Begin typing your search above and press return to search.

రాజమౌళి జ్ఞాపకాల్లో రష్యన్ ఎంబసీ.. అందుకేనా?

By:  Tupaki Desk   |   6 Jun 2020 9:30 AM GMT
రాజమౌళి జ్ఞాపకాల్లో రష్యన్ ఎంబసీ.. అందుకేనా?
X
భారతీయ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించిన బాహుబలి-2 సినిమా రష్యా దేశంలోనూ పాపులర్ అయింది. అయితే ఇటీవలే ఆ సినిమా అక్కడి టీవీ చానెల్‌లో టెలికాస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రష్యన్ ఫెడరేషన్ ఎంబసీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో 'బాహుబలి: ద కన్‌క్లూజన్‌'కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసి.. రష్యాలో ఒక టీవీలో బాహుబలి ప్రసారమవుతోందని తెలిపింది. అంతేగాక రష్యాలో ఇండియన్ సినిమా పాపులారిటీ సంపాదించుకుంటోంది. ఇప్పుడు రష్యన్ టీవీ ప్రసారం చేస్తోంది ఏమిటో తెలుసా.. రష్యన్ వాయిస్ ఓవర్‌తో 'బాహుబలి' మూవీ" అని వారు పోస్ట్ చేశారు. రష్యన్ ఎంబసీ ఆ వీడియోను షేర్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో అది వైరల్‌ అయింది. బాహుబలి సిరీస్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడనవసరం లేదు. భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా బాహుబలి ఫ్రాంచైజీ నిలిచింది. ఒక ఇండియన్‌ సినిమా రష్యాలో ఇంత పాపులారిటీ దక్కించుకోవడం ఇదే మొదటిసారి.

అయితే తాజాగా రష్యా ఎంబసీ డైరెక్టర్ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తుతూ ట్వీట్ చేశారు. 2017లో జరిగిన 39వ మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బాహుబలి సినిమాలను ప్రదర్శించారు. అంతేగాక ఆ వేడుకలకు భారత సినీ పరిశ్రమ ప్రతినిధిగా రాజమౌళి హాజరై ప్రసంగించారు. ‘భారతీయ డీఎన్‌ఏలో కుటుంబ విలువలు ఎక్కువగా ఉంటాయి. నా ప్రధాన లక్ష్యం భారతీయ కుటుంబ విలువలను ప్రపంచంతో పంచుకోవడమే. అదే ఈ సినిమాలో చేశాను.. విజయం సాధించాను. బాహుబలి కథ కూడా కుటుంబ విలువల గురించే ఉంటుంది. సోదరులు, తల్లి-కొడుకు, భార్యాభర్తలు ఇలా అనేక రకాల బంధాలతో కుటుంబ విలువలను కాపాడుతున్న వారికి నా ఈ సినిమా అంకితం’ అంటూ రాజమౌళి మాస్కో ఇంటర్నెషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రసంగించారు. రాజమౌళి అప్పుడు చేసిన ప్రసంగానికి సంబంధించిన ఫోటోతో పాటు మరెన్నో తీపి జ్ఞాపకాలను రష్యా ఎంబసీ ప్రస్తుతం తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.