పవన్ కు త్రివిక్రమ్..మహేష్ కు అతనా?

Sun Jan 19 2020 07:00:08 GMT+0530 (IST)

mahesh Babu on about his Diectors

కొందరు హీరోలకు కొందరు దర్శకులతో లంకె కుదురుతుంది. ఇద్దరి మధ్య బంధం హీరో-దర్శకుడు స్థాయిని మించుతుంది. వ్యక్తిగతంగానూ మిత్రులవుతారు. చాలా సన్నిహితంగా కనిపిస్తారు. టాలీవుడ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది అలాంటి బంధమే. ‘జల్సా’ సినిమాతో తొలిసారి జత కట్టిన ఈ ఇద్దరూ ఎంత క్లోజ్ అయిపోయారో తెలిసిందే. ఇప్పటిదాకా వీళ్లిద్దరూ మూడు సినిమాలు చేయగా.. వాటి మేకింగ్ టైంలో గడిపిన సమయం కంటే బయట వ్యక్తిగతంగా కలిసిన సమయం ఎక్కువ ఉంటుంది. పవన్‌కు వ్యక్తిగత రాజకీయ విషయాల్లోనూ త్రివిక్రమ్ సలహాదారుగా వ్యవహరిస్తుంటాడని వాళ్ల సన్నిహితులు చెబుతుంటారు.టాలీవుడ్లో ఇలాంటి బంధాలు మరికొన్ని ఉన్నాయి. ఆ జాబితాలోకే చేరేలా ఉంది మహేష్-వంశీ పైడిపల్లి జోడీ. మహేష్ మామూలుగా ఒక సినిమా చేసే వరకే ఏ దర్శకుడితో అయినా సన్నిహితంగా ఉంటాడు. తర్వాత వాళ్లకు దూరమైపోతుంటాడు. పూరి జగన్నాథ్ శ్రీను వైట్ల త్రివిక్రమ్ లాంటి దర్శకులతో ఇలాగే ఒకానొక సమయంలో క్లోజ్‌గా ఉన్నాడు. తర్వాత వాళ్లకు దూరం అయిపోయాడు. ఐతే వంశీ పైడిపల్లితో మాత్రం మరే దర్శకుడితో లేని స్థాయిలో చాలా క్లోజ్‌గా ఉంటుండటం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ‘మహర్షి’తో తొలిసారి వీళ్లిద్దరూ జత కట్టారు. ఆ సినిమా మేకింగ్ టైంలో రిలీజ్ సమయంలో వంశీతో చాలా సన్నిహితంగా ఉన్నాడు మహేష్.

ఐతే ఆ సినిమా బాక్సాఫీస్ రన్ ముగిశాక కూడా స్నేహం కొనసాగించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మహేష్ ఫారిన్ టూర్‌లోనూ వంశీని వెంటబెట్టుకెళ్లాడు. అతడి కొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’కు సంబంధించిన పార్టీలు వేరే కార్యక్రమాల్లోనూ వంశీ దర్శనమిస్తున్నాడు. కలిసి తిరుమలకు వెళ్లారు. వంశీ కూతురు ఆధ్య.. మహేష్ తనయురాలు సితారతో బాగా క్లోజ్ అయింది. ఇద్దరూ కలిసి మహేష్‌ను తాజాగా ఇంటర్వ్యూ చేయడం విశేషం. మహేష్ వంశీ కలిసి మరో సినిమా చేయబోతున్న మాట వాస్తవమే కానీ.. వాళ్లది సినిమా బంధానికి మించి అనిపిస్తోంది. పవన్‌కు త్రివిక్రమ్ లాగే.. మహేష్‌కు వంశీ బాగా క్లోజ్ అయి.. వ్యక్తిగతంగానూ వీళ్లిద్దరూ ఆప్తమిత్రులు అయిపోయినట్లు అనిపిస్తోంది.