వెంకీతో జత కట్టబోతున్న జాతిరత్నం..?

Wed Jun 29 2022 12:00:01 GMT+0530 (IST)

anudeep kv and venkatesh upcoming movie

టాలీవుడ్ సూపర్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. గతేడాది 'నారప్ప' 'దృశ్యం 2' వంటి సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసిన వెంకీ.. ఇటీవల 'ఎఫ్ 3' చిత్రంతో థియేట్రికల్ సక్సెస్ అందుకున్నారు. అయితే సోలోగా దగ్గుబాటి హీరో తదుపరి సినిమా ఎంటనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు.వెంకటేష్ ప్రస్తుతం 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇందులో రానా దగ్గుబాటితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇది వీరిద్దరికీ డిజిటల్ డెబ్యూ కావడం విశేషం. ఇప్పటికే షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తున్న ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది.

అలానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'కభీ ఈద్ కభీ దివాలీ' అనే సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. చాలా గ్యాప్ తర్వాత వెంకీ ఈ సినిమాతో హిందీ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

ఇక తెలుగులో వెంకీమామ నెక్స్ట్ మూవీ గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో మంది దర్శకుల పేర్లు వినిపించాయి కానీ.. అధికారికంగా ఏదీ ప్రకటించబడలేదు. ఇప్పుడు లేటెస్టుగా యువ దర్శకుడు అనుదీప్ కేవీ పేరు తెర పైకి వచ్చింది.

'పిట్టగోడ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్.. 'జాతిరత్నాలు' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. ప్రస్తుతం తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా 'ప్రిన్స్' అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే దర్శకుడు ఈ ప్రాజెక్ట్ తర్వాత స్టార్ హీరో వెంకటేష్ తో జతకట్టే అవకాశం ఉందని నివేదికలు వస్తున్నాయి.

కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన జానర్లు.. అనేక రకాల కథలలో నటించారు వెంకటేష్. అయితే తనదైన శైలి కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. 'ఎఫ్ 2' తర్వాత ఇటీవల 'ఎఫ్ 3' తో మరోసారి తన స్ట్రెంత్ ఇదని నిరూపించారు. ఇకపై అలాంటి సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నాడట.

ఈ నేపథ్యంలోనే జాతిరత్నాలు డైరెక్టర్ తో ఓ కామెడీ మూవీ చేయడానికి రెడీ అయ్యారని టాక్. ఇప్పటికే అనుదీప్ ఓ లైన్ చెప్పాడని.. చెప్పిన పది నిమిషాల్లోనే అది వెంకీ కి బాగా నచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం 'ప్రిన్స్' పోస్ట్ ప్రొడక్షన్ తో బిజీగా ఉన్న దర్శకుడు.. వెంకటేష్ కోసం ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయనున్నారట. వెంకీతో జాతిరత్నం జత కట్టబోతున్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.