జనవరి 14న ప్రభాస్.. 13న మహేష్..? మరి పవన్..?

Sat Jul 31 2021 14:19:41 GMT+0530 (IST)

Prabhas on January 14 .. Mahesh on January 13

వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కోసం స్టార్ హీరోల మధ్య ఇప్పటి నుంచే పోటీ ఎక్కువైంది. 2022 ఫెస్టివల్ సీజన్ లో వస్తున్నట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రకటించారు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి రానా దగ్గుబాటి తో కలిసి రానున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు. ఇప్పటికే మూడు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ పోటాపోటీగా సంక్రాంతి కోసం బరిలో దిగుతుంటే ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ కూడా సంక్రాంతి అల్లుడిని అవుతానని అంటున్నారు.మహేష్ బాబు - పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు ఐదు నెలల క్రితమే ప్రకటించారు. టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జనవరి 13వ తేదీని మహేష్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు శనివారం సాయంత్రం ఫస్ట్ లుక్ తో పాటుగా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రాన్ని కూడా పండుగ బరిలో నిలుపుతున్నారు. ప్రభాస్ అందరి కంటే ముందుగా ఏకంగా విడుదల తేదీని కూడా ఇచ్చేసాడు. జనవరి 14న తన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ - రానా కలిసి నటిస్తున్న 'అయ్యప్పనమ్ కొశీయుమ్' రీమేక్ ని ఏ డేట్ కి తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా సంక్రాంతి సీజన్ లో జనవరి 13 - 14 - 15 తేదీలలో సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. ఇప్పటికే రెండు డేట్స్ ని ఇద్దరు పెద్ద హీరోలు లాక్ చేసుకున్నారు కాబట్టి అదే రోజున పవన్ సినిమా వచ్చే అవకాశం లేదు. ఒకేసారి అన్ని పెద్ద సినిమాలు అంటే వసూళ్ళ పై చూపుతుంది. దీనిని బట్టి చూస్తే #PSPKRana చిత్రాన్ని ఈ రెండు సినిమాలను నాలుగైదు రోజులు ముందుగా కానీ తర్వాత కానీ విడుదల చేస్తారని టాక్.

అలానే వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎఫ్ 3' చిత్రాన్ని కూడా సంక్రాంతి కి తీసుకురావాలని చూస్తున్నారు. నిన్న శుక్రవారం వెంకటేష్ మీడియా ముఖంగా తన సినిమా సంక్రాంతికి అని ప్రకటించేశారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా - 'ఎఫ్ 3' సినిమాల డేట్స్ పై అందరి దృష్టి పడింది. మరి త్వరలోనే వీటిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. ప్రతి సంక్రాంతి కి సినిమాల మధ్య పోటీ అనేది మామూలే అయినప్పటికీ.. 2022 పండక్కి మాత్రం అన్నీ పెద్ద సినిమాలే వస్తుండటం విశేషం.