అందుకే సందీప్ కి దూరంగా ఉన్నాను: చోటా.కె నాయుడు

Mon Mar 01 2021 10:00:01 GMT+0530 (IST)

chota k naidu Speech At A1 Express Pre Release Event

సందీప్ కిషన్ తాజా చిత్రంగా 'A1 ఎక్స్ ప్రెస్' నిర్మితమైంది. ఈ సినిమా ద్వారా డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మార్చి 5వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి ఘనంగా జరిగింది. హీరో రామ్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం మొదలైంది. ప్రముఖ సినిమాటో గ్రఫర్ చోటా.కె నాయుడు ఈ సినిమాను గురించి మాట్లాడారు.ముందుగా ఆయన ముఖ్య అథితిగా వచ్చిన రామ్ ను పలకరించారు. "రామ్ .. నాకు ఎప్పుడూ డల్ గా అనిపించినా నీ ఫస్టు ఫిల్మ్ లోని సాంగ్ చూసేవాడిని. ఇక ఈ మధ్య కాలంలో డల్ గా అనిపిస్తే నీ సినిమా చూస్తున్నాను. నా ఎనర్జీ నువ్వే .. నువ్వు ఎప్పుడూ ఇంతే ఎనర్జీతో ఉండాలి" అన్నారు. ఆ తరువాత సందీప్ కిషన్ గురించి ప్రస్తావించారు. "మీరంతా కూడా సందీప్ కిషన్ నాతో పనిచేయడం లేదని అనుకుంటున్నారు. కానీ నేనే ఆయనకి దూరంగా ఉంటూ వచ్చాను. కొంతకాలం పాటు సెపరేటు సెపరేటుగానే ఉందాంరా అని నేనే అన్నాను.

ఎందుకంటే సందీప్ కిషన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు .. కానీ వాళ్ల మావ ఉన్నాడుగా అనే టాక్ వచ్చేసింది. దాంతో సందీప్ కి రావలసిన క్రెడిట్ రావడం లేదు. కనీసం నేను కొంతకాలం పాటు దూరంగా ఉంటే తనకి ప్లస్ అవుతుందని అనుకున్నాను. అందువల్లనే నేను దూరంగానే ఉంటూ వచ్చాను. నిజం చెబుతున్నాను .. ఈ సినిమా గురించి కూడా నాకు ముందుగా తెలియదు. ఇక్కడికి వచ్చాకే ఈ సినిమా గురించిన కొన్ని విషయాలు తెలిశాయి. సందీప్ కాస్త సన్నబడి మంచి ఫిట్ నెస్ తో ఈ సినిమాలో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇకపై అదే ఫిట్ నెస్ ను మెయింటేన్ చేయాలి" అంటూ అతని దగ్గర నుంచి ప్రామిస్ తీసుకోవడం విశేషం.