రూ.26 కోట్ల మోసం కేసు.. మ్యూజిక్ డైరెక్టర్ నిందితుడు.. కోర్టు తీర్పు ఇదే!

Thu Jun 17 2021 15:04:33 GMT+0530 (IST)

amresh arrested in 26 crore scam

ప్రముఖ కోలీవుడ్ సీనియర్ నటి జయచిత్ర కుమారుడు సంగీత దర్శకుడు అయిన అమ్రీష్ రూ.26 కోట్ల మేర తనను మోసం చేశాడంటూ చెన్నైకి చెందిన నెడు మారన్ అనే బిజినెస్ మేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషన్ కార్యాలయంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. అమ్రీష్ ను అరెస్టు చేశారు.ఆ తర్వాత బెయిల్ పై అమ్రీష్ విడుదలయ్యాడు. అనంతరం.. తనపై అక్రమ కేసు బనాయించారని ఆ కేసును కొట్టి వేయాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. నెడుమారన్ తో ఓ చిత్రానికి సంబంధించిన లావాదేవీలు మాత్రమే జరిగాయని ఆయన నిర్మిస్తానన్న ఒక చిత్రానికి సంగీత దర్శకునిగా పనిచేసేందుకు ఒప్పందం కుదిరిందని పిటీషన్ లో పేర్కొన్నారు.

ఈ క్రమంలో.. తాను అడ్వాన్సుగా కొంత డబ్బు తీసుకున్నానని ఈ వివాదం నేపథ్యంలో కొంత మొత్తం తిరిగి చెల్లించానని మిగిలిన డబ్బు కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాని కోర్టుకు తెలిపారట అమ్రీష్. ఇందుకు సదరు బిజినెస్ మేన్ నెడుమారన్ కూడా అంగీకరించడంతో.. అమ్రీష్ పై ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారని అమ్రీష్ తరపు న్యాయవాది తెలిపినట్టు సమాచారం. దీంతో.. న్యాయస్థానం కేసు కొట్టేసిందని లాయర్ చెప్పినట్టుగా తెలుస్తోంది.