శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ ఎక్కడి దాకా వచ్చింది..?

Fri Oct 07 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

srikanth addala Multistarrer movie news

మానవ సంబంధాల నేపథ్యంలో సున్నితమైన కథలను తెర మీదకు తీసుకొస్తూ సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ వస్తున్న దర్శకుడు.. నెలలు గడుస్తున్నా తన తదుపరి సినిమాని ముందుకు తీసుకెళ్లడం లేదు.'కొత్త బంగారులోకం' చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన అడ్డాల శ్రీకాంత్.. తొలి చిత్రంతోనే మంచి విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. మహేష్ బాబు - వెంకటేష్ వంటి ఇద్దరు అగ్ర హీరోల కాంబినేషన్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్స్ కు నాంది పలికారు.

రెండు సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత శ్రీకాంత్.. బ్యాక్ టూ బ్యాక్ రెండు ప్లాప్స్ అందుకున్నారు. 'ముకుంద' మూవీ నిరాశ పరచగా.. 'బ్రహ్మోత్సవం' చిత్రం భారీ పరాజయం చవిచూసింది. దీంతో రేసులో వెనుకబడిపోయిన సెన్సిబుల్ డైరెక్టర్.. గతేడాది 'నారప్ప' వంటి రీమేక్ తో ఆకట్టుకున్నాడు.

అయితే ఈ సినిమా వచ్చి ఏడాది దాటిపోయినా అడ్డాల శ్రీకాంత్ ఇంతవరకూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించలేదు. ''అన్నాయ్'' అనే టైటిల్ తో ఓ సినిమా చేయనున్నట్లు 'నారప్ప' ప్రమోషన్స్ టైంలో దర్శకుడు స్వయంగా వెల్లడించారు. ఇది మూడు భాగాలుగా తెరకెక్కే ట్రైయాలజీ అని తెలిపారు.

గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నానని.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని శ్రీకాంత్ వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఈ భారీ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దర్శకుడు ఓ మల్టీస్టారర్ స్టారర్ చేస్తున్నాడని వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తారనే విషయం మీద స్పష్టత రావడం లేదు.

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా పరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పుడప్పుడే ఎవరి డేట్స్ దొరికే అవకాశంలేని కారణం చేతనే శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ లేట్ అవుతోందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి వెంకటేష్ మరియు రవితేజ కాంబినేషన్ లో సినిమా చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాలేదు.

మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ నుంచి నెక్స్ట్ సినిమా రావడానికి ఎందుకు ఇంత సమయం పడుతోందని సినీ అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇంత గ్యాప్ కూడా కెరీర్ కి మంచిది కాదని.. వీలయినంత త్వరగా ఏదైనా సినిమాతో రావాలని కోరుకుంటున్నారు. ఈసారి సాలిడ్ సక్సెస్ అందుకొని మళ్లీ ఇండస్ట్రీలో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆశిస్తున్నారు. మరి త్వరలోనే శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా సంగతులు చెప్తారేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.