ఉదయం షూటింగ్.. సాయంత్రం రాజకీయాలా?

Tue Jan 21 2020 16:28:45 GMT+0530 (IST)

power star pawan kalyan 26th movie pink remake shoot started

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు పడవల పయనం అభిమానులు సహా ఏపీ పొలిటికల్ కారిడార్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఓవైపు జనసేన కార్యకలాపాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు పింక్ రీమేక్ సెట్స్ లో కుస్తీ పడుతున్నారు. అయితే ఇందుకోసం ఆయన రోజు(24గంటల్ని)ను రెండుగా విభజించి ఒక్కో సమయాన్ని ఒక్కో పనికి కేటాయించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వర్సెస్ జనసేనాని పవన్ కల్యాణ్ అంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. పవన్ కొన్నాళ్ల గ్యాప్ తర్వాత పింక్ రీమేక్ `లాయర్ సాబ్` లో నటిస్తూ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నుంచే పవన్ పై షూటింగ్ మొదలైంది. మధ్యాహ్నం వరకూ పవన్ షూటింగ్ లోనే పాల్గొని అటుపై సెకండ్ షిప్ట్ లో ప్రొఫెషన్ మార్చేస్తున్నారు. తొలి రోజు తొలి కాల్షీట్ షూటింగ్ ను ముగించి.. సాయంత్రం అమరావతి రైతుల గురించి మీడియాతో మాట్లాడారు. ఉదయం సినిమాలు.. సాయంత్రం రాజకీయాలు! నడిపిస్తున్నారు. దీంతో జనసేనానిపై సోషల్ మీడియాలో ఒక సెక్షన్ జనం సెటైర్లు గుప్పించడం మొదలైంది. ఉదయం సినిమా షూటింగ్ లు.. సాయంత్రం రాజకీయాలకు సమయం కేటాయించారా సారూ? అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. అదీ గాక నిన్న ఆయన షూటింగులో పాల్గొన్న కొన్ని ఫోటోలు లీకవ్వడం కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టింది. ఉదయం షూటింగ్.. సాయంత్రం రాజకీయాలు...మధ్యలో మాజీ ముఖ్యమంత్రి హెరిటేజ్ కంపెనీకి పవన్ ప్రమోషన్ కార్యక్రమాలు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

రాజకీయాల కోసం ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ ఇప్పుడు అసలైన రాజకీయ ఉద్యమాలు మొదలైనప్పుడు సైలెంట్ గా పింక్ రీమేక్ ని మొదలు పెట్టడం ఏమిటో అంటూ ప్రశ్నల పరంపరం మొదలైంది. అమరావతి రైతులను అలా నడిసంద్రంలో వదిలేసి వెళ్లిపోతే ఎలా? అంటూ ఓ వర్గం పవన్ ని గట్టిగానే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇక పవన్ ఆన్ లొకేషన్ నడుచుకుంటూ వస్తోన్న ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ బోర్డు (షాప్ పై) కనిపించడం షాకిస్తోంది.

పవన్ బ్యాడ్ లక్ ఏంటో తెలియదు గానీ సరిగ్గా పవన్ ఉన్న పోస్టర్ లో ఆయనకు వెనకగా హెరిటేజ్ బోర్డ్ ఉండటంతో పవన్ వ్యతిరేక వర్గం గట్టిగానే చెలరేగుతున్నారు. పింక్ సినిమా షూటింగ్ కే ఇలాంటి షెడ్యూల్ వేసారా? లేక ప్రతి సినిమా షూటింగ్ షెడ్యూల్ ఇలాగే ఉంటుందా? అంటూ పవన్ పై తీవ్రమైన కామెంట్లు గుప్పిస్తున్నారు. కనీసం రాజధాని అంశంపై టాక్ నడుస్తున్న వేళ.. ఆ ఒక్క రోజు షూటింగ్ వాయిదా వేసుకున్నా లేక పవన్ ఒక్కరే హాజరు కాకపోయినా సరిపోయేదని.. మరీ ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ కామెంట్ లకు జనసేన కార్యకర్తలు.. అభిమానులు సరైన సమాధానాలు ఇవ్వలేక  సతమతమవ్వడం కనిపిస్తోంది.