Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ తరువాత రాజమౌళితోనే .. క్లారిటీ ఇచ్చిన మహేశ్ బాబు!

By:  Tupaki Desk   |   25 Sep 2021 2:30 PM GMT
త్రివిక్రమ్ తరువాత రాజమౌళితోనే .. క్లారిటీ ఇచ్చిన మహేశ్ బాబు!
X
మహేశ్ బాబు .. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో చారిత్రక కథాంశాన్ని టచ్ చేసిన రాజమౌళి, ఆ తరువాత పౌరాణిక కథాంశాన్ని ఎంచుకోనున్నాడనే ప్రచారం జరిగింది. చారిత్రకాలు .. పౌరాణికాలు మన వంటికి పడవు అనే విషయాన్ని ఎప్పుడో చెప్పేసిన మహేశ్ బాబు, రాజమౌళి సినిమా చేసే ఛాన్స్ లేదని చెప్పుకున్నారు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో అసలు సినిమా ఉందా? లేదా? అనే అయోమయం తలెత్తింది. తాజాగా ఈ సందేహానికి మహేశ్ బాబు తెర దించేశాడు.

మహేశ్ బాబు నిన్న ఒక స్టార్ హోటల్లో తన అభిమానులతో సమావేశమయ్యాడు. తన సినిమాలకి సంబంధించిన విషయాలను వాళ్లతో పంచుకున్నాడు. "సాధారణంగా నేను ఒకే సిట్టింగులో కథను ఓకే చేసిన సందర్భాలు చాలా తక్కువ. కానీ పరశురామ్ 'సర్కారువారి పాట' కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పేశాను. ఈ సినిమా 'పోకిరి' సినిమాను మించి ఉంటుంది. పూరి శిష్యుడు కనుక పరశురామ్ కూడా అదే స్టైల్లో ఈ సినిమాను చేస్తున్నాడు. ఆ తరువాత సినిమా త్రివిక్రమ్ తో ఉంటుంది .. అది పూర్తయిన తరువాత రాజమౌళితో కొత్త ప్రాజెక్టు మొదలవుతుంది" అని చెప్పాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసే సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అవినీతి రాజకీయాలను ఎదిరించే పౌరుడిగా మహేశ్ బాబు ఈ సినిమాలో కనిపించనున్నాడు. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇక కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని చెబుతున్నారు. ఇక రాజమౌళి సినిమా కంటెంట్ ఏమిటనే విషయం పక్కన పెడితే, ఆయనతో చేయడం ఖాయమైపోయిందని మహేశ్ క్లారిటీ ఇచ్చేశాడు.

అయితే ఆల్రెడీ మహేశ్ బాబుకి 'సరిలేరు నీకెవ్వరు' హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి కొంతకాలం క్రితం మాట్లాడుతూ, తమ కాంబినేషన్లో మరో సినిమా ఉండనుందని చెప్పాడు. తాను వినిపించిన కథ మహేశ్ బాబుకు బాగా నచ్చిందని కూడా అన్నాడు. ఇక మహేశ్ బాబు కోసం మరో కథను సిద్ధం చేశాననీ, త్వరలో ఆయనతో ఓ ప్రాజెక్టు మొదలవుతుందని ఆయనతో 'మహర్షి' చేసిన వంశీ పైడిపల్లి చెప్పాడు. కానీ ఇప్పుడు మహేశ్ బాబు చెప్పిన ప్రకారం చూసుకుంటే, ఎవరైనా సరే మరో మూడేళ్ల వరకూ వెయిట్ చేయవలసిందేననే విషయం అర్థమైపోతోంది.