కరోనా కష్టాల్లోనూ హీరోయిన్లు రేట్లు పెంచేశారా..?

Tue Sep 21 2021 23:00:01 GMT+0530 (IST)

heroines increased the remuneration

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ని దేశాలు దీన్ని గాడిలో పెట్టే పనిలో ఉన్నాయి. మన దేశం విషయానికి వస్తే కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల దగ్గర నుంచీ పెట్రోల్ - డీజిల్ వరకు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఈ వైరస్ సినీ ఇండస్ట్రీకి కూడా చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. దీని ప్రభావం వల్ల చిత్ర పరిశ్రమ కనీవినీ ఎరగని నష్టాలను చవి చూసింది. అయితే మెల్లిగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ పుంజుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది.అయితే పాండమిక్ తర్వాత నిత్యావసర వస్తువుల రేట్లు ఎలా పెరిగాయో.. ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ల రేట్లు కూడా అమాంతం పెంచేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదేంటని అడిగితే.. గత రెండేళ్లుగా సినిమాలు లేవు కాబట్టి అందుకే ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచుతున్నామని డిక్లేర్ చేస్తున్నారట. ఓవైపు థియేట్రికల్ బిజినెస్ పెద్దగా జరగకపోవడం.. మరోవైపు ఓటీటీలో అంతంత మాత్రంగానే రాబడి వస్తున్న సమయంలో హీరోయిన్లు రేట్లు పెంచేయడం ఇబ్బందిగా ఉందని నిర్మాతలు వాపోతున్నారట.

వాస్తవానికి గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీ పై కరోనా ప్రభావం వలన నిర్మాతలు చాలా నష్టపోయారు. సినిమా షూటింగులు మధ్యలోనే ఆగిపోయి.. చిత్రీకరణ పూర్తైన సినిమాలను రిలీజ్ చేసుకోలేక.. ఫైనాన్స్ కు తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టుకోలేక నిర్మాతలు చాలా కష్టనష్టాలను అనుభవించారు. ఇప్పుడు సినిమా షూటింగులు మొదలై థియేటర్లు తెరుచుకొని మెల్లిగా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నా.. ప్రొడ్యూసర్స్ కు వచ్చే రెవెన్యూ నామమాత్రంగానే ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ హీరోయిన్లు తమ పారితోషకాలను పెంచడం.. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అవుతోంది. నిజానికి కరోనా విపత్కర పరిస్థితుల్లో నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న నిర్మాతలకు అండగా నిలబడటానికి.. హీరోయిన్లు స్వచ్ఛందంగా రెమ్యూనరేషన్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకొని బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మన హీరోయిన్లు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా కోట్లకు కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. నిర్మాత అనేవాడు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుండేది.. వీళ్ళు బాగుండేది అనేది ఇక్కడ హీరోయిన్లు గుర్తు పెట్టుకుంటే మంచిది.