Begin typing your search above and press return to search.

'మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను'.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్..!

By:  Tupaki Desk   |   22 Sep 2022 7:18 PM GMT
మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్..!
X
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరు.. తన స్వయంకృషితో అగ్ర స్థానంలో నిలిచారు. కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇదే క్రమంలో తన ఫ్యామిలీ నుంచి ఎంతో మందిని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు.

అయితే సెప్టెంబర్ 22 అనేది చిరంజీవి సినీ కెరీర్ లో ఎప్పటికీ గుర్తిండిపోయే రోజు. ఆయన నటించిన ''ప్రాణం ఖరీదు" సినిమా విడుదలై 44 ఏళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో తనని ఆదరించిన ప్రేక్షకులు.. ఈ స్థాయికి ఎదగడానికి ప్రోత్సహించిన వారికి మరియు అభిమానులకు చిరు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

"మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టిన రోజు ఈ రోజు (1978, సెప్టెంబరు 22). 'ప్రాణం ఖరీదు' చిత్రంతో ప్రాణం పోసి.. ప్రాణప్రదంగా.. నా ఊపిరై.. నా గుండె చప్పుడై.. అన్నీ మీరే అయి 44 ఏళ్లు నన్ను నడిపించారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తోన్న ప్రేక్షకాభిమానుల ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను" అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

నిజానికి చిరంజీవి నటించిన తొలి చిత్రం 'పునాది రాళ్లు'. అయితే ఆ తర్వాత చేసిన 'ప్రాణం ఖరీదు' ముందుగా విడుదలైంది. శివ శంకర వరప్రసాద్ ని 'చిరంజీవి' గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇందులో నరసింహ అనే పాత్రలో చిరు కనిపించారు. కె.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు గోపాలరావు - జయసుధ - చంద్రమోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

చిరంజీవి తొలిసారిగా నటించిన 'పునాది రాళ్లు' సినిమా.. 'మన ఊరి పాండవులు' 'కుక్క కాటుకు చెప్పు దెబ్బ' 'కొత్త అల్లుడు' 'ఐ లవ్ వ్యూ వంటి చిత్రాల తర్వాత విడుదలవ్వడం గమనార్హం.

ఇకపోతే మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన కెరీర్ లో 153వ చిత్రంగా తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అలానే చిరంజీవి హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. దీనికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి విడుదల చేయనున్నారు.

ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' అనే కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు చిరు. ఇది 2023 సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్టులు మెగా లైనప్ లో ఉన్నాయి. వెంకీ కుడుములతో ఇప్పటికే ఓ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అలానే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు మెగాస్టార్ తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.