Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు తిరిగి సెట్స్ మీదకొచ్చిన 'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి'..!

By:  Tupaki Desk   |   3 July 2022 1:30 AM GMT
ఎట్టకేలకు తిరిగి సెట్స్ మీదకొచ్చిన ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి..!
X
యంగ్ హీరో నాగశౌర్య - మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో అప్పుడెప్పుడో ''ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'' అనే సినిమాని మొదలు పెట్టారు. అయితే శౌర్య దీని తర్వాత అనౌన్స్ చేసిన చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని, థియేటర్లలోకి వచ్చాయి కానీ.. ఈ ప్రాజెక్ట్ ఏ దశలో ఉందనేది ఎవరికీ తెలియలేదు.

నాగశౌర్య పుట్టినరోజు నాడు మాత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అనే సినిమా ఒకటుందని గుర్తు చేస్తూ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఒకానొక సమయంలో అసలు ఈ సినిమా ఉందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని దాదాపుగా పక్కనపెట్టేశారని రూమర్స్ వినిపించాయి.

ఈ నేపథ్యంలో ఎట్టకేలకు 'ఫలానా..' మూవీ షూటింగ్ కు సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుపుకుంటోందని తెలిపారు. ఈ షెడ్యూల్ లో లండన్ లోని అందమైన ప్రదేశాల్లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు వెల్లడించారు. హీరోహీరోయిన్లతోపాటు ప్రధాన తారాగణమంతా చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. విజయవంతమైన కాంబినేషన్ లో.. ప్రతిభ గల సాంకేతిక వర్గంతో కలసి ఈ చిత్రాన్ని రూపొందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు.

కాగా, నాగశౌర్య - డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల కలయికలో గతంలో 'ఊహలు గుసగుసలాడే' 'జ్యో అచ్యుతానంద' వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు వచ్చాయి. అలానే శౌర్య - మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం కూడా విజయం సాధించింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' మూవీ తెరకెక్కుతోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టి.జి.విశ్వప్రసాద్ - దాసరి పద్మజ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.