Begin typing your search above and press return to search.

గోడు ఆలకించి గూడు కల్పించండి: కందికొండ కూతురు కన్నీటి లేఖ

By:  Tupaki Desk   |   5 Dec 2021 9:30 AM GMT
గోడు ఆలకించి గూడు కల్పించండి: కందికొండ కూతురు కన్నీటి లేఖ
X
తెలుగు సినిమా పాటకు మరింత వన్నెలు అద్దిన .. సొగసులు దిద్దిన పాటల రచయితగా కందికొండ కనిపిస్తారు. పాటలు రాయడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకుంటూ వెళుతున్నారు. సాహిత్యం పరంగా కూడా ఇక్కడ గట్టిపోటీనే కనిపిస్తుంది. ఆ పోటీని తట్టుకుని నిలబడాలంటే అందుకు ఎంతో ప్రతిభ అవసరం .. మరెంతో అంకితభావం అవసరం. అలా తేలికైన పాదాలతో .. అందరూ హాయిగా పాడుకునే పదాలతో పాటలను పరుగులు తీయించిన రచయితగా కందికొండ కనిపిస్తారు.

'రామా రామా రామా' ( శివమణి) 'మళ్లి కూయవే గువ్వా' (ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం) 'చెన్నై చంద్రమా' (అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి) 'గల గల గల పారుతున్న సెలయేరులా' ( పోకిరి) 'గుండె గోదారిలా'( మస్కా) వంటి మనసు దోచుకునే పాటలు ఆయన కలం నుంచి వెలువడినవే. అలాంటి పరిమళించే పాటలను వెదజల్లిన ఆయన కలం కొంతకాలంగా నిదరపోతోంది. అనారోగ్యం కారణంగా కందికొండ మంచంలోనే ఉన్నారు. దాంతో ఆయన కుటుంబం ఆర్ధికంగా చాలా ఇబ్బందులను పడుతోంది .. సమస్యలతో సతమతమైపోతోంది.

ప్రస్తుతం హైదరాబాద్ - 'మోతీ నగర్' లో ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఆయన కుటుంబం ఉంది!. దాంతో తమని ఆదుకోవలసిందిగా కందికొండ కూతురు కేటీఆర్ కి విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ రాశారు. "నాన్న ప్రాణాపాయ స్థితిలో 'కిమ్స్' హాస్పిటల్లో ఉన్నప్పుడు పెద్దమనసుతో ఆదుకున్నారు. 40 రోజుల పాటు ఆయనకి ప్రత్యేకమైన వైద్యం అందేలా చూశారు. ఆ తరువాత ఆయన వెన్నెముక శస్త్ర చికిత్స కోసం 'మెడికవర్'లో చేరినప్పుడు కూడా మీరు అందించిన సహాయ సహకారాలు మరిచిపోలేనివి. ఇప్పుడు నాన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

అయితే మా కుటుంబాన్ని ఆర్ధిక పరమైన ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నెలతో ఇల్లు ఖాళీ చేయమని అంటున్నారు. ఎక్కడికి వెళ్లాలో .. ఏంచేయాలో తెలియని పరిస్థితి. 'చిత్రపురి కాలనీ'లో సొంత ఇంటి కోసం అప్పట్లో నాన్న 4.05 లక్షలు చెల్లించాడు. ఆ తరువాత ఆర్థికపరమైన ఇబ్బందులతో మిగతాది చెల్లించలేకపోయాము. అక్కడ మాకు నివాసం కల్పించండి .. లేదంటే మరెక్కడైనా ఏర్పాటు చేయండి. సాధ్యమైనంత త్వరగా చొరవ చూపించండి సార్. కేసీఆర్ గారి నుంచి కూడా తగిన సాయం కోసం ఎదురుచూస్తున్నాము" అంటూ ఓ లేఖ రాశారు. దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.