బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన సి. కళ్యాణ్...!

Thu May 28 2020 19:40:57 GMT+0530 (IST)

C. Kalyan Reacts To Balakrishna's Comments!

టాలీవుడ్ సినీ పెద్దలు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల గురించి తనకు తెలియని ఈ రోజు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలయ్య మాట్లాడుతూ సినీ కార్మికులు అనేక కష్టాలు పడుతున్నారని దాని పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని.. అదేవిధంగా ప్రభుత్వంతో సినిమా పెద్దలు సంప్రదింపులు చేస్తున్న విషయం తనకు తెలియదని.. తాను కూడా అందరిలానే పేపర్ లో మీడియాలో చూశానని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత టాలీవుడ్ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర సీమలో బాలకృష్ణ ఇచ్చే గౌరవం ఎప్పుడూ ఇస్తామని.. బాలయ్యని నేను బ్రదర్ లాగా ఫీల్ అవుతుంటాను.. గత కొన్ని రోజులుగా చిత్రసీమలో జరుగుతున్న పరిణామాలను బాలకృష్ణ దృష్టికి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నానని కల్యాణ్ చెప్పారు.అంతేకాకుండా చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశానికి మంత్రి తలసాని లీడ్ తీసుకున్నారని.. సినిమా రంగంలో విభేదాలు లేవని.. మేమంతా ఒక్కటేనని సి. కళ్యాణ్ స్పష్టం చేశారు. ''నిన్నటి దాకా దాసరి నారాయణ రావు గారు భుజాన వేసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి భుజాన వేసుకోవచ్చు. చిరంజీవి గారి ఫేస్ వ్యాల్యూ పనికొస్తుందని ఆయనను మేం అడిగాం. అలాగే నాగార్జున గారు కూడా ముందుకు వచ్చారు. మీకు అవసరమైతే చెప్పండి నేను వస్తాను అని బాలకృష్ణ గారు అన్నారు. ఎక్కడికి ఎవరు అవసరమైతే వాళ్లను తీసుకెళ్తాం. ఎవరితో పని జరుగుతుందంటే వాళ్లను తీసుకెళ్తాం. షూటింగ్ లకు ఇబ్బందులు లేకుండా పని జరగడం మాకు ముఖ్యం. మేము ఏ పార్టీలకు సంబంధించిన వాళ్లం కాదు. తెలుగు సినిమా వాళ్లం'' అని కల్యాణ్ చెప్పుకొచ్చారు.

''గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాలయ్యతో పని జరుగుద్ది కాబట్టి అన్నిటికి ఆయన్ని ముందుడి తీసుకెళ్ళేవాళ్ళం. మాకు ఎవరితో పని జరిగుతుందో వాళ్లనే పిలుస్తాం.. అంతే తప్ప సినిమా ఇండస్ట్రీలో గ్రూపులు లేవు.. కావాలని బాలయ్యని పక్కన పెట్టలేదని.. బాలయ్య గారు వస్తానంటే ఎవరైనా కాదంటారా..? ఇండస్ట్రీకి మేలు జరిగే విషయంలో ఎవరు ముందుకు వచ్చి వారి భుజాన వేసుకొని నడిపించినా వారి వెంట మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం.. అయినా ఇది ఆర్టిస్టులను పిలిచే మీటింగ్ కాదు. నిర్మాతల సమావేశమని.. చిరంజీవి తన సినిమా షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వమని అడగడానికి లీడ్ తీసుకున్నారు'' అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టాలీవుడ్ కి రెండు కళ్ళు అని.. రెండు ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమకి సహకరిస్తున్నారని.. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఏపీ సీఎం జగన్ కలుద్దామని చెప్పారని కళ్యాణ్ వెల్లడించారు.