బెజవాడ మీటింగ్ లో 13 జిల్లాల ఎగ్జిబిటర్లు ఏం తేల్చారు?

Thu Jul 29 2021 17:00:10 GMT+0530 (IST)

exhibitors from 13 districts conclude in the Bejawada meeting

బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా విజయవాడ-(ఏపీ)లో 13 జిల్లాల ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. కరోనా క్రైసిస్ నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా నెలలుగా మూత పడి ఉండడంతో కునారిల్లుతున్న ఎగ్జిబిషన్ రంగంపై ఏం చర్చించారు? ఇంతకీ ఈ సమావేశంలో ఏం తీర్మానించారు? అంటే..విజయవాడలోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో 13జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశానికి అన్ని ప్రాంతాల నుంచి ధియేటర్ ల యజమానులు హాజరయ్యారు. ఈనెల 30 నుంచి థియేటర్లను తెరవాలని నిర్ణయించారు. అయితే 50 శాతం ఆక్యూపెన్సీ తో తమకు నష్టాలు తప్పవనేది చర్చకు వచ్చింది. టిక్కెట్టు ధర చాలా తక్కువ. ఇప్పుడున్న ధరలతో తమకు తీవ్ర నష్టాలు తప్పవని నివేదించారు.

బి- సి కేంద్రాల్లో థియేటర్లు తెరిచినా జీవో 35వల్ల మనుగడ కష్టం. అందువల్ల టిక్కెట్టు ధరల పెంపుపై జగన్ ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే సీఎంని కలుస్తారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రిలీజ్ చేయనున్నారు. ఏపీ ఫిలింఛాంబర్ నుంచి అన్ని జిల్లాల ఎగ్జిబిటర్లకు దీనిపై సమాచారం అందింది.

మరోవైపు ఏపీలో టిక్కెట్టు ధరల పెంపుపై తెలంగాణ ఫిలింఛాంబర్ ఇంతకుముందే ఏపీ ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులు ఒక మెమోరండాన్ని పంపారు. కానీ దానిపై ఏపీ ప్రభుత్వం పాజిటివ్ గా స్పందించలేదు. టిక్కెట్టు ధరలపై మొండి పట్టు వీడలేదు.