'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' నుంచి రొమాంటిక్ పోస్టర్ విడుదల...!

Wed Jul 29 2020 13:49:25 GMT+0530 (IST)

most eligible bachelor Romantic Look

అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు సిద్ శ్రీరామ్ ఆలపించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ 'మనసా మనసా' విశేష ఆదరణ పొందాయి. ఈ క్రమంలో మా బ్యాచిలర్ & బ్యాచిలరెట్ క్వారంటైన్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అంటూ ఒక రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.



కాగా ఈ పోస్టర్ లో మన బ్యాచిలర్ అఖిల్ అక్కినేని సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ లాప్ టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటుండగా.. అతని బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్న పూజాహెగ్డే తన కాలితో అఖిల్ చెవిని తాకిస్తూ కనిపించింది. దీంతో ఈ సినిమాలో యువతికి నచ్చే రొమాంటిక్ ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయని తెలుస్తోంది. అఖిల్ - పూజాహెగ్డే మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరినట్లు అర్థం అవుతోంది. ఈ మూవీలో బొమ్మరిల్లు భాస్కర్ గత చిత్రాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం.

ఇదిలా ఉండగా రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు లేటెస్టుగా రిలీజ్ చేసిన పోస్టర్ తో ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా ఫలితంపై అక్కినేని అఖిల్ తో పాటు డైరెక్టర్ 'బొమ్మరిల్లు' భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అక్కినేని ఫ్యాన్స్ సైతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో అఖిల్ సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.