అక్కినేని నందమూరి గొడవేంటి?

Mon Jan 23 2023 22:21:16 GMT+0530 (India Standard Time)

balakrishna comments on akkineni

తెలుగు సినిమాకు నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావులను రెండు కళ్లుగా చెబుతుంటారు. వీళ్లిద్దరి మధ్య నటులుగా ఎంత పోటీ ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా మంచి స్నేహంతోనే మెలిగారు. ఎన్టీఆర్ సినీ రంగంలో కొనసాగినంత వరకు ఇద్దరూ మంచి మిత్రులే. ఎన్టీఆర్ ఏఎన్నార్‌ల పిల్లల మధ్య కూడా అన్నదమ్ముల భావన ఉండేది. అందరూ సన్నిహితంగానే మెలిగేవారు. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక ఏఎన్నార్‌తో ఎందుకో చెడింది. ఈ విషయాన్ని ఏఎన్నార్ బహిరంగంగానే ఒప్పుకున్నారు.ఎన్టీఆర్‌తో విభేదాల గురించి గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో ఓపెన్ అయ్యారు కూడా. ఐతే ఈ గొడవ ఎలా ఉన్నప్పటికీ.. బాలయ్య ఒక దశ వరకు ఏఎన్నార్‌తో ఆయన కుటుంబ సభ్యులతో సన్నిహితంగానే ఉన్నారు. ఏఎన్నార్‌ను బాలయ్య బాబాయి అని సంబోధించేవారన్న సంగతి కూడా తెలిసిందే. నాగచైతన్య అరంగేట్ర సమయంలో బాలయ్య ముఖ్య అతిథిగా హాజరై ఏఎన్నార్‌తో సన్నిహితంగా మెలిగిన సంగతి కూడా తెలిసిందే.

కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. ఏఎన్నార్ ఆయన తనయుడు నాగార్జునతో బాలయ్యకు దూరం పెరిగింది. ఆ దూరం ఎంతగా అంటే.. అక్కినేని అస్తమించినపుడు చివరి చూపు చూడడానికి కూడా బాలయ్య రాలేదు. కనీసం సంతాప సందేశం కూడా మీడియాకు రిలీజ్ చేయలేదు.

తన తండ్రికి ఒకప్పుడు ఆప్త మిత్రుడు తాను బాబాయిగా పిలుచుకునే వ్యక్తి ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన ఏఎన్నార్ చనిపోతే చివరి చూపు చూడడానికి కూడా బాలయ్య రాలేదంటే అంతగా ఏం గొడవ జరిగిందో ఏమో? మరోవైపు నాగార్జునతోనూ బాలయ్య దూరం దూరం అన్నట్లే ఉంటున్నాడు చాలా ఏళ్లుగా. నాగ్ సైతం బాలయ్య ఊసే ఎత్తడానికి ఇష్టపడడు.

ఆయన్ని కలవడు. బాలయ్య రెండో కూతురి పెళ్లికి కూడా నాగ్ హాజరు కాకపోవడం గమనార్హం. తాజాగా బాలయ్య.. ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో ‘అక్కినేని తొక్కినేని’ అనే మాట అనడంతో మరోసారి అక్కినేని ఫ్యామిలీతో బాలయ్య విభేదాల గురించి చర్చ మొదలైంది. అసలే వీరి మధ్య ఏం గొడవ జరిగిందన్న ప్రశ్నలు తలెత్తుతోంది. కానీ ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం తెలియడం లేదు. మరి దీని గురించి క్లారిటీ ఇచ్చేదెవరో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.