Begin typing your search above and press return to search.

నానీకి వందేళ్ల నాటి టెంపుల్.. శేష్ కి తాజ్ హోట‌ల్!

By:  Tupaki Desk   |   22 April 2021 7:34 AM GMT
నానీకి వందేళ్ల నాటి టెంపుల్.. శేష్ కి తాజ్ హోట‌ల్!
X
ప‌రిశ్ర‌మ‌లో ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ల‌ ప్రాధాన్య‌త అంత‌కంత‌కు పెరుగుతోంది. పెరుగుతున్న సాంకేతిక‌త‌కు త‌గ్గ‌ట్టే ఈ రంగంలో నాలెజ్ ఉన్న‌వారికి అవ‌కాశాల‌కు కొద‌వేమీ లేదు. విశేష ప‌రిజ్ఞానం సాంకేతికాంశాలు చొర‌వ ఇక్క‌డ అవ‌కాశాలు తెస్తుంటాయి. ఇక ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేటిత‌రం లో ట్యాలెంటెడ్ డిజైన‌ర్ గా టాలీవుడ్ లో దూసుకెళుతున్నారు. ఇంత‌కుముందు మ‌హా న‌టి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి అత‌డు ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్. ఇప్పుడు అడివి శేష్ నటిస్తున్న‌ మేజర్.. నాని న‌టిస్తున్న శ్యామ్ సింఘ‌రాయ్ చిత్రాల‌కు ఆయ‌న ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ గా ప‌ని చేస్తున్నారు. వాటికి సంబంధించిన వివ‌రాలు తెలిపారు.

జాతీయ అవార్డు గెలుచుకున్న మహానటి తో పాటు ఎన్నో చిత్రాల కోసం పనిచేసిన ప్రొడ‌క్ష‌న్ డిజైనర్ అవినాష్ కొల్లా మేజ‌ర్ చిత్రం కోసం ఆరు సెట్లను నిర్మించారు. వీటిలో ఒకటి గేట్వే ఆఫ్ ఇండియా..మరొకటి ఎన్‌.ఎస్.జీ కమాండోస్ సెటప్.. కూడా ఉన్నాయి. హైద‌రాబాద్ లోని ఒక ప్రైవేట్ స్టూడియోలో వీటిని నిర్మించారు. 26 నవంబర్ 2008 న ఉగ్రవాదులు దాడి చేసిన తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సెట్ ని కూడా ఆయ‌న నిర్మించారు.

*అడివి శేష్ నటిస్తున్న `మేజర్` నుంచి ఇటీవ‌ల విడుదల చేసిన టీజర్ అన్ని వ‌ర్గాల్ని ఆక‌ర్షించింది. నవంబర్ 2008 ముంబై దాడుల సమయంలో అమరవీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. శ‌శి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నారు. టీజ‌ర్ వ‌చ్చాక‌.. ఈ సినిమా కథాంశం స‌హా మేకింగ్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది.

*మేజ‌ర్ కి తాజ్ హోట‌ల్ చాలా ఇంపార్టెంట్. అయితే హోటల్ వద్ద షూట్ చేయడానికి అనుమతి ఇవ్వనందున సెట్ అవసరం అయ్యింది. ఈ సెట్ ను నిర్మించడానికి 500 మంది 10 రోజులకు పైగా పనిచేశారు.

*బాలీవుడ్ లో కొంతమంది చిత్రనిర్మాతలు తాజ్ హోటల్ సెట్ ను నిర్మించినా ఇన్నేళ్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఇంత సమగ్రమైన ఆర్ట్ తో ఉన్న‌దున్న‌ట్టు నిర్మించడం ఇదే మొదటిసారి. తాజ్ హోట‌ల్ కొలతలు తీసుకునేందుకు నిర్మాణాలను గమనించడానికి నేను నా బృందం హోటల్ లో నాలుగు రోజులు గడిపాం. రియాలిటీకి దగ్గరగా ఉండటానికి హోటల్ లో ఉన్న సమయంలో ప్రతి నిమిషం అక్క‌డ విష‌యాల్ని గమనించాం. దానిపై గంట‌ల కొద్దీ స‌మ‌యం పరిశోధనలు చేసాం.

*శేష్ నాకు ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పారు. సెట్స్ లోనే షూట్ అంతా. రియ‌ల్ భావోద్వేగాలను ఈ సెట్స్ లోనే ఎలా తీయాలి? అన్న‌ది ఆలోచించాం అని అవినాష్ వివ‌రించారు. య‌థాత‌థంగా అక్క‌డ ఉన్న‌ట్టే మేం కళాఖండాలు- పెయింటింగ్స్- ఫిక్చర్స్ .. ఫర్నిచర్ ప్ర‌తిదీ త‌యారు చేశాం. ఈ సెట్ ప్రామాణికమైనదిగా కనిపించాలని మేము కోరుకున్నాం. గ్రాండ్ మెట్ల రూపం.. టాటా విగ్రహం .. M.F. హుసేన్ జీ కొన్ని ఐకానిక్ పెయింటింగ్స్ కూడా ఈ సెట్లో ఉన్నాయి. హుస్సేన్ చిత్రాల‌ను పునః సృష్టి చేశాం.

*ఈ సెట్ కూడా ఈ చిత్రంలో ఒక పాత్ర. శోధ‌న వివ‌రాలు హోటల్ వాతావరణానికి ప్రాణం పోశాయి. హోటల్ ఐదు అంతస్తులకు త‌గ్గ‌ట్టు 120 అడుగుల ఎత్తైన భవనాన్ని నిర్మించడానికి తయారీదారులు కలప- ఫైబర్ .. ఇనుమును ఉపయోగించారు. బెంగాలీ కార్మికులు ప్రామాణికతకు ప్ర‌య‌త్నిస్తారు.

*ఏకకాలంలో మరో చిత్రం కోసం ప‌ని చేశాను. నాని నటించిన శ్యామ్ సింఘా రాయ్ పీరియడ్ డ్రామా నేప‌థ్యంలోనిది. కోల్ కతాలో తిరిగే క‌థాంశం ఇది. నగర శివార్లలోని 10 ఎకరాల భూమిలో కోల్ క‌తా నగరం ప్రకృతి దృశ్యాన్ని పునఃసృష్టి చేయవలసి వచ్చింది.

*కోల్‌కతా గురించి మాట్లాడేటప్పుడు గుర్తుకు వచ్చే మొదటి విషయం కళ. కాబట్టి 1960 ల శకాన్ని ప్రతిబింబించేలా ఇళ్ళు- కార్యాలయ స్థలాలు- వీధులు మొదలైన వాటి నిర్మాణ శైలిని అర్థం చేసుకోవడానికి కోల్ కతాలో ఆ చుట్టుపక్కల నాలుగు నెలలు గడిపాం. ఈ చిత్రం కోసం 100 సంవత్సరాల పురాతన కాళి టెంపుల్ సెట్ కూడా నిర్మించాం.

*ఆలయ ప్రాంగ‌ణాన్ని నిర్మించడానికి ఇటుక - బంకమట్టి - ఎరుపు రంగును ఉపయోగించాం. దీనిని రెండు నెలల్లో 1200 మంది కార్మికులు నిర్మించారు. ఇందులో సగం మంది కార్మికులు కోల్ కతాకు చెందినవారు. ఎందుకంటే వారు మట్టి పనిని బాగా చేస్తారు. వారి స్వంత శైలిని తీసుకురాగ‌ల‌ర‌ని ఎంపిక చేశాం.

*కోల్‌కతాలో ఆసక్తికరమైన ప్రత్యేకమైన ఆలయ నిర్మాణ శైలినే ఇక్క‌డికి తేగ‌లిగాం. మేము ఉపయోగించిన ఎంబాసింగ్ ప్రత్యేకమైనది. సాధారణంగా దక్షిణాదిన దేవాలయాలు రాతితో నిర్మిస్తారు. బెంగాల్ లోని దేవాలయాలు భిన్నమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి. మట్టితో నిర్మిస్తారు... అని ర‌క‌ర‌కాల విష‌యాల్ని అవినాష్ వెల్ల‌డించారు.