Begin typing your search above and press return to search.

'అల్లు స్టూడియోస్' ఓపెనింగ్ కు సర్వం సిద్ధం.. ఒకే రోజు రెండు కార్యక్రమాలు..!

By:  Tupaki Desk   |   30 Sep 2022 5:19 PM GMT
అల్లు స్టూడియోస్ ఓపెనింగ్ కు సర్వం సిద్ధం.. ఒకే రోజు రెండు కార్యక్రమాలు..!
X
అల్లు ఫ్యామిలీ హైదరాబాద్‌ నగర శివార్లలో ఓ భారీ సినీ స్టూడియోని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 'అల్లు స్టూడియోస్' పేరుతో లెజెండరీ నటులు అల్లు రామలింగయ్య జయంతిని పురస్కరించుకుని రెండేళ్ల క్రితం పనులు మొదలు పెట్టారు. అయితే ఆ స్టూడియో ఇప్పుడు నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది.

అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన అల్లు స్టూడియోస్ ని ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయన చేతుల మీదుగా రేపు ఉదయం 10 గంటలకు స్టూడియో ప్రారంభోత్సవం జరగబోతోంది.

అల్లు స్టూడియోని అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ సారథ్యంలో తనయులు అల్లు అర్జున్‌ - అల్లు బాబీ (వెంకటేష్‌) - అల్లు శిరీష్‌ లు నిర్మించారు. బిల్డింగ్‌ పనులు పూర్తై షూటింగులు చేసుకునేందుకు అందుబాటులోకి రావడంతో గ్రాండ్ గా స్టూడియోని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఓపెనింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ కార్యక్రమంలో చిరంజీవితోపాటు అల్లు అరవింద్‌ - అల్లు అర్జున్ - అల్లు బాబీ - అల్లు శిరీష్‌ మరియు ఇతర అల్లు కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. అల్లు స్టూడియోస్ గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్ కోసం ప్రింట్ & వెబ్ మీడియా సహా అన్ని మీడియా సంస్థలకు ఆహ్వనం అందించారు.

అల్లు రామలింగయ్య 100వ జయంతి వేడుకల్లో భాగంగా రేపు సాయంత్రం 6 గంటల నుండి పార్క్ హయ్యత్ లో మరో కార్యక్రమం జరగనుంది. దిగ్గజ హాస్య నటుడి పేరు మీద పుస్తకావిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు.

అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకుని లెజండరీ నటుడి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా వైభవంగా స్టూడియో ఓపెనింగ్ చేస్తున్నారు. అలానే పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని కొత్త మైలురాయిని జరుపుకోవడానికి మొత్తం కుటుంబం హాజరవుతారు.

కాగా, హైదరాబాద్‌ లోని కొత్తపేట - నార్సింగ్ సమీపంలో 'అల్లు స్టూడియోస్' ని నిర్మించారు. దాదాపు పది ఎకరాల్లో ఈ స్టూడియో నిర్మాణం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీతో, ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఈ నిర్మాణం జరిగింది. సినిమాలు - వెబ్ సిరీస్ లకు సంబంధించిన అన్ని పనులు చేసుకునేలా స్టూడియోని రెడీ చేశారని తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.