ఈ నిర్మాత ఏది పట్టుకుంటే అది బంగారం!

Tue Aug 16 2022 08:00:01 GMT+0530 (IST)

star producers movie news

బంగారు గుడ్డు పెట్టే బాతును పట్టుకోవడం ఎలానో తెలియాలి. గ్లామర్ ప్రపంచంలో ఏది బంగారు బాతు.. ఏది కాదు! అన్నది కనుక్కోవడం ఓకింత కష్టమే. మునుపటిలా ఆడియెన్ అట్రాక్షన్స్ కి గురై సబ్ స్ట్రాక్షన్ లోకి వెళ్లడం లేదు. అడిషన్ తో మల్టీప్లై చేసి చాలా ఎక్కువగా సాలోచనతో ఆచితూచి థియేటర్లకు వెళుతున్నారు. ఇప్పుడు అంతా మల్టీప్లెక్స్ అండ్ ఓటీటీ యుగం నడుస్తోంది. యూత్ టేస్ట్ తో పాటు కామన్ ఆడియెన్ టేస్ట్ కూడా అప్ గ్రేడ్ అయ్యింది. దానికి తగ్గట్టు ఫ్లోలోకి రాకపోతే అభిరుచి మారకపోతే పరాజయాలు తప్పవు.ఇటీవలి కాలంలో దిగ్గజాలంటి హీరోలు మేకర్స్ సైతం పరాజయాలు ఎదుర్కోవడానికి కారణమిదే. అమీర్ ఖాన్- షారూక్ ఖాన్ - అక్షయ్ కుమార్ - చిరంజీవి సహా ఎందరో దిగ్గజాలు పరాజయాలు ఎదుర్కొన్నారు. ఇకపోతే టాలీవుడ్ లో అరడజను మంది అగ్ర నిర్మాతలకు ఫ్లాపులు ఎక్కువగా ఎదురవుతున్నాయి.

ఏది ట్రెండ్... ? ఏది యూత్ కి ఎక్కువ ఎక్కుతుంది?  మారిన జనాభిరుచి ఎలా ఉంది? అన్నదానిపై చాలామందికి క్లారిటీ రావడం లేదు. కానీ ఇటీవలి కాలంలో ఒక యువనిర్మాత బాగా స్టడీ చేసి తెలివిగా పెట్టుబడులు పెడుతున్నారన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కొత్తదనంతో కూడుకున్న ఆలోచనలు అతడికి సక్సెస్ ని అందిస్తున్నాయి. అందుకు కాశ్మీర్ ఫైల్స్ .. కార్తికేయ 2 సినిమాల విజయాలే సాక్ష్యాలు. ఆ రెండిటినీ విడుదల చేసినది అభిషేక్ అగర్వాల్. ఇతర అగ్ర నిర్మాతలతో పోలిస్తే నిర్మాతగా సుదీర్ఘమైన కెరీర్ ని సాగించలేదు. కానీ ఆడియెన్ పల్స్ పట్టుకోవడంలో అతడు మేటి అని నిరూపణ అవుతోంది.

అంతకుముందు అతడు కాశ్మీర్ ఫైల్స్‌తో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ ను అందించాడు. మళ్లీ ఇప్పుడు `కార్తికేయ 2` తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. కాశ్మీర్ ఫైల్స్ లో దేశభక్తి కోణం ఆకట్టుకోగా.. హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సంవత్సరం బాలీవుడ్ నుండి వచ్చిన అతిపెద్ద బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లలో ఇది ఒకటి. కార్తికేయ 2 విషయానికొస్తే ఇందులో సాంస్కృతిక కోణం థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మంచి ఊపుతో ప్రజల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఎంపికలే వైవిధ్యమైనవి. ప్రజల నాడి తెలిసి చేసినవి. అవి ప్రతిఫలించాయి! అన్న చర్చా ఇప్పుడు సాగుతోంది.

ఇటీవల వరుస ఫ్లాపులు తీసి చేతులు కాల్చుకున్న పలువురు అగ్రనిర్మాతలు ఈ విషయాన్ని గమనించారా లేదా? అన్నది చూడాలి. బాలీవుడ్ ఫిలింమేకర్స్ మారాలి అని విశ్లేషిస్తున్న ఇదే తరుణంలో మన టాలీవుడ్ లోనూ కొందరు అగ్ర  నిర్మాతలు మారాల్సిన సన్నివేశం కూడా ఉందన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే లాంటి విలక్షణమైన భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న అగ్రనిర్మాత అశ్వనిదత్ లో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

మహానటి లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ఆయన ఇటీవల సీతారామం లాంటి మరో బ్లాక్ బస్టర్ మూవీని తన కుమార్తె స్వప్నాదత్ సాయంతో నిర్మించగలిగారని విశ్లేషిస్తున్నారు. అతడు చేసిందల్లా యువతరం ట్రెండీ ఆలోచనలను అర్థం చేసుకుని ఎంకరేజ్ చేయడమే. అది విజయవంతమైన ఫార్ములాగాను మారింది వైజయంతి కాంపౌండ్ కి. ఇదే బ్యానర్ లో తదుపరి ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే కూడా సంచలనంగా మారుతుందని భావిస్తున్నారు. ట్రెండ్ ని అనుసరించే వాళ్లు మాత్రమే నిర్మాతలుగా ఇకపై సక్సెస్ ని అందుకోగలరు!