అందర్నీ షాక్ కి గురి చేసాడు. మరికొన్ని రోజుల్లోనే 'మీకు మాత్రమే చెప్తా' అంటూ హీరో అయిపోయాడు. ఇక 'నేను మీకు చెప్తా' అనే షో తో హోస్ట్ గా మారిపోయాడు తరుణ్ భాస్కర్. ద‌ర్శ‌కుడిగా.. ర‌చ‌యిత‌గా.. నటుడిగా.. మంచి గుర్తింపును సొంతం చేసుకున్న త‌రుణ్‌ భాస్క‌ర్ 'మ‌నిషి బ్ర‌తుకు ఇంతే' వెబ్ సిరీస్ కోసం సింగర్ అవతారం కూడా ఎత్తాడు. దర్శకుడిగా మొదటి సినిమాతోనే నిరూపించుకున్న తరుణ్ భాస్కర్ అదే ఫీల్డ్ లో కంటిన్యూ అవకుండా తనకున్న మల్టీ టాలెంట్స్ అన్నీ బయటకి తీస్తున్నాడని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తరుణ్ భాస్కర్ ఇటీవల ఒక మలయాళ సినిమాపై తన అభిప్రాయాన్ని షేర్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఏకంగా పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళింది.

తరుణ్ భాస్కర్ 'కప్పెల' అనే మళయాళ సినిమా నెట్ ఫ్లిక్స్ లో చూసి ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ''నెట్ ఫ్లిక్స్ లో 'కప్పేల' సినిమా చూడండీ.. తర్వాత నాకు థ్యాంక్స్ చెప్పండి. ఈ సినిమాలో హీరో పిచ్చోడిలా రీసౌండ్ చేస్తూ అరవడు.. అందరికంటే స్మార్ట్ గా తన డైలాగుల్లో సామెతలు చెప్పరు.. ఎక్సట్రీమ్ స్లో మోషన్ లో ఫిజిక్స్ ఫెయిల్ గాల్లో ఎగిరే ఫైట్లు చేయరు.. ప్రతి రెండు నిముషాలకోసారి హీరో రీ ఎంట్రీ ఉండదు.. లాస్ట్ టెన్ మినిట్స్ లో రాండమ్ గా ఫార్మర్స్ గురించో సైనికుల గురించో ఇండియా గురించో మెసేజ్ ఉండదు.. దీన్ని కూడా సినిమా అంటారు ఆ ఊర్లో'' అని పోస్ట్ పెట్టారు తరుణ్. అయితే ఇదే తరుణ్ భాస్కర్ కి తిప్పలు తెచ్చిపెట్టింది.

తరుణ్ భాస్కర్ కావాలని అలా పోస్ట్ చేసాడో లేదో అనేది తెలియదు కాని టాలీవుడ్ స్టార్ హీరో హీరో సినిమాలోని సన్నివేశాలను పోలి ఉన్నాయని భావించిన సదరు హీరో అభిమానులు తరుణ్ ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. దీంతో తరుణ్ భాస్కర్ ఈరోజు తనను ట్రోల్ చేసిన ఇద్దరిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను వ్యక్తిగతంగా దూషించారని ఇద్దరి పేర్లు వారి ఫోన్ నెంబర్లను కూడా అందజేశాడు. ‘ఫోన్ నెంబర్లు తీసుకొని వారితో మాట్లాడినా వారు బెదిరింపు స్వరంతోనే మాట్లాడారు. ఆ ఫోన్ కాల్స్ కూడా పోలీసులకు ఇచ్చాం'' అని పేర్కొన్నాడు తరుణ్ భాస్కర్. దీనికి సంభందించిన వివరాలు.. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

అయితే దీనిపై తరుణ్ ని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. ''నువ్వు తెలుగు సినిమాల గురించి తప్పుగా మాట్లాడితే ఓకే.. దానికి ఎవరైనా కౌంటర్ ఇస్తే వాళ్ళని సోషల్ మీడియా ఫ్రాడ్ లో కేసు పెట్టడం.. సూపర్ అన్న'' అని కామెంట్స్ పెడుతున్నారు. ఫార్మర్స్ గురించి లేదా సోల్జర్స్ గురించి మెసేజ్ ఇచ్చే సినిమాలు కాకుండా ఫ్రెండ్స్ తో మందుకొట్టి గోవా పోయి అక్కడ మందు కొట్టి జీవితాలు నాశనం చేసుకునే సినిమాలు తీయాలా అన్నా? '' అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ ఎంత దూరం పోనుందో చూడాలి.