Begin typing your search above and press return to search.

చిరు - గుణ కాంబోలో హ్యాట్రిక్ మూవీ ప్లాన్ చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   22 Sep 2021 1:30 AM GMT
చిరు - గుణ కాంబోలో హ్యాట్రిక్ మూవీ ప్లాన్ చేస్తున్నారా..?
X
'ఖైదీ నెం.150' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు.. మరో మూడు ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ తో త్వరలో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి - గుణశేఖర్ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. 'చూడాలని ఉంది' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. 'మృగరాజు' చిత్రం ప్లాప్ అయింది. అయితే ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ కాంబో సెట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కాకపోతే అది ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే చిరు - గుణశేఖర్ ఇతర ప్రాజెక్ట్స్ తో మరో రెండేళ్ల వరకు బిజీగా ఉంటారు.

చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' అనే పొలిటికల్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' రీమేక్. దీని తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్ లో 'భోళా శంకర్' సినిమా చేయనున్నాడు. ఇది తమిళ 'వేదాళమ్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. ఇదే క్రమంలో కేఎస్ రవీంద్ర (బాబీ) తో చిరు ఓ సినిమా చేస్తారు. ఇక మారుతి - వెంకీ అట్లూరి వంటి దర్శకులు కూడా మెగాస్టార్ తో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు గుణశేఖర్ ప్రస్తుతం 'శాకుంతలం' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. దీని తర్వాత రానా దగ్గుబాటి తో 'హిరణ్యకశ్యప' సినిమా చేయనున్నాడు. ఇక ఎప్పటి నుంచో 'ప్రతాపరుద్రుడు' అనే మరో భారీ ప్రాజెక్ట్ రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. చిరంజీవితో గుణశేఖర్ సినిమా చేసేది నిజమే అయితే.. 'ప్రతాపరుద్రుడు' కథ కోసం కలిసి వర్క్ చేస్తారేమో చూడాలి. రాబోయే రోజుల్లో చిరు - గుణశేఖర్ కాంబినేషన్ లో సినిమా గురించి క్లారిటీ వస్తుందేమో చూడాలి.