ఆ రెండు హిట్స్ తో 'డాన్' బ్యూటీ దశ తిరిగినట్టేనా?

Sun May 29 2022 07:00:01 GMT+0530 (IST)

priyanka arul mohan news update

ప్రియాంక అరుళ్ మోహన్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ సుందరి.. నటనపై ఉన్న మక్కువతో థియేటర్ ఆర్ట్స్ స్టేజ్ షోలు చేసింది. 2019లో `ఒంధ్ కథే హెళ్ల` అనే కన్నడ మూవీతో సినీరంగ ప్రవేశం చేసిన ప్రియాంకా.. నాని ‘గ్యాంగ్ లీడర్’ మూవీ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. ప్రియాంక మాత్రం తనదైన అందం అభినయం నటనతో ప్రేక్షకులను మిస్మరైజ్ చేసి యూత్ లో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.ఆ తర్వాత ప్రియాంకకు శర్వానంద్ సరసన `శ్రీకారం`లో నటించే అవకాశం దక్కింది. అయితే ఈ సినిమా కూడా ఆమెకు హిట్ అందించకపోవడంతో.. టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమె వైపు చూడలేదు. దాంతో కోలీవుడ్ కు మఖాం మార్చి.. అక్కడ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ తో కలిసి `డాక్టర్ (తెలుగులో వరుణ్ డాక్టర్)` అనే మూవీ చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది.

ఈ మూవీతో తొలి హిట్ ను ఖాతాలో వేసుకున్న ప్రియాంక.. ఆ వెంటనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో `ఎతర్కుమ్ తునింధవం(ఈటీ)`లో జతకట్టింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా.. ప్రియాంక నటనకు మరోసారి విమర్శకులు నుంచి ప్రశంసలు దక్కాయి. ఇక మొన్నీ మధ్య ఈ బ్యూటీ `డాన్(తెలుగులో కాలేజ్ డాన్)`తో అందరినీ పలకరించింది.

ఇందులోనూ శివ కార్తికేయన్ నే హీరో కాగా.. శిబి చక్రవర్తి దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా మే 13న విడుదలైన ఈ చిత్రం సూపర్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన చిన్న సినిమాల్లో ఒకటిగా కూడా డాన్ నిలిచింది. ఇక మొత్తానికి శివ కార్తికేయన్ ద్వారా రెండు హిట్స్ ను అందుకున్న ప్రియాంక దశ తిరిగినట్లే అని అంటున్నారు.

ప్రస్తుతం ఆమెకు కోలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయట. అందులో స్టార్ హీరో ధనుష్ ప్రాజెక్టు కూడా ఒకటని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఇకపై ప్రియాంక ఎంచుకునే కథల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే త్వరలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకోవడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.