వారసుడి డెబ్యూకోసం బడా ప్రొడ్యూసర్ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా??

Fri Jun 18 2021 14:00:01 GMT+0530 (IST)

producer master plan for successor debut

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలామందే ఉన్నారు. అలాగే కొత్త హీరోలు కూడా పుట్టుకొస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడున్న హీరోలలో ఎక్కువగా సీనియర్ హీరోల వారసులు ఉన్న విషయం గురించి తెలిసిందే. చిత్రపరిశ్రమకు చెందిన బడా దర్శకులు.. నిర్మాతలు.. హీరోలు ఇలా వారి వారసులే ఎక్కువ. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఫిల్మీ బాక్గ్రౌండ్ ఫ్యామిలీస్ నుండి వచ్చే హీరోలకు కొదవేలేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వెలుగుతున్న వారంతా దాదాపు వారసులుగా అడుగు పెట్టినవారే. అయితే ఎంతటి బడా ఫ్యామిలీ నుండి వచ్చినా ఇండస్ట్రీలో కొనసాగాలంటే మాత్రం హిట్స్ కంపల్సరీ.

అలాగే నటనలో కూడా ఎవరికి వారు ప్రూవ్ చేసుకోవాల్సిందే. హీరోలు ఎలాంటి బాక్గ్రౌండ్ నుండి వచ్చినా వీక్షకులను ఆకట్టుకోలేకపోతే మాత్రం ఇంటికి పంపిస్తారు. ఈ విషయం పక్కనపెడితే.. త్వరలో తెలుగు పరిశ్రమకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఓ హీరో డెబ్యూ చేయనున్న సంగతి విదితమే. దిల్ రాజుతో పాటు సహనిర్మాతగా వ్యవహరించే శిరీష్ రెడ్డి కొడుకు ఆశిష్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తున్నారు. 'రౌడీబాయ్స్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా ద్వారా ఆశిష్ రెడ్డి డెబ్యూ చేస్తున్నాడు. హుషారు ఫేమ్ డైరెక్టర్ శ్రీహర్ష సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా మిర్చి సాహో ఫేమ్ సినిమాటోగ్రాఫర్ మది ఛాయాగ్రాహకుడిగా వర్క్ చేస్తుండటం విశేషం.

అయితే ఫస్ట్ సినిమానే బడా టెక్నీషియన్స్ తో ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దిల్ రాజు. అలాగే బెల్లంకొండ వారసుడి డెబ్యూకు ఎంత ఖర్చు పెట్టారో.. ప్రస్తుతం ఆశిష్ డెబ్యూ కోసం మూడు రెట్లు ఎక్కువగా ఖర్చు పెడుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. నిజానికి ప్రేక్షకులకు ఆశిష్ మొహం కొత్త కాబట్టి వకీల్ సాబ్ టైంలో థియేటర్స్ లో రౌడీబాయ్స్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆశిష్ రెడ్డి సరసన కుర్రభామ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మరి కొడుకు డెబ్యూ కోసం ఏ రేంజిలో బడ్జెట్ ప్లాన్ చేసారో.. టీమ్ చూస్తే అర్ధమవుతుంది. బెల్లంకొండ డెబ్యూ సినిమాకు కూడా స్టార్ హీరోయిన్ సమంతను తీసుకొచ్చారు. ఆ హీరో డెబ్యూకి సామ్ బాగా ప్లస్ అయింది. మరిప్పుడు ఆశిష్ కోసం అనుపమను ఎంపిక చేశారు. మరిప్పుడు ఈ హీరో విషయంలో అనుపమ ప్లస్ అవుతుందా లేదా చూడాలి.