Begin typing your search above and press return to search.

సంక్రాంతికి బావ ఇంటికి వెళ్లిన బాలయ్య ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   14 Jan 2022 5:25 AM GMT
సంక్రాంతికి బావ ఇంటికి వెళ్లిన బాలయ్య ఫ్యామిలీ
X
సంవత్సరంలో అతి పెద్ద పండుగగా.. తెలుగు వారు ఎక్కడున్నా.. తమ మూలాల్ని గుర్తు పెట్టుకొని వెళ్లేందుకు ఆసక్తి చూపేది సంక్రాంతి వేళలోనే. పిల్లలకు సెలవులు ఉండటం.. పెద్దలకు సైతం మూడు రోజులు సెలవులు రావటం..దానికి అదనంగా ఒకట్రెండు రోజులు కలుపుకోవటం ద్వారా.. ఒక వారం తాము పుట్టి.. పెరిగిన ఊరికి కేటాయించే అలవాటు ఈ పండుగ వేళ ఉంటుంది. ఎవరు.. ఎక్కడ.. ఏ స్థాయిలో ఉన్నా.. సంక్రాంతి పండక్కి ఊరికి వెళ్లటం మాత్రం ఒక అలవాటుగా మారింది. పాడు కరోనాతో ఈసారి ఆ ఊపు.. హుషారు కాస్త తగ్గినా.. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఊరెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. గత ఏడాది అఖండతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి బాలకృష్ణ మంచి హుషారుతో ఉన్నారు.

తాజాగా లభించిన విజయం ఆయన్ను మరింత యాక్టివ్ అయ్యేలా చేసింది. సినిమా రికార్డుల్ని బద్ధలు కొట్టటమే కాదు.. ఇటీవల కాలంలో ఎంత తోపు సినిమా అయినా రెండు వారాలు లేదంటే మూడు వారాలు మాత్రమే థియేటర్లలో ఆడే పరిస్థితి. అలాంటిది ఏకంగా ఏడు వారాలుగా థియేటర్లలో ఆడుతూ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తుంది. ఇక.. బాలయ్య విషయానికి వస్తే.. సంక్రాంతి పండుగ వేళ.. బావ గారిల్లైన కారంచేడు (ప్రకాశం జిల్లాలోని చీరాలకు అత్యంత సమీపంలో ఉంటుంది)కు కుటుంబ సమేతంగా వచ్చారు.

బాలయ్య అక్కడ పెద్దమ్మ అలియాస్ పురందేశ్వరి భర్త ఊరు కారంచేడు. నందమూరి కుటుంబానికి చెందిన జయక్రిష్ణ.. మరికొందరికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి జరపుకోవటం ఒక ఆనవాయితీగా వస్తోంది. దీన్ని కంటిన్యూ చేస్తూ.. బాలయ్య సతీమణి వసుంధర క్రమం తప్పకుండా కారంచేడుకు వచ్చేవారు. బాలయ్య మాత్రం ఈ మధ్యన రావటం లేదు.

బాలకృష్ణ తన చిన్నతనంలో ఎక్కువ భాగం కారంచేడులోనే గడిపారని.. సెలవుల్లో ఎక్కువగా ఇక్కడే ఉండేవారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో పాటు.. మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అదేమంటే.. రాజకీయంగా తమ మధ్య విభేదాల్ని మర్చిపోయి.. పండుగ వేళల్లో.. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు నందమూరి కుటుంబం మొత్తం ఒకటిగా మారుతుంది. ఆ టైంలో రాజకీయాల్ని వారు పక్కన పెట్టేస్తారని చెబుతారు. అంతేకాదు.. నందమూరి కుటుంబంలో పురందేశ్వరి మాటకు ఎక్కువ విలువ ఇస్తారన్న మాట వారి సన్నిహితుల నోట వినిపిస్తూ ఉంటుంది.

గతానికి భిన్నంగా ఈసారి మాత్రం సతీమణితో సహా కారంచేడుకు వచ్చారు. దీంతో.. గ్రామంలో పండుగ వాతావరణం మరింత ఎక్కువగా మారింది. బాలయ్యను చూసేందుకు గ్రామస్తులు.. అభిమానులు పెద్ద సంఖ్యలో దగ్గుబాటి ఇంటికి చేరుకున్నారు. అయితే.. ఇప్పుడున్నకరోనా నేపథ్యంలో.. ఎవరిని ఇంటి లోపలకు అనుమతించలేదు. ఇదొక్క నిరాశ తప్పించి.. తమ ఊరికి బాలయ్య వచ్చారన్న సంతోషంతో పొంగిపోతున్నారు కారంచేడు గ్రామస్తులు. ఇక.. పండుగ చివరి రోజు.. తన మరో బావ కమ్ వియ్యంకుడైన చంద్రబాబు సొంతూరు కుప్పంలోని నారావారి పల్లెకువెళతారా? లేదా? అన్నది తేల్లేదు.